కాలిఫోర్నియాలో వుంటూ అనిల్ పండిట్ స్కెచ్
ముంబయి : గత ఎనిమిది మాసాల్లో భారత్‌లో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని మూడు చోట్ల హర్యానా, ఢిల్లీ, ముంబయిల్లో కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటి వెనుక వున్నది ఒకే ఒక్క వ్యక్తి-అనీల్ పండిట్. పానిపట్ నివాసి అయిన పండిట్, లారెన్స్ బిష్ణోయ్ ముఠా తరపున కాలిఫోర్నియా నుంచి పనిచేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులకు తమదే బాధ్యత అని ప్రకటించాడు. ఈ మేరకు పలు భద్రతా సంస్థలకు ఆడియో క్లిప్ కూడా అందింది. అనీల్ నేర చరిత్రను పరిశీలిస్తే, గతంలో పశ్చిమ ఢిల్లీలో ఒక జిమ్‌లో వున్న పంజాబీ గాయకుడు గురు రాంధ్వాను జూన్ 11న కాల్చి చంపిన ఘటన వెనక కూడా అనీల్ పండిట్ హస్తం వుంది.
ఆ కేసు దర్యాప్తులో పోలీసులు పలువురిని అరెస్టుచేయగా, దర్యాప్తు సమయంలో కీలక కుట్రదారునిగా పండిట్ పేరు బయటకు వచ్చింది. అలాగే హర్యానా గాయకుడు దిలేర్ ఖర్కియాపై ఆయన సొంత వూరు భివానిలో దాడి జరిగింది. ఈ దాడి నుండి ఆయన తృటిలో ప్రాణాప్రాయం నుండి తప్పించుకున్నారు. అలాగే కర్నాల్, పానిపట్, సోనీపట్ వంటి ప్రాంతాల్లో బలవంతంగా డబ్బు వసూలుకు ప్రయత్నించిన కేసుల్లోకూడా పండిట్ పేరు బయటకు వచ్చింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త మనీష్ జైన్‌ను రూ.5కోట్లు ఇవ్వాలంటూ బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇలా దాదాపు 10, 12 కేసుల్లో పోలీసులకు అనీల్ పండిట్ కావాల్సిన వ్యక్తిగా వున్నాడు. భారత్‌లో అవసరమైన నెట్‌వర్క్‌ను సమకూరుస్తూ, దాడులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.





కామెంట్‌లు (0)