Magazines

తనయ్‌ పాంచ్‌ పటాకా

1 గంట క్రితం

Tanay – The Firecracker
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 3 నిమిషాల చదవడం

త్యాగరాజన్ ఐదు వికెట్ల మాయాజాలం

ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ 184 ఆలౌట్‌

హైదరాబాద్‌కు విలువైన తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం


నవతెలంగాణ-విజయనగరం

ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో తెలుగు జట్ల ముఖాముఖిలో హైదరాబాద్‌ ముందంజలో కొనసాగుతోంది. తొలి రోజు హైదరాబాద్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే ఆంధ్ర ఆలౌట్‌ చేయగా.. రెండో రోజు ఆటలో ఆంధ్రను 184 పరుగులకే హైదరాబాద్‌ కుప్పకూల్చింది. తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 91 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. హైదరాబాద్‌ స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ (5/63) ఐదు వికెట్ల మాయాజాలంతో ఆంధ్రను స్వల్ప స్కోరుకు పరిమితం చేశాడు. రెండో రోజు ఆటలో తొలి బంతికే ఓపెనర్‌ అభిషేక్‌ రెడ్డి (5)ని క్లీన్‌ బౌల్డ్‌ చేసిన కెప్టెన్‌ మహ్మద్‌ సిరాజ్‌.. వికెట్ల వేటకు తెరతీశాడు. మరో ఓపెనర్‌ హేమంత్‌ రెడ్డి (10)ని తనయ్‌ త్యాగరాజన్‌ సాగనంపాడు. దీంతో 32 పరుగులకే ఆంధ్ర ఓపెనర్లను కోల్పోయింది. షేక్‌ రషీద్‌ (61, 114 బంతుల్లో 8 ఫోర్లు), కెప్టెన్‌ రికీ భుయ్‌ (28, 56 బంతుల్లో 3 ఫోర్లు) మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నిర్మించారు. షేక్‌ రషీద్‌ అర్థ సెంచరీతో నిలదొక్కుకున్నాడు. రికీ భుయ్‌ సైతం క్రీజులో కుదురుకున్నాడు. అర్థ సెంచరీ భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మెరుపు ఫీల్డింగ్‌తో తనయ్‌ త్యాగరాజన్‌ రనౌట్‌గా సాగనంపాడు.

ఆ తర్వాత మిడిల్‌ ఆర్డర్‌ హైదరాబాద్‌ స్పిన్‌ మాయ ముందు తేలిపోయింది. రేవంత్‌ రెడ్డి (12), కెవి శశికాంత్‌ (14), సౌరభ్‌ కుమార్‌ (1) సహా షేక్‌ రషీద్‌లు తనయ్‌ త్యాగరాజన్‌ మాయకు వికెట్లు కోల్పోయారు. కర్నాటకతో మ్యాచ్‌లో రాణించిన సీరమ్‌ రాహుల్‌ (27, 81 బంతుల్లో 2 ఫోర్లు), లలిత్‌ మోహన్‌ (0) అనికెత్‌ రెడ్డి మాయలో పడ్డారు. హైదరాబాద్‌ బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్‌, అనికెత్‌ రెడ్డి, మహ్మద్‌ సిరాజ్‌లు ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. ఇద్దరు రనౌట్‌గా నిష్క్రమించారు. 63 ఓవర్లలో 184 పరుగులకు కుప్పకూలిన ఆంధ్ర.. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం కోల్పోయింది. ఐదు వికెట్ల మాయతో తనయ్‌ త్యాగరాజన్‌ హైదరాబాద్‌ను ముందంజలో నిలిపాడు. త్రిపురతో రంజీ మ్యాచ్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శనతో తనయ్‌ త్యాగరాజన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

రాణించిన తన్మయ్‌ అగర్వాల్‌

రెండో రోజు మూడో సెషన్లో బ్యాట్‌ పట్టిన హైదరాబాద్‌, రెండో ఇన్నింగ్స్‌లో 78/2తో ఆడుతోంది. ఓపెనర్‌ తన్మయ్ అగర్వాల్‌ (49 బ్యాటింగ్‌, 72 బంతుల్లో 4 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నాడు. 72 బంతుల్లో 4 ఫోర్లు కొట్టిన అగర్వాల్‌..ఓ ఎండ్‌లో నిలబడ్డాడు. మరో ఓపెనర్‌ అభిరథ్‌ రెడ్డి (23, 50 బంతుల్లో 1 ఫోర్‌) మంచి ఆరంభం అందుకున్నా.. సాయితేజ ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రాహుల్‌ సింగ్‌ (2) రెండో రోజు ఆఖరు బంతికి వికెట్‌ కోల్పోయాడు. దీంతో 23 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ 78 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకుని రెండో రోజు ఆట ముగిసే సమయానికి 169 పరుగుల ముందంజలో కొనసాగుతోంది.

స్కోరు వివరాలు

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ : 275/10

ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ : హేమంత్‌ రెడ్డి (సి) ప్రజ్ఞయ్‌ రెడ్డి (బి) త్యాగరాజన్‌ 10, అభిషేక్‌ రెడ్డి (బి) మహ్మద్‌ సిరాజ్‌ 5, షేక్‌ రషీద్‌ (ఎల్బీ) త్యాగరాజన్‌ 61, రికీ భుయ్‌ (రనౌట్‌) త్యాగరాజన్‌ 28, సీరమ్‌ రాహుల్‌ (ఎల్బీ) అనికెత్‌ రెడ్డి 27, రేవంత్‌ రెడ్డి (బి) త్యాగరాజన్‌ 12, కెవి శశికాంత్‌ (ఎల్బీ) త్యాగరాన్‌ 14, సౌరభ్‌ కుమార్‌ (బి) త్యాగరాజన్‌ 1, త్రిపురణ విజయ్‌ నాటౌట్‌ 25, లలిత్‌ మోహన్‌ (బి) అనికెత్‌ రెడ్డి 0, కావురి సాయితేజ (రనౌట్‌) హిమతేజ 0, ఎక్స్‌ట్రాలు : 1, మొత్తం : (63 ఓవర్లలో ఆలౌట్‌) 184.

వికెట్ల పతనం : 1-9, 2-32, 3-91, 4-112, 5-128, 6-248, 7-149, 8-164, 9-165, 10-184.
బౌలింగ్‌ : తనయ్‌ త్యాగరాజన్‌ 20-4-63-5, అనికెత్‌ రెడ్డి 18-1-6-2, మహ్మద్‌ సిరాజ్‌ 11-2-31-1, సివి మిలింద్‌ 7-1-13-0, రుత్విక్‌ యాదవ్‌ 7-0-17-0.

హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌ : తన్మయ్‌ అగర్వాల్‌ నాటౌట్‌ 49, అభిరథ్‌ రెడ్డి (ఎల్బీ) సాయితేజ 23, రాహుల్‌ సింగ్‌ (ఎల్బీ) సాయితేజ 2, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (23 ఓవర్లలో 2 వికెట్లకు) 78.
వికెట్ల పతనం : 1-71, 2-78.

బౌలింగ్‌ : సౌరభ్‌ కుమార్‌ 9-1-24-0, త్రిపురణ విజయ్‌ 8-0-36-0, లలిత్‌ మోహన్‌ 3-0-11-0, కావురి సాయితేజ 3-1-4-2.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్