రాష్ట్రంలోని సుమారు రెండు కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై సమరభేరి మోగించేందుకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) సిద్ధమైంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2026 అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని ఇందిరాపార్కు (ధర్నా చౌక్) వద్ద రెండు రోజుల పాటు ‘మల్టిపుల్ డేస్ మహాధర్నా’ను నిర్వహించనుంది. ఈ ధర్నా కేవలం కొన్ని డిమాండ్ల సాధన కోసం నిర్వహించే సాధారణ నిరసన కాదు, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రశ్నిస్తూ అన్ని రంగాల కార్మికులను ఐక్య పోరాటంలోకి సమీకరించే ఉద్యమం.
కార్మికుల శ్రమతోనే దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడుతున్నప్పటికీ, సృష్టిస్తున్న సంపదలో వారికి దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కడం లేదు.
ఉత్పత్తి, ఆర్థిక వృద్ధి పెరిగినా కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడటం లేదు.పెరిగిన ధరలతో పోలిస్తే నిత్యజీవిత అవసరాలు తీరక కుటుంబాలు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నాయి. విపరీతంగా పెరిగిన నిత్యావసరాలు, విద్యుత్, వైద్యం, చదువులు, గ్యాస్, ఇంధన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో నిజమైన ఆదాయం పడిపోతోంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలైన-ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ (పర్మినెంట్), స్కీమ్ వర్కర్లకు మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలను అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు. పాలకులు సమీక్షలు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ హామీలను విస్మరిస్తున్నారనే విమర్శ వ్యక్తమవుతోంది.
29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి.
యజమానులకు అనుకూలంగా వ్యాపారాన్ని సులభతరం చేయడం అనే పేరుతో కార్మికుల సమ్మె హక్కు, ఉద్యోగ భద్రత, సంఘటిత శక్తిని ఇవి బలహీనపరుస్తున్నాయి. పాత చట్టాలనే అమలు చేయాలని కార్మికులు , సంఘాలు డిమాండ్ చేస్తున్నా కేంద్రం కఠిన వైఖరినే ప్రదర్శిస్తోంది. యజమానులకు లాభాలు వచ్చే విధానాలనే అవలంభి స్తోంది. ఇప్పటికైనా నాలుగు లేబర్కోడ్స్ను రద్దు చేయాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బ ణానికి అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించాలి. వేతన నిర్ణాయక మండలిలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఏండ్ల తరబడి సేవలంది స్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని, సింగరేణి సహా పలు ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులను క్రమ బద్ధీకరించాలి. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకేపీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తగిన వేత నాలు, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలి. మున్సిపల్, గ్రామపంచాయతీ పారి శుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి.
పంచాయతీ కార్మికులకు చెల్లిస్తున్న రూ.9,500 నామమాత్రపు వేతనాన్ని పెంచి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.
ప్రైవేటు, ప్రభుత్వ, అసంఘటిత, బీడీ, భవన నిర్మాణ, రవాణా, హమాలీ తదితర రంగాల సమస్యలకు మూలం ఒక్కటే- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు. కార్మికుల మధ్య కులం, మతం, ప్రాంతం, తాత్కాలిక, శాశ్వత వ్యత్యాసాలు పక్కనబెట్టి ఐక్యంగా పోరాడితేనే హక్కులు కాపాడుకోగలం. అక్టోబర్ 25, 26 తేదీల్లో జరిగే ఈ ‘మల్టిపుల్ డేస్ మహాధర్నా’ ప్రభుత్వాలకు హెచ్చరికగా మాత్రమే కాక, రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్మిక ఉద్యమాన్ని నిర్మించేందుకు ఆరంభ సూచిక కావాలి. కార్మికులందరూ తరలివచ్చి నిరసనను జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఎస్ఎస్ఆర్ఎ ప్రసాద్, 9490300867







కామెంట్లు (0)