‘కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా’ అనే సామెత వినే ఉంటాం. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఐదుగురు పసికందుల మృతిపై దర్యాప్తు తీరు.. ఆ సామెతను ప్రత్యక్షంగా చూపిస్తున్నది! యాభై పేజీల నివేదిక.. సుదీర్ఘ విచారణ.. ప్రత్యక్ష పరిశీలన.. పలువురి వాంగ్మూలాలు.. చివరకు తేలిందేమిటంటే.. ఏసీల నిర్వహణలోపం, ఎలుకల సంచారమే ప్రమాదానికి కారణమని! ఏసీలను నిర్వహించాల్సినవారు, ఎలుకలను అరికట్టాల్సినవారు ఎవరు? వారిని పర్యవేక్షించాల్సిన అధికారుల పాత్ర ఏమిటి? ఐదుగురు పసికందులు మృతిచెంది ఇన్నిరోజులైనా ఒక్కరిపైనా చర్యలు లేవు. ప్రమాదానికి కారణాలు తేల్చిన నివేదిక.. కారకులను మాత్రం ఎందుకు గుర్తించలేదు? కొండంత ‘నిర్లక్ష్యాన్ని’ తవ్వి, చివరకు ఏసీలు, ఎలుకలకు ఆపాదించి, అసలు నిందితులను వదిలేస్తే ఈ దర్యాప్తు వల్ల ప్రయోజనమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వమే చెప్పాలి.
గత నెల 21న రిమ్స్ నవజాత శిశువుల వార్డులో మిన్నంటిన ఆర్తనాదాలు ఇంకా మరువలేనివి. తల్లిపొత్తిళ్ల వెచ్చదనాన్ని ఆస్వాదించాల్సిన పసికందులు, ఈ ప్రపంచాన్ని పూర్తిగా చూడకముందే విగతజీవులయ్యారు. కన్నతల్లులు కండ్లు తెరిచేలోపే బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాల వేదన వర్ణనాతీతం. ఎవరికీ అపకారం చేయని ఆ చిన్నారులు చేసిన పాపమేమిటి? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి శ్వాస తీసుకోవడం తప్ప వారికి తెలిసిన ప్రపంచమే లేదు. అలాంటి పసిప్రాణాలు ఆస్పత్రిలోని నిర్లక్ష్యానికి బలయ్యాయన్న ఆవేదన సమాజాన్ని కలచివేసింది. ఈ ఘటనను మరో విషాదంగా మిగిల్చేయకుండా, ప్రమాదానికి కారణాలతోపాటు కారకులను కూడా తేల్చాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రిమ్స్ నిర్వహణలో లోపాలెన్నో!
రిమ్స్‌లో సమస్యలు ఈ ఘటనతోనే మొదలైనవి కావు. ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది నియామకాలు, మందుల లభ్యత, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం వంటి అనేక అంశాలపై చాలాకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ పలు విషయాల్లో నిండా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇక్కడికొచ్చే రోగులకు చికిత్సలు దేవుడెరుగు కానీ ‘రిమ్స్‌కే చికిత్స’ చేయాల్సిన పరిస్థితి ఉందనేది ప్రజల ఆవేదన. అనేక సందర్భాల్లో మీడియా కథనాలూ దీన్ని ఉటంకించాయి. అయినా సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.రిమ్స్‌లో ఎక్కువ పోస్టులను పొరుగు సేవలకిందే నియమిస్తున్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తున్నారు. పోస్టులు భర్తీలో చేతివాటాలు కొనసాగుతున్నాయి. డబ్బులు చెల్లించి ఉద్యోగం పొందుతున్న కొందరిలో జవాబుదారీతనం లోపిస్తుందన్నదనేది రోగుల ఆరోపణ. ఈ ఏజెన్సీలకు కూడా స్థానికంగా రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది స్థానికుల విమర్శ. ఒకట్రెండు ఏజెన్సీలు నేరుగా నాయకుల బినామీ సంస్థలే అన్నదీ జగమెరిగిన సత్యం.
మందుల వ్యాపారం.. పర్యవేక్షణ కరువు
రిమ్స్ ఆవరణలో ఇటీవలే ఒక క్రిటికల్ కేర్ ప్రారంభమైంది. ఇది ప్రాణాపాయ చికిత్సలు చేయడానికి ఉద్దేశించబడినది. కానీ, దాన్ని మొన్నటివరకు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేలేదు. వైద్య సదుపాయాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేసిన ఆ భవనంలోని ఒక వార్డును ఆఫీసు వ్యవహారాలు, అధికారుల క్యాబిన్లకే వాడారు. నవజాత శిశువుల వార్డు ప్రమాదానికి గురయ్యాక దాన్ని ఈ భవనంలోకి మార్చారు. రిమ్స్‌కు వస్తున్న రోగుల్లో ఎక్కువ మంది ఆదివాసులు, నిరుపేదలే. ఇక్కడ చికిత్సలతో పాటు మందులన్నీ ఉచితంగానే అందజేయాలి. వైద్యులు రాస్తున్న మందులన్నీ పూర్తిస్థాయిలో ఉండవు. ఆస్పత్రిలో లేని వాటిని బయటనుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది పేదలకు బారంగా మారుతోంది. రిమ్స్ ఆవరణలో మూడు మెడికల్‌షాపులు వెలిశాయి. ఒక రకంగా ఇక్కడ మందుల వ్యాపారం సాగుతోంది. వీటిని బహిరంగ టెండర్లద్వారా కాకుండా లోలోపల టెండర్లు నిర్వహించి కొందరికి కట్టబెట్టారనే విమర్శలున్నాయి. ఇవి కూడా స్థానిక లీడర్ల బినామీలే నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. అందరివీ ఉన్నాయనేదీ బహిరంగ రహస్యమే. కొన్ని మందులు సరైన వెచ్చదనం, చల్లదనంలో భద్రపర్చా ల్సినవి ఉంటాయి. కావున మెడికల్‌షాపులను మంజూరు చేసేటపుడు కచ్చితమైన నిబంధలు పరిశీలించాలి. రిమ్స్‌లో రెండింటిని ఇటుక గోడలతో కూడిన రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నా పట్టించుకునేవారు కరువ య్యారు. ఇక్కడి కొచ్చే రోగులు పేదలు, ఆదివాసు లు. ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో జనరిక్ మందులను కూడా అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసు కుంటున్న వార్తలు నిజంగా వైద్యాన్ని ఎలా వ్యాపారం చేస్తున్నారో కండ్లకు చూపిస్తున్నాయి.
కింది నుంచి పైదాకా జవాబుదారీతనం ఏదీ?
రిమ్స్ ఏర్పాటుకు 2008లో గెజిట్ వచ్చింది. జీఓ 99పై ఇది నడుస్తోంది. నాన్ అటానమస్ కింద నిర్వహి స్తుండడం, అన్ని వ్యవస్థలనూ ఒకే గొడుగుకింద నడపడంతో అడ్మినిస్ట్రేషన్ గాడితప్పుతోంది. మౌలిక వసతుల సమస్య సరేసరి. ఆసుపత్రి ఆవరణలన్నీ పరిశుభ్రవంగా ఉంచడం, భోజనాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం వంటి విషయా ల్లోనూ లోటుపాట్లు ఉంటున్నాయి. ఇవి మచ్చుకు కొన్నే.. ఇలాంటి సమస్యలను ఉన్నతాధికారులతో పాటు స్థానిక నేతలు పట్టించుకోవాలి. దీని పర్యవేక్షణ కోసం నియమించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు శూన్యం. అదే జరిగి ఉంటే నిర్వహణాలోపంతో ఏసీలు ఉండేవే కావు. రాష్ట్రస్థాయిలో నియమించబడిన ఎగ్జిక్యూటివ్ బోర్డు కూడా ఈ సమస్యలను కనీసం తొంగిచూసిన దాఖలాలు లేవు. ఎగ్జిక్యూటివ్ బోర్డుకు స్వయాన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రే ఛైర్మన్‌గా ఉంటారు. ఈ బోర్డు 2017 తర్వాత ఒక్కసారి కూడా సమావేశం కాలేదని రికార్డులు చెబుతున్నాయి. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టు కింది నుంచి పైదాకా ఈ తప్పులకు బాధ్యులేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దిద్దుబాటు చర్యలు అవసరం
జాతీయ స్థాయిని, స్థానికంగా ఎందరినో కలిచివేసిన శిశువుల మృతి ఘటనతోనైనా అన్ని స్థాయిల్లో జవాబు దారీతనం పెరగాలి. ఆదివాసులు, అత్యంత నిరుపేదల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా నాడు ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిని సరైన పద్ధతిలో నడపాలి. ఆ దిశగా దిద్దుబాటు చర్యలకు పూనుకోవాలి. పేద రోగుల ఆవేదనలను, వాటిని ప్రతిబింబిందే విధంగా మీడియాలో వస్తున్న కథనాలను విమర్శలుగా, ఆరోపణలుగా కొట్టిపారేయొద్దు. సానుకూల దృక్పథంతో ఆలోచించి పరిష్కరించాలి. అప్పుడే పేదల ఆస్పత్రి ఏర్పాటు వెనక ఉన్న అసలు లక్ష్యం నెరవేరుతుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని అంటారు. కానీ రిమ్స్ వ్యవహారంలో జరుగుతున్న తప్పులపై ప్రశ్నించే విషయంలో స్థానిక నేతలంతా శాశ్వత మిత్రులు గానే వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ విమర్శ లకు పుల్‌స్టాఫ్ పెట్టాలి. రిమ్స్ అభివృద్ధికి, వైద్య సేవల మెరుగుదలకు సమిష్టిగా కృషి చేయాలి.
కొలిపాక నాందేవ్, 9490099387






కామెంట్లు (0)