Magazines

పెరుగుతున్న ధరలు - భారమవుతున్న జీవితాలు

2 గంటల క్రితం

Rising Prices
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 5 నిమిషాల చదవడం

నెలాఖరున జీతం పడిందన్న మెసేజ్ చూసి ఆనందించే రోజులు పోయాయి. ఇప్పుడు ఆ మెసేజ్ వచ్చిన గంటలోపే పాల బిల్లు, గ్యాస్, అద్దె, పిల్లల ఫీజులు లెక్కేసుకుని నిట్టూర్చడమే మిగిలింది. జీతం అలాగే ఉంది. కానీ దాని కొనుగోలుశక్తి ప్రతి నెలా తగ్గిపోతోంది. ఆర్థికవేత్తలు దీన్ని ‘‘కొనుగోలు శక్తి క్షీణత’’ అంటారు. సామాన్య ప్రజానీకం, మధ్యతరగతి భాషలో పరిస్థితి ఏమీ కొనేటట్టు లేదు, ఏమీ తినేటట్టు లేదు. ఇది ఎవరో ఊహించి చెబుతున్న మాట కాదు. కేంద్ర ఆర్థిక శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం తాజా నెలవారీ సమీక్షలో, వాతావరణం, భౌగోళిక రాజకీయాలు, యుద్ధ వాతావరణం, ద్రవ్య విధానం అనే ఒత్తిళ్లు కలిసి ధరల ముప్పును పెంచుతు న్నాయని అంగీకరించింది. ముంచుకొస్తున్న పర్యావరణ మార్పులతో బలమైన ఎల్‌నినో రబీ పంటను దెబ్బతీయవచ్చు. నిరంతరం మారుతున్న అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులతో ముడిచమురు ధరల పెరుగుదల,

అమెరికా ఫెడరల్ బ్యాంకు సెప్టెంబరులో చేసిన వడ్డీ పెంపు, దిగుమతి చేసుకొనే వస్తువుల ద్రవ్యోల్బణాన్ని ఇంకా పెంచవచ్చు. పండుగ డిమాండ్, పెరిగిన ముడిసరుకు ఖర్చులు ఆ మంటకు మరింత ఆజ్యం పోస్తాయి. రష్యా చమురు కొనే దేశాలపై వంద శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే కొత్త చట్టం కూడా అనిశ్చితిని పెంచింది. గణాంకాలూ అదే చెబుతున్నాయి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. రిజర్వ్ బ్యాంక్ లక్ష్యమైన 4 శాతాన్ని ఇది వరుసగా మూడో నెల దాటింది. టోకు ధరల ద్రవ్యోల్బణం 9.92 శాతానికి ఎగబాకింది. టోకు ధరలు పెరిగితే ఆ భారం త్వరలోనే ధరల పెరుగుదలకు మూలకారణమౌతుంది. సామాన్యుల రోజువారీ జీవితాల మీద ప్రభావం పడుతుంది.

అడ్డూ అదుపు లేని ధరలు

పెరిగే ధరలూ, పన్నుల భారం ప్రజలు భరించాలి. రష్యా చౌకగా సప్లై చేసిన ముడిచమురు లాభాల పంట ముఖేష్ అంబానీకా? ఇదెక్కడి న్యాయం. రష్యా ఇచ్చిన రాయితీల వలన ప్రజలు కొన్న పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదు. గత సంవత్సర కాలంలో లీటర్ పెట్రోలు, డీజిల్ ధరలు దాదాపు ఎనిమిదిన్నర, వంట గ్యాస్ సిలెండర్ రూ.89, లీటర్ పాలు రూ.2 పెరిగాయి. బియ్యం ధర రోజుకొక తీరుగా పెరుగుతోంది. గత నెలరోజుల కాలంలోనే కిలోకి పది రూపాయల దాకా పెరిగింది. కిలో కంది పప్పు, మినప పప్పు, పెసర పప్పు, శనగ పప్పు ధరలు రూ.10 నుంచి రూ.16 వరకు పెరిగాయి. వంట నూనెలు, కూరగాయల ధరలు అంతులేకుండా పెరుగుతున్నాయి. కుటుంబ, నెల జీతాలను బట్టి జనాభాలో అత్యధిక శాతం గా ఉన్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఈ శరాఘాతం కోలుకోలేని దెబ్బతీస్తున్నది. పేద, మధ్యతరగతి బడ్జెట్‌లో సింహభాగం తిండి, వంట నూనెలు, కూరగాయలు, రవాణా, మందులకే పోతుంది, ఇవే ఎక్కువగా పెరిగేవి. ధనికుడికి ధరల పెరుగుదల ఒక వార్త. పేదవాడి జీవితం పై అది ఎంతో ప్రభావం చూపిస్తుంది. అసంఘటిత రంగంలో, కాంట్రాక్టు ఉద్యోగాల్లో, చిన్న ప్రైవేటు సంస్థల్లో జీతాల పెంపు దాదాపు మర్చిపోయిన మాట. పెరిగిన ధరల ముందు స్థిర వేతనం అంటే వేతన కోతే.

ధరలు పెరుగుతున్నాయి, ఆదాయాలెక్కడ?

ఉపాధి విషయంలో ప్రభుత్వ నివేదికే ఒక చేదు నిజం చెప్పింది. అమెరికాతో వాణిజ్య అనిశ్చితి, సుంకాల ఒత్తిడి, చమురు ధరల అస్థిరత, ప్రపంచ కృత్రిమ మేధ (ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్) పోటీలో భారత్‌కు పెట్టుబడులను ఆకర్షించడం కష్టమవుతోందని అంగీకరించింది. పెట్టుబడి లేకపోతే కొత్త ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయి? సరఫరా షాక్‌ల వల్ల వచ్చే ద్రవ్యోల్బణం, వృద్ధిని కూడా అడ్డుకుంటుందని నివేదిక చెప్పింది. అంటే ధరలు పెరుగుతూ, ఉద్యోగాలు జీవనోపాధి తగ్గే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇక్కడే అసలు అన్యాయం కూడా జరుగుతుంది. ధరలు పెరిగినప్పుడు కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారుడిపైకి నెట్టి లాభాలు కాపాడుకుంటాయి. కార్మికుడికి ఆ రక్షణ లేదు. ఫలితంగా సంపద పైకి, భారం కిందికి ప్రవహిస్తోంది. ఆదాయ అసమానతలు పెరగడానికి ద్రవ్యోల్బణం ఒక నిశ్శబ్ద యంత్రంలా పనిచేస్తోంది. ఈ సవాళ్లు సమీప భవిష్యత్తులో పరిష్కారమవుతాయని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. ఆశావాదం ఇంటి బడ్జెట్‌ను బ్యాలెన్స్ చేయదు కదా. ఆర్థిక వ్యవస్థలో సరఫరా (సప్లై) వైపు చర్యలతో ధరల ముప్పును అదుపు చేయవచ్చని ప్రభుత్వమే చెప్పింది. అయితే ఆ మాటలు కార్యరూపం దాల్చలేదు. ధరలు పెరిగినా సంపాదన, వేతనాలు, ఉద్యోగాలు కూడా పెరిగితే ఇబ్బంది ఉండదు. అసలు సమస్య అక్కడే ఉంది. ప్రభుత్వ ఉపాధి సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం ఏప్రిల్- జూన్ మధ్య దేశంలో నిరుద్యోగం 5.4 శాతం ఉంది. 15-29 ఏండ్ల యువతలో ఇది 15.9 శాతం. ఈ సర్వే మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధికం. యువతులలో 19.6 శాతం. పట్టణ యువత లో నిరుద్యోగులు 6.8 శాతం.

రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు పెంచితే ఉల్లి, పెట్రోల్ ధరలు తగ్గుతాయా?

రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కూడా ఈ ప్రమాదాన్ని గుర్తించింది. అక్టోబరు 7న రెపో రేటును 5.25 నుంచి 5.50 శాతానికి పెంచింది. రెపో రేటు అంటే ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే అప్పుపై వడ్డీ. అది పెరిగితే బ్యాంకులు ఇచ్చే రుణాల వడ్డీలూ పెరుగుతాయి. ఇకపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని, పెంచడమో లేదా యధాతధంగా ఉంచడమో మాత్రమే జరుగు తుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. నిత్యావసర వస్తువుల ధరలు అన్ని పెరుగుతూనే ఉన్నాయని, ముఖ్యంగా చక్కెర, ఉల్లి ధరలలో ప్రత్యేక పెరుగుదల ఉందని ఒప్పుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం సగటు ధరల పెరుగుదల 5.2 శాతం ఉంటుం దని, అక్టోబరు-డిసెంబరులో 6 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. అదే సమయంలో జూన్ త్రైమాసికంలో దేశ వృద్ధి 7.8 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ పరుగెడుతోంది, ధరలూ అంతకంటే వేగంతో పెరుగుతున్నాయి. వడ్డీ రేటు పెంచితే జనం ఖర్చు చేసే సామర్థ్యం తగ్గి ధరలు కొంత చల్లారవచ్చు. కానీ ఉల్లి కొరతకు కారణం వానలు లోపించడం, పంట దిగుబడి తగ్గటం. పెట్రోల్ ధరకు కారణం ముడిచమురు ధరలలో పెరుగుదల. ఇలా సరుకుల కొరత వల్ల వచ్చే ధరల పెరుగుదలను వడ్డీ రేటు మార్పుతో నియంత్రించలేమనేది జగమెరిగిన సత్యం. అంటే ఉల్లి, పెట్రోల్ ధరలను నేరుగా దించే మందు వడ్డీ రేటులో లేదు. పైగా రెపో రేటుతో ముడిపడిన ఇంటి, వాహన, ఇతర రుణాల ఈఎంఐలు పెరిగి, ధరల భారంపై వడ్డీ భారం కూడా పడుతుంది.

ధరలకు కళ్లెం వేయాల్సింది ప్రభుత్వం కాదా?

ధరల నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై కేంద్ర, రాష్ట్ర పన్నుల భారం తగ్గిస్తే రవాణా ఖర్చు తగ్గి నిత్యావసరాల ధరలు అదుపులోకి వస్తాయి. బఫర్ నిల్వలను పెంచుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు, పప్పులు, నూనెలను చౌకగా సరఫరా చేయాలి. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై, గుత్తాధిపత్యాలు, కార్టెల్ ధరలపై కఠిన చర్యలు తీసుకోవాలి. రైతుల నుంచి నేరుగా పంటలను గిట్టుబాటు ధరకు సేకరించి ప్రజలకు సరఫరా చేయడంతో పాటు ఎల్‌నినో ముప్పు దృష్ట్యా పంట బీమా, మద్దతు ధర కల్పించాలి. కార్మికుల కనీస వేతనాలను ధరల సూచీకి అనుసంధానించాలి, కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకూ విస్తరించి నిధులు, పనిదినాలు పెంచాలి. వస్త్ర, ఆహార శుద్ధి, నిర్మాణం, ఆరోగ్యం, విద్య వంటి ఎక్కువ ఉపాధి కల్పించే రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెంచి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. చౌకగా రుణాలు అందించడంతో పాటు వడ్డీ రేట్ల పెంపు వల్ల గృహ, వాహన రుణాల భారం సామాన్యుడిపై పడకుండా సరఫరా పెంపుదలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సంపన్నులపై వారసత్వ, సంస్థ పన్నులు విధించడమే కాకుండా జీఎస్టీ, బ్యాంకుల డివిడెండ్లు, ఆర్‌బీఐ బదిలీ చేసిన నిధులను ధరల తగ్గింపునకు ఉపయోగించాలి, లేకపోతే ఆర్థిక అంతరాలు పెరిగి అభివృద్ధి తిరోగమించే ప్రమాదం ఉంది.


పి.వెంకటరామయ్య, 9553533815

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్