Magazines

విజయదశమి స్ఫూర్తితో...

1 గంట క్రితం

Vijayadashami
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 3 నిమిషాల చదవడం

ఈ రోజు దసరా పండగ. అందరూ ఐక్యంగా జరుపుకునే ఒక మహా ఉత్సవం. పండగ విశిష్టత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భారతీయ సమాజంలో పండుగలు కేవలం కాలానుగుణంగా వచ్చే ఉత్సవాలు మాత్రమే కావు, అవి ప్రజల జీవన విధానంతో, విశ్వాసాలతో ముడిపడి ఉన్న సాంస్కృతిక వారసత్వాలు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని పూజించి పదో రోజున జరుపుకొనే కులమతాలకతీతంగా కలిసి నిర్వహించు కునేదే విజయ దశమి. ఈ పండగలో ఎంతో ప్రాముఖ్య మైన సామాజిక సందేశం కూడా ఉంది. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అజ్ఞానంపై జ్ఞానం సాధించే శాశ్వత విజయానికి ఈ పండుగ మహోన్నత ప్రతీక. మహిషాసుర మర్దన అంటే బయటి రాక్షసులను చంపడం మాత్రమే కాదు, మనలోని అహంకారాన్ని, సమాజంలోని లింగ-కుల వివక్షలను తుదముట్టించడమే! స్త్రీకి గౌరవం, శ్రమజీవికి సమన్యాయం లభించినప్పుడే నిజమైన విజయదశమి! విజయదశమి వెనుక ఎన్నో పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. దేవీ భాగవతం ప్రకారం, లోకాలను కల్లోలపరచిన మహిషాసురుడితో దుర్గాదేవి తొమ్మిది రాత్రులు హోరాహోరీగా పోరాడి, ఆశ్వయుజ శుక్ల దశమి నాడు ఆ రాక్షసుడిని సంహరించి ‘మహిషాసురమర్దిని’గా అమితమైన విజయాన్ని సాధించిందని ప్రచారంలో ఉంది.

మరోవైపు రామా యణంలో, లంకేశ్వరుడైన రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు అపరాజితాదేవిని పూజించి, విజయదశమి నాడే రావణ వధను పూర్తిచేశాడని చెబుతారు. అలాగే మహాభారతంలో, పాండవులు తమ ద్వాదశ వర్ష అరణ్యవాసము, ఒక సంవత్సర అజ్ఞాతవాసాన్ని ముగించుకొని, శమీ (జమ్మి) వృక్షంపై దాచిన తమ దివ్యాస్త్రాలను తిరిగి చేతికి తీసుకున్న పవిత్ర దినంగా మాట్లాడుకుంటారు. ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుడు శమీ పూజ చేసి కౌరవ సేనను ఓడించి విజయం సాధించినట్టు చరిత్ర. అందుకే ఏ ముహూర్తమూ చూడకుండానే కొత్త పనులు, కొత్త విద్యలు ప్రారంభించడానికి ఈ ‘విజయ ముహూర్తం’ ఎంతో అనుకూలమని శతాబ్దాలుగా ప్రజలు విశ్వసిస్తారు. సాయంత్రం వేళ జమ్మి చెట్టును పూజించి ‘‘శమీ శమయతే పాపం..’’అని స్మరిస్తూ జమ్మి ఆకులను బంగారంగా భావించి ఆత్మీయులకు పంచి ఆశీస్సులు తీసుకోవడం, శుభానికి సూచికగా ‘పాలపిట్ట’ను దర్శించడం మన సంస్కృతిలో భాగంగా వస్తున్నాయి. విశ్వాసాలు ఉంటే పర్వాలేదు, కానీ శృతిమించి మూఢ నమ్మకాలవైపు పయనించడం సరికాదు. అయితే ఈ విశ్వాసాల చాటున, ఆధ్యాత్మికత పేరుతో మూఢ విశ్వాసాలను అంటకడుతున్న పరిస్థితి ఉంది. దానికి ఈ తరం కూడా బలవుతున్నది.

శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించడం అవసరం. మహిషాసురుడు అంటే కేవలం పురాణాల్లో కనిపించే రాక్షసుడు మాత్రమే కాదు. మనిషి అంతరంగంలో నివసించే అహంకారం, స్వార్థం, క్రోధం, అసూయ, కామం వంటి దుర్గుణాలకు అతడు ప్రతీక. మనలోని ఈ అసుర లక్షణాలను తుదముట్టించడమే నిజమైన ఆత్మపరిశీలన. అలాగే దేవీ నవరాత్రుల్లో జగన్మాతను శక్తి అవతారాలుగా ఆరాధిస్తారు. కానీ నిజ జీవితంలో మహిళలను పూజలకే పరిమితం చేస్తూ... వారి విద్య, ఉపాధి, ఆస్తి హక్కులు, నిర్ణయాధికారాల్లో వివక్ష చూపిస్తే ఆ ఆరాధనకు అర్థం లేదు. బాలికలకు నాణ్యమైన విద్య, మహిళలకు సమాన అవకాశాలు, పని ప్రదేశాల్లో రక్షణ, స్వేచ్ఛ కల్పించినప్పుడే స్త్రీశక్తికి అసలైన సామాజిక గౌరవం దక్కుతుంది. తెలుగు నేలపై ముఖ్యంగా తెలంగాణలో నవరాత్రుల వేళ పూల పండుగ ‘బతుకమ్మ’ ప్రకృతితో ప్రజలకున్న అనుబంధాన్ని చాటుతుంది. విజయదశమి నాడు నిర్వహించే ‘ఆయుధ పూజ’ లేదా ‘పనిముట్ల పూజ’ శ్రమ గౌరవానికి పీఠం వేస్తుంది.

జీవనోపాధికి ఆధారమైన పరికరాలను పూజించడం వెనుక ఉన్న అసలైన అంతర్యం-రైతు, కార్మికుడు, శ్రమజీవుల శ్రమను గుండెల్లో పెట్టుకుని గౌరవించడమే! శ్రమించే చేతులకు తగిన వేతనం, గౌరవప్రదమైన భద్రత కల్పించినప్పుడే ఏ సమాజమైనా నిజమైన ప్రగతిని సాధించగలుగుతుంది. మరోవైపు పండుగ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుం టూనే శబ్ద కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టి పర్యావరణహితంగా నిర్వహించడం భవిష్యత్ తరాల పట్ల మనకున్న సామాజిక బాధ్యత. విజయదశమి ఆచారాల నిర్వహణకు పరిమితం కాకూడదు. బలాన్ని, అధికారాన్ని ఇతరులపై ఆధిపత్యం చెలాయించ డానికి కాకుండా అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఉపయోగించాలి. రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువలను మన ఆచరణలో నిలబెట్టుకోవాలి. మనలోని స్వార్థాన్ని వీడి సమాజ హితం కోసం ముందడుగు వేయాలి. అధర్మంపై ధర్మం, అజ్ఞానంపై జ్ఞానం, వివక్షపై సమానత్వం, ద్వేషంపై మానవత్వం విజయం సాధించినప్పుడే పండుగ సందేశానికి సార్థకత చేకూరుతుంది. - వై. శాంతి కుమార్, 9849042083

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్