Magazines

నిరసనపై నిషేధమా?

1 గంట క్రితం

A ban on protests?
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రశ్నలంటే వణుకు.. నిరసనలంటే భయం.. ప్రజల గొంతు వినిపిస్తే సహించలేని అసహనం! ఇవే నిరంకుశ పాలన లక్షణాలు. ఇందిరాగాంధీ హయాంలో దేశంపై అత్యవసర పరిస్థితిని విధించి ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టి, పత్రికల గొంతు నొక్కిన చరిత్రను భారత ప్రజలు ఇంకా మరిచిపోలేదు. నేడు బీజేపీ కూడా అదే ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలకు వేదికగా నిలిచిన ‘జంతర్‌ మంతర్‌’ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించడం ఈ ప్రశ్నకు తావిస్తోంది. నిరసనలకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను చూపుతూ, వాటిని ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తే అది హక్కును కాపాడటమా? లేక హక్కును కాగితాలకే పరిమితం చేయడమా? విద్యావంతులు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు తమ గోడును దేశానికి వినిపించే ప్రజాస్వామ్య వేదిక. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, నిర్భయ ఘటన అనంతర నిరసనలు, వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతుల ఆందోళనలు, మహిళా రెజ్లర్ల పోరాటం వంటి ఎన్నో ఉద్యమాలకు ఇది సాక్షిగా నిలిచింది. పార్లమెంటుకు సమీపంలో ఉండటంతో ప్రజల ఆవేదన పాలకులకు చేరుతుందన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఈ వేదికను తొలగించడం నిరసనలను అధికార కేంద్రానికి దూరం చేసే చర్యగా కనిపిస్తోంది.

అక్టోబర్‌ 12న ఢిల్లీ పోలీసులు జంతర్‌ మంతర్‌ నిరసన ప్రదేశం హోదాను రద్దు చేసి, రాంలీలా మైదాన్‌, బురారీ మైదాన్‌, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌లను ప్రత్యామ్నాయాలుగా ప్రకటించారు. అయితే, రాంలీలా మైదాన్‌ పార్లమెంటుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండగా, బురారీ, సీబీడీ మైదానాలు పదమూడు కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నాయి. రాంలీలా మైదాన్‌కు రోజుకు రూ.50 వేల అద్దెతోపాటు రూ.55 వేల సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలి. ఇంతటి ఖర్చును చిన్న పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు భరించడం కష్టం. నిరసన స్థలాన్ని పొందడమే భారంగా మారితే, హక్కు ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటుంది? ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కులపై పెరుగుతున్న ఆందోళనలకు అద్దం పడుతున్నాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌)పై వివాదం, ఎన్నికల కమిషన్‌పై ప్రతిపక్షాల నిరస నలు, యువత ఆందోళనల నేపథ్యంలో పోలీసు ఆంక్షలు, నిర్బంధాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల అసంతృప్తికి సమాధానం చెప్పాల్సిన పాలకులు, ఆ అసంతృప్తి వ్యక్తమయ్యే మార్గాలనే మూసివే స్తున్నారనే ఆందోళన పెరుగు తున్నది. ఉద్యమించిన వారిపై ఉక్కుపాదం మోపు తున్నది. జంతర్‌‌మంతర్‌ బారికేడ్లను దాటారానే పేరుతో సీజేపీ నేతలు అశుతోష్‌ ‌రంకా, సౌరవ్‌‌దాస్‌‌లను జ్యుడిషియల్‌ ‌కస్టడీకి పంపి, తీహార్‌ ‌జైలుకు తరలించారు.

ఈ పరిణామాలన్ని చూస్తే దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగు తున్నట్టే కనిపిస్తున్నది. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రజలకు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పిస్తున్నది. శాంతి భద్రతల కోసం తగిన నియంత్రణలు విధించవచ్చుగానీ, నిరసన హక్కును నిర్వీర్యం చేయడానికి వీల్లేదు. 2018లోనూ జంతర్‌ మంతర్‌, బోట్‌ క్లబ్‌ ప్రాంతాల్లో నిరసనలపై సంపూర్ణ నిషేధాన్ని సుప్రీంకోర్టు సమర్థిం చకుండా, నిరసనలకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రదేశాల పేరుతో నిరసనకారులను అధికార కేంద్రానికి దూరంగా నెట్టివేయడం ఆ తీర్పు స్ఫూర్తికే విరుద్ధం. ఢిల్లీలో ఆంక్షలు, ముంబైలో నిరసనకారుల అడ్డగింపుపై న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవడాన్ని ఎలా చూడాలి? నాటి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించి పౌరహక్కులను అధికారికంగా నిలిపివేశారు. నేడు అలాంటి ప్రకటన లేకపోయినా, నిరసన స్థలాలపై ఆంక్షలు, ముందస్తు నిర్బంధాలు, సభలకు అనుమతుల నిరాకరణ వంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని క్రమంగా కుంచించివేస్తున్నాయి. అంటే అత్యవసర పరిస్థితి అధికారికంగా ప్రకటించకపోయినా, ప్రజల హక్కులను పరిమితం చేసే పాలనా ధోరణులు మరో

రూపంలో కొనసాగుతున్నాయి. భిన్నాభిప్రాయాలను అణచివేయడం, విమర్శలను సహించకపోవడం పాలకపార్టీ విధానంగా మారిపోయింది. దేశ రాజధానిలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి సరైన వేదికే లేకపోతే, ప్రజాస్వామ్యం ఎవరికి ఉన్నట్లు? ఓటు వేసే రోజున పౌరులు అవసరం.. మిగతా రోజుల్లో వారి ప్రశ్నలు అనవసరమా? ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు, ఎన్నికల మధ్య కాలంలోనూ పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛను కాపాడటం. నిరసనలను ఖర్చులతో భారంగా మార్చి, దూరప్రాంతాలకు తరలిస్తే అది హక్కును గౌరవించడం కాదు.. ఆచరణలో అడ్డుకోవడమే. ప్రజాస్వామ్యానికి నిజమైన బలం నిరసనలను అణచివేయడంలో కాదు, వాటి వెనుక ఉన్న ప్రజల బాధలను పరిష్కరిం చడం. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ చర్యలను పునఃపరిశీలించి, జంతర్‌ మంతర్‌ వంటి ప్రజాస్వామ్య వేదికల ప్రాధాన్యాన్ని గుర్తించాలి. లేకపోతే రాజ్యాంగం హామీ ఇచ్చిన స్వేచ్ఛకు, ప్రజలు ఆచరణలో ఎదుర్కొంటున్న వాస్తవానికి మధ్య అంతరం మరింత పెరుగుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్