కీలక అంశాల్లో అమెరికా అధ్యక్షుడి పనితీరుపై పెదవి విరుపు
దారుణంగా పడిపోతున్న అప్రూవల్ రేటింగ్
అన్ని పోల్స్ ఫలితం ఇదే ...మధ్యంతరం వేళ బెంబేలెత్తుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ పాలనపై అమెరికన్లలో పెల్లుబుకుతున్న అసంతృప్తి
వాషింగ్టన్ : మధ్యంతర ఎన్ని కలు సమీపిస్తున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీపై అమెరికా ప్రజలు తీవ్ర నిరాశా నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. దేశం సరైన దారిలో నడవడం లేదని, దారి తప్పుతోందని 71 శాతం మంది పెద్దలు ఎన్‌బీసీ న్యూస్ నిర్వహించిన తాజా సర్వేలో తేల్చి చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమె రికా అధ్యక్షఁడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిపబ్లికన్ పార్టీ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఈ స్థాయి లో వ్యక్తం కావడం ఇదే మొదటిసారి. ఈ సర్వేలో అధ్యక్షుడికి మద్దతు ఇచ్చే వారి సంఖ్య 34 శాతానికి పడి పోయింది. రెండో పదవీకాలంలో ట్రంప్ రేటింగ్ ఇంత దారుణంగా పడిపోవడం కూడా ఇదే ప్రథమం. అదే సమయంలో ఆయన వ్యతిరేకుల సంఖ్య 66 శాతానికి పెరిగింది.
సడలిపోతున్న పట్టు
తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని మెజారిటీ అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అంతేకాదు... ఆయన ప్రభుత్వం అత్యంత అవినీతిమయమై పోయిం దని మండిపడ్డారు. అయితే అధికార రిపబ్లికన్, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీలు రెండింటిలోనూ అవినీతి ఉన్నదని వారు తెలిపారు. సిల్వర్ బులెటిన్ సేకరించిన సగటు పోలింగ్ గణాంకాల ప్రకారం...ట్రంప్ రెండో పదవీకాలం ప్రారంభమైనప్పటి నుంచే కీలక అంశాలపై ఆయనకఁ ఉన్న మద్దతు క్రమంగా పడిపోతోంది. ముఖ్యంగా నాలుగు కీలక అంశాలలో ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య అంతరం బాగా ఎక్కు వగా ఉంది. ద్రవ్యోల్బణం విషయంలో ట్రంప్ రేటింగ్ అత్యంత దారుణంగా మైనస్ 48.9 శాతం ఉండగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మైనస్ 32.9 శాతం, వాణిజ్యం విషయంలో మైనస్ 30.6 శాతం నమోదైంది. ఒకప్పుడు ట్రంప్ వలసల విధానానికి అమెరికన్లు గట్టిగా మద్దతు ఇచ్చే వారు. ఇప్పుడు కూడా ఈ విషయంలో ఆయన రేటింగ్ మెరుగైన ఫలితాన్నే ఇస్తున్నప్పటికీ నెట్ రేటింగ్ మైనస్ 11.6 శాతంగా ఉంది. అంటే వలసల విషయంలో ట్రంప్ నిర్ణయాలను 54.1 శాతం మంది వ్యతిరేకిస్తుండగా 42.4 శాతం మంది మాత్రమే సమర్ధించారు. ఆర్థిక పరిస్థితుల విషయంలో ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని సర్వేలో తేలింది. అధికార రిపబ్లికన్ పార్టీతో పాటు ప్రతిపక్ష డెమొక్రాట్ పార్టీపై కూడా వారిలో విశ్వాసం సడలుతోంది. అయితే ప్రజలు అత్యంత తీవ్రంగా విమర్శిస్తున్నది ట్రంప్‌ను, రిపబ్లికన్ పార్టీనే. డెమొ క్రాట్లకు కేవలం 43 శాతం మంది వయో జనులు మాత్రమే మద్దతు ఇస్తున్నారు.
అధ్యక్షుడిగా పనికిరాడు
వాషింగ్టన్ పోస్ట్-ఎబీసీ న్యూస్, ఇప్సోస్-ఫాక్స్ న్యూస్ నిర్వహించిన రెండు తాజా పోల్స్‌లో కూడా ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోందని, ఇరాన్ యుద్ధాన్ని ముగించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు మండిపడ్డారు. ఈ పోల్స్‌లో ట్రంప్ రేటింగ్ 33 శాతంగా మాత్రమే నమోదైంది. ఆయన పనితీరుపై ఏకంగా 66 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ పనికిరాడని 52 శాతం మంది కుండబద్దలు కొట్ట డం గమనార్హం. గత సంవత్సరం ఇదే సమయంలో జరిపిన సర్వేతో పోల్చుకుంటే ఆయన రేటింగ్ ఎనిమిది శాతం పాయింట్లు తగ్గగా జులై నుంచే నాలుగు పాయిం ట్లు పడిపోయింది. తొలి పదవీకాలంతో పోలిస్తే ఆయన రేటింగ్ ఇప్పుడు దారుణంగా దిగజారింది. ఫాక్స్ న్యూస్ విడిగా నిర్వహించిన పోల్‌లో దేశాధ్యక్షుడిగా ట్రంప్ పనితీరుపై 36 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏ విధానంలో చూసినా వ్యతిరేకతే
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో డెమొక్రాట్ల పైనే ఓటర్లు విశ్వాసం వ్యక్తం చేశారు. గడచిన దశాబ్ద కాలంలో ఆర్థిక వ్యవహారాలలో డెమొ క్రాట్ల పనితీరుపై మెజారిటీ ఓటర్లు నమ్మ కం ఉంచడం ఇదే మొద టిసారి. కాగా దేశం తప్పు డు దారిలో నడుస్తోం దని 72 శాతం మంది స్పష్టం చేశారు. ఆర్థిక విధానాలు, టారిఫ్‌లు, విదేశాంగ విధానం, ఇమ్మిగ్రేషన్ పాలసీ...ఇలా ఏ విషయం లో చూసుకున్నా ట్రంప్ వ్యతిరేకుల సంఖ్య 56 శాతం నుంచి 70 శాతం వరకూ ఉంది. రిపబ్లికన్ రిజిస్టర్డ్ ఓటర్లతో పోలిస్తే డెమొక్రాట్ రిజిస్టర్డ్ ఓటర్ల సంఖ్యే అధికంగా ఉన్నదని సర్వేలు తెలిపాయి. 45 సంవత్సరాలు-అంతకంటే తక్కు వ వయసున్న ఓటర్లు, శ్వేతజాతీయులు కాని ఓటర్లు, కాలేజ్ డిగ్రీ ఉన్న వారు, వార్షిక ఆదాయం యాభై వేల డాలర్ల కంటే తక్కు వ ఉన్న కుటుంబాలలో ట్రంప్‌పై వ్యతిరేకత అధికంగా ఉంది.
డెమొక్రాట్లదే ప్రతినిధులసభ
ప్రతినిధులసభలో మొత్తం 435 స్థానాలు, సెనెట్‌లోని 35 స్థానాలకు వచ్చే నెల 3వ తేదీన ఎన్ని కలు జరగనున్న తరుణంలో వెల్లడవుతున్న సర్వేల ఫలితాలు రిపబ్లికన్లను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతినిధులసభలో డెమొక్రాట్లు ఆధిక్యత సంపాదిస్తారని, సెనెట్ పోరు హోరాహోరీగా ఉంటుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ప్రతినిధులసభలో డెమొక్రాట్లు మెజారిటీ సాధించిన పక్షంలో తన చివరి రెండు సంవత్సరాల పదవీకాలంలో లెజిస్లేటివ్ ఎజెండాను ముందుకు తీసుకుపోవడంలో ట్రంప్‌నకు ఇబ్బంది తప్పకపోవచ్చు.






కామెంట్‌లు (0)