Magazines

పశు గ్రాస గండం

1 గంట క్రితం

Fodder Crisis
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 3 నిమిషాల చదవడం

ఎల్‌నినో నీడలో మూగజీవాల రోదన!

కార్యాచరణ ఎప్పుడో?

25 నుంచి 30 శాతం వరకు గడ్డి కొరత ఏర్పడే ప్రమాదం

పశుగ్రాసం, తాగునీటినకి కొరత

నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

​వాతావరణంలో చోటుచేసుకుంటున్న తీవ్ర ప్రతికూల మార్పులు, ముఖ్యంగా ఎల్‌నినో ప్రకోపం, ప్రభావం సాగు రంగాన్నే కాక, దానికి అనుబంధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా ఉన్న పాడి పరిశ్రమనూ తీవ్రంగా కుదిపేస్తోంది. వర్షాభావ పరిస్థితులు, రోజురోజుకూ పెరిగిపోతున్న భానుడి భగభగలు, భూగర్భ జలాలు అగాథానికి పడిపోతుండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు పచ్చగడ్డి లభించడం గగనంగా మారింది. మరోవైపు తాగేందుకు కనీసం గుక్కెడు మంచి నీరు కూడా దొరకని దయనీయ స్థితి గ్రామీణ ప్రాంతాల్లో దాపురిస్తోందని ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్ పై అన్నదాతలకు భయం పట్టుకుంది. వ్యవసాయం కలిసిరాక, పంటలు పండక సతమతమవుతున్న రైతుకు చేదోడువాదోడుగా నిలుస్తూ, కుటుంబ పోషణకు ఆసరాగా నిలుస్తున్న పాడి పరిశ్రమపై ఈ వాతావరణ సంక్షోభ ప్రభావం తీవ్రంగా పడుతుండటంతో పల్లెల్లో పాడిరైతులు దిక్కుతోచని ఆందోళనలో కూరుకుపోతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆవులు, ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు కలిపి సుమారు 4.50 లక్షల నుంచి 5 లక్షల వరకు జీవాలు, పశుసంపద విస్తరించి ఉన్నాయి.

​అవసరమైన పశుగ్రాసం

​పచ్చిమేత కోసం అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని పశువుల అవసరాలకు ఏటా దాదాపు 6.5 లక్షల నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చిమేత అవసరమవుతుంది. వరి గడ్డి, జొన్న జొళ్లు, మొక్కజొన్న చొప్ప తదితర రూపాల్లో దాదాపు 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎండుమేత అవసరముంటుంది. వర్షాభావం, ఎల్‌నినో ప్రభావం వల్ల జిల్లాలో దాదాపు 25 శాతం నుంచి 30 శాతం వరకు పశుగ్రాస కొరత ఏర్పడే ప్రమాదం ముంచుకొచ్చింది.

​పాడి పరిశ్రమ ప్రణాళికలు కాగితాలకే పరిమితం

పాడి పరిశ్రమ అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా ప్రకటిస్తున్న ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశువుల షెడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోవడం, సబ్సిడీల ప్రక్రియలో జాప్యం, పశుగ్రాస విత్తనాల కొరతతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ నేపియర్, మొక్కజొన్న, జొన్న తదితర పశుగ్రాస విత్తనాలను రాయితీపై అందిస్తున్నామని చెబుతున్నా, అర్హులైన రైతులందరికీ చేరడం లేదనే ఆరోపణలున్నాయి. ఎల్‌నినో ముప్పును దృష్టిలో పెట్టుకుని పశుగ్రాసం, నీటి సదుపాయాలు, పశువైద్యం, వ్యాధి నిరోధక టీకాలపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

​పాడి రంగాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి

ఎల్‌నినో ముప్పు నుంచి జిల్లా పాడి రంగాన్ని, పశువులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ప్రతి గ్రామంలో పశుగ్రాస సేకరణ, పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస విత్తనాలను ఉచితంగా లేదా 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని కోరుతున్నారు. పశువుల తాగునీటి కోసం ప్రత్యేక తొట్టెలు నిర్మించి, నిలిచిపోయిన పశువుల షెడ్లను వెంటనే పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ప్రకటనలకే పరిమితం కాకుండా, పాడి రైతులు, మూగజీవాలను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.​

​పశుగ్రాసం, తాగునీరు ఉచితంగా అందించాలి
ఖమ్మం జిల్లాలో రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం వల్ల పశుగ్రాసం, తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున మూగజీవాలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవా‌లి. సబ్సిడీ కాకుండా పశుగ్రాసం, వరిగడ్డి, పశు దాణాలను పూర్తిగా ఉచితంగా అందించాలి. అలాగే రైతులు స్వయంగా పశుగ్రాసం పెంచుకునేందుకు వీలుగా విత్తనాలను ఉచితంగా అందజేయాలి. పశువుల తాగునీటి కోసం కుంటలు, చెరువుల్లో వెంటనే నీటిని నింపి, శిథిలమైన కమ్యూనిటీ నీటి తొట్లను పునరుద్ధరించి నీటితో నింపే ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా, ఎల్‌నినో ప్రభావంతో అనారోగ్యాలపాలవుతున్న పశువుల రక్షణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలి. గ్రామాల్లోని పశువుల ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న లైవ్‌స్టాక్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేసి సరైన నిర్వహణ ఉండేలా ప్రభుత్వం చూడాలి.
-తెలంగాణ రైతు సంఘం, 
ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్


​​అల్లాడుతున్న మూగజీవాలు

​​రాబోయే కాలంలో పశువుల మేత, తాగునీటి కొరత మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాద ఘంటికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో పచ్చిమేత లభ్యత ఘోరంగా పడిపోవడమే కాకుండా, విపరీతమైన డిమాండ్ కారణంగా బయట మార్కెట్‌‌లో ఎండుమేత, దానా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో రోజువారీ మేతను కొనుగోలు చేయడం సామాన్య పాడిరైతుకు ఆర్థికంగా భరించలేని భారంగా మారింది. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన నీటి వనరులైన కాలువలు, చెరువులు, కుంటలు, వాగులు అప్పుడే ఎండిపోతుండటంతో మూగజీవాలు తాగునీటి కోసం దప్పికతో అలమటించే పరిస్థితి ఉందని అంటున్నారు. తగినంత పోషకాహారం, తాగడానికి నీరు అందక పశువులు నీరసించిపోతుండటంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. ఇది పాడిపైనే ఆధారపడి జీవించే వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాల నిత్య జీవితాన్ని, ఆర్థిక స్థితిని దెబ్బతీస్తోంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్