చివరకు అనుకున్నట్టే అయింది. విద్యుత్ రంగాన్ని మార్కెట్ లెక్కలకు కట్టిపడేస్తే ఆ భారం చివరకు వినియో గదారుడి నెత్తినే పడుతుందని వామపక్షాలు, ప్రజాసంఘాలు మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈఆర్‌సి ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అభ్యంతరాలు చెబుతూనే ఉన్నాయి. కానీ, ప్రభుత్వానికి ప్రజల ఆందోళనలకంటే సంస్కరణల లెక్కలే ముఖ్యమయ్యాయి. ఇప్పుడు ఆ భారమే సామాన్యుడి కరెంటు బిల్లుపైకి చేరింది. ఓవైపు నిత్యావసరాల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ భారాలతో కుటుంబ బడ్జెట్లు కుదేలవుతున్న వేళ, మరోవైపు ఎల్‌నినో కరువు వెంటాడుతున్న సమయంలో ట్రూ అప్ పేరుతో మరో మోతకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే ఏడాది పాటు ట్రూ అప్‌ను వాయిదా వేయాలని ఈఆర్‌సికి సర్కార్ లేఖ రాసినప్పటికీ ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒప్పుకోకపోగా వచ్చే నెల నవంబర్ నుంచి వసూళ్లు చేయాలని డిస్కమ్‌లకు చెప్పింది.
ట్రూ–అప్ అంటే గతంలో అంచనా వేసిన విద్యుత్ కొనుగోలు వ్యయానికి, వాస్తవంగా అయిన వ్యయానికి మధ్య తేడాను సర్దుబాటు చేయడమే. అయితే ఇక్కడ 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ.7,635.22 కోట్ల ట్రూఅప్‌కు ఈఆర్‌సీ అనుమతించింది. అందులో రూ.5,420.23 కోట్లను వినియోగదారుల నుంచే వసూలు చేయనుంది. నవంబరు నుంచి దక్షిణ డిస్కమ్‌లో 29 నెలలు, ఉత్తర డిస్కమ్‌లో 26 నెలలు ఈ భారం కొనసాగనుంది. తొలి నెల యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత 50 పైసల చొప్పున అదనపు భారం పడనుంది.
వంద యూనిట్లు వాడుకున్న వినియోగదారునికి 30పైసల చొప్పున రూ. ముప్పై భారం మిగతా అన్నింటితో కలుపుకుంటే బిల్లు తడిసి మోపెడవుతుంది. యాభై పైసలది కూడా ఇదే లెక్క. అయినా ప్రతి అదనపు ఖర్చుకూ చివరి గమ్యం వినియోగదారుడి బిల్లే అయితే, విద్యుత్ సంస్థల ప్రణాళిక, కొనుగోలు విధానం, ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ బాధ్యతలన్నీ ప్రశ్నార్థకమే కదా.
ఇక్కడ ఈఆర్‌సి మర్మం చెప్పాలి. ఇప్పుడు వసూలు చేయాలనుకుంటున్నది గడిచిన రెండేండ్లకు సంబంధించిన విద్యుత్ ఖర్చు. ఆ లెక్కనే చూస్తే అప్పుడు వంద యూనిట్లు వాడుకున్న వ్యక్తి, ఈ కాలంలో కూలరో, రిఫ్రిజిరేటర్‌నో కొనుక్కుంటే వంద యూనిట్లు కాస్త రెండు వందల యూనిట్లు అయ్యాయనుకుందాం. దాన్ని పూడ్చుకోవడానికి ఈఆర్‌సి ఇప్పుడు ఎంత వాడుకుంటే అన్ని యూనిట్లపై భారాన్ని వేయడం న్యాయ సమ్మతం కాదు. ఈ లెక్కన వినియోగదారులను దోపిడీ చేస్తుందన్న మాట. అలాగే తెలంగాణ డిస్కమ్‌లకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.57,336 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అందులో నీటిపారుదల శాఖ బకాయిలే రూ.29,264 కోట్లు. ఈ బకా యిలను సకాలంలో వసూలెందుకు చేయలేదు. ప్రజలమీద భారాలు వేసేందుకు ఉన్న తొందర బకాయిలపై శ్రద్ధ లేదేం. గతంలోనూ ట్రూఅప్ పేరుతో రూ.12,718 కోట్ల భారాన్ని ప్రజలపై వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఐదేండ్లలో యేటా రూ.2,543.6 కోట్ల చొప్పున చెల్లించేందుకు అంగీకరించింది. కానీ ఒక్క వాయిదా కూడా చెల్లించకుండానే అప్పటి ప్రభుత్వం దిగిపోయింది.
ఆ తర్వాత వచ్చిన సర్కార్ కూడా ఆ బకాయిలను చెల్లించలేదు. పాలకులు మారినా భారం మాత్రం ప్రజలపైనే మిగిలింది. ఇదంతా రాష్ట్రానికే పరిమితమైన విషయం కాదు. కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సంస్కరణలు కూడా ఈ పరిణామాలకు విస్తృత నేపథ్యాన్ని ఇస్తున్నాయి. 2025 విద్యుత్ సవరణ బిల్లు విద్యుత్ టారిఫ్‌లు ఖర్చుకు అనుగుణంగా ఉండేలా చేయడం, కొన్ని సందర్భాల్లో నియంత్రణ సంస్థలకు స్వయంగా టారిఫ్ నిర్ణయించే అధికారం కల్పించడం వంటి ప్రతిపాదనలు చేసింది. కేంద్రం వీటిని విద్యుత్ రంగ ఆర్థిక స్థిరత్వానికి అవసరమైన సంస్కరణలుగా చెబుతోంది. అయితే విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగ సంఘాలు వినియోగదారుల ప్రయోజనాలు, ప్రభుత్వ డిస్కమ్‌లు, రాష్ట్రాల అధికారాలపై పడే ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘ఖర్చుకు తగ్గట్టే చార్జీ’ అనే విధానం బలపడితే పేదలు, చిన్న వినియోగదారులు, రైతులకు విద్యుత్‌ను అందుబాటులో ఉంచే సబ్సిడీ బాధ్యత రాష్ట్రాలపై మరింతగా పడే అవకాశం ఉంది.
ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల హమీ అయిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ‘గృహజ్యోతి’ పథకం కొనసాగిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
విద్యుత్ సంస్థలకు ఆర్థిక క్రమశిక్షణ అవసరమే. డిస్కమ్‌లు నష్టాల్లో కూరుకుపోతే నాణ్యమైన సరఫరా కూడా దెబ్బతింటుంది. కానీ ప్రభుత్వాల వైఫల్యాల ఖర్చును ప్రజల బిల్లుల్లో రాసేయడం న్యాయం కాదు. కేంద్రం సంస్కరణల పేరుతో రాష్ర్టాలపై విధాన భారాన్ని మోపకూడదు. ప్రభుత్వ శాఖలు వేల కోట్ల బకాయిలు పెట్టి సామాన్యుడికి మాత్రం బిల్లు సకాలంలో చెల్లించాలని చెప్పే విధానం మారాలి. విద్యుత్ బిల్లు ప్రతి కుటుంబ బడ్జెట్‌లోని ఒక ముక్క. ఆ ముక్కను మరింతగా భారం చేసే ముందు పాలకులు ప్రజల బతుకును కూడా చూడాలి. అందుకే విద్యుత్ ధరల విషయంలో పాలకులకు బషీర్‌బాగ్ ఉద్యమం ఒక చారిత్రక హెచ్చరిక. ఆ చరిత్రను మరచిపోయి మళ్లీ విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడం మంచిది కాదు. విద్యుత్‌ను మార్కెట్ సరుకుగా కాక ప్రజల జీవితావసరంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. లేదంటే ప్రజాతీర్పుకు మూల్యం చెల్లించక తప్పదు.
‘ట్రూ అప్’ కత్తి
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 3 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)