Magazines

ప్రమాదంలో ఉన్నది.. మతమా? మనుషులా?

1 గంట క్రితం

human beings
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 4 నిమిషాల చదవడం

హిందూ ధర్మ్ ఖత్ రే మే హై! (హిందూమతం ప్రమాదంలో ఉంది) ఈ మంత్రాన్ని ఆరెస్సెస్, బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు ప్రతిరోజూ జపిస్తున్నాయి! దేశంలో మూడొంతుల ప్రజలు హిందూ మతానికి చెందిన వారే ఉండగా.. పరిపాలకులంతా తొంబై తొమ్మిది శాతం హిందూ మతానికి చెందిన వారే ఉండగా.. 2014 నుండి నేటి వరకు వరుసగా మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే అధికారంలో ఉండగా.. హిందూ మతం ఎందుకు ప్రమాదంలో ఉంటుంది? ఈ పచ్చి అబద్ధాన్ని అనునిత్యం ప్రజల్లో వీళ్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు! ఎవరిని ఉద్ధరించడానికి ఈ మత చాందసవాదాన్ని ప్రజల్లో నూరిపోస్తున్నారు? ఈ విధంగా ఒకవైపు నిరంతరం ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతూనే.. మరోవైపు ఈరోజు సర్ పేరుతో పదమూడు కోట్ల ప్రజల ఓట్లను తొలగించారంటే.. మతం పేరుతో వీళ్లు చేస్తున్న ప్రజా ద్రోహం అంతా ఇంతా కాదు! అందుకే ఎవరు ప్రమాదంలో ఉన్నారు? ఆలోచించండి.. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియను ఆపేయాలి అనీ, ఓట్ల సవరణా కార్యక్రమం పారదర్శకంగా జరగాలి అనీ.. దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థీ యువకుల గురించి.‌. ఈ ఓటు హక్కు కోల్పోయిన కోట్లాది మంది ప్రజలు, కనీస సంఘీభావం కూడా తెలపకుండా, ఎవరి పనుల్లో వాళ్ళు యాంత్రికంగా కొనసాగుతూ ఉన్నారంటే..

ఈ పరిణామం దేనికి సంకేతం? ‘ప్రజలకు ‘తమ అస్తిత్వం ప్రమాదంలో పడింది’’ అని తెలిసిన తర్వాత కూడా, ఆ ప్రజలు సీరియస్ గా ప్రతిస్పందించడం లేదు అంటే.. ఈ మతోన్మాద శక్తులు ప్రజలను ఎంతగా మత మౌఢ్యంలో ముంచేసారో, ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది! అందుకే ఎవరు ప్రమాదంలో ఉన్నారు? ఆలోచించండి.. ఓటు హక్కు ఉంటేనే, ప్రభుత్వ పథకాలు పొందగలుగుతాము! ఓటు హక్కు ఉంటేనే, ఈ దేశ పౌరులుగా గుర్తింపు ఉంటుంది! ఓటు హక్కు ఉంటేనే, ఈ జనాభా లెక్కల్లో మనం ఉన్నట్టు! మరి ఓటు హక్కు లేకపోతే, మనం చచ్చిన వాళ్లతో సమానం! మరి నేడు ఓట్లు తొలగించబడ్డ భారతీయులు, బతికుండగానే చచ్చిన వాళ్లతో సమానమయ్యారు! ‘అయ్యా మేము బతికున్నాం’ అని ప్రభుత్వానికి చెప్పుకునే దుస్థితిని వాళ్లకు కలుగజేసారు! భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాలరాసి, మనకు ఉన్న ఓటు హక్కును తీసేసే అధికారం వీళ్లకి ఎవరిచ్చారు? ఈ పరిపాలకులు, ఎన్నికల కమిషన్లు, చట్టసభలు కోర్టులు.. రాజ్యాంగం కంటే గొప్పవా? ఈ వ్యవస్థలు అన్నీ కూడా, ఈ రాజ్యాంగ ద్వారా ఏర్పాటైనవే కదా! రాజ్యాంగ విధానాలను ఉల్లంఘించి ప్రజల ఓటు హక్కును తొలగించారంటే, వీళ్లుపాలకులా? ప్రజా దేశద్రోహులా? వీళ్లు సొంత ప్రజలకే ఇంత ద్రోహం ఎందుకు చేస్తున్నారు? వారు ఏమి ఆశించి ఇంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారు’ అంటే..

చెప్పడానికి గొప్పగా ఏమీ లేదు! కాకపోతే వీళ్లకు మత పిచ్చి ముదిరి, మతం పేరుతో ప్రజలను ఉన్మాదులను చేసి, ఈ దేశాన్ని ‘మత రాజ్యాం’ గా నిర్మించాలని వీళ్ల ఆశయం! మరి వాళ్లు ఆశించినట్టుగా మతరాజ్యం ఏర్పడితే ఎవరికి ప్రయోజనం ఉంటుంది అనీ, ఈ సందర్భంగా నైనా ఎవరికి వాళ్లు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది! ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చిన రాజ్యాంగాన్ని ఎత్తేసి, చాతుర్వవర్ణ వ్యవస్థను ఎత్తిపట్టే మనుధర్మ భావజాలమే పునాదిగా రాజ్యాంగాన్ని రచించి, హిందూమతం పేరుతో మత రాజ్యాన్ని నెలకొల్పుతారు వీళ్లు! మరి ఆ విధంగా ఏర్పడిన మతరాజ్యంలో, ఎవరికీ ప్రయోజనం ఉంటుందంటే.. కేవలం ఆధిపత్య కులాల వాళ్లకే ఉంటుంది. అంటే ‘బ్రాహ్మణ వైశ్య క్షత్రియ’ కులాలకు చెందిన ఆర్యులకు ఉంటుంది తప్పా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన శూద్రులకు కాదు. సమాజాన్ని మనిషిని.. మతం పేరుతో, కులం పేరుతో కాకుండా, శ్రామిక కోణంలో చూడాలి! ఎందుకంటే సమాజం మనుగడ, శ్రామిక ప్రజలు శ్రమలు చేస్తేనే కొనసాగుతోంది కాబట్టి! మన వేలుతో మన కంటినే పొడుచుకున్నట్లుగా.. మతం పేరు చెప్పుకుంటూ, దేవుళ్ల పేరుతో, మన జీవితాలను మనమే సమాధి చేసుకునే విధంగా వీళ్లు కుట్రలు పన్నుతున్నారు! రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కులు కాలరాయ పడ్డాయంటే, మళ్లీ బానిసత్వ బతుకే మన ముందుంటుంది! కాబట్టి ఇప్పుడు సర్ ప్రక్రియ ద్వారా ఓట్లు తొలగించేశారంటేనే..

అది వాళ్లు పథకం ప్రకారం మనువాదం భావజాలంతో చేసిన చర్యలే తప్పా, అనుకోకుండా జరిగిన పొరపాటు కాదు! ప్రజలు ఈ పరిస్థితుల్లోనైనా శాస్త్రీయంగా, సామాజికంగా ఆలోచించాలి! ఇకనైనా మతం మౌఢ్యంలో నుండి బయటకు రావాలి. మతం ఒక గుర్తింపుగా ఉంటుంది,దేవుడు ఒక విశ్వాసంగా ఉంటాడు. అంతవరకే తప్పా, మన జీవితం, మన కార్యాచరణ, మన అభివృద్ధి, మన మంచి చెడులు, కష్టనష్టాలు అన్నీ కూడా భౌతికమైన పరిస్థితులతో ముడిపడి ఉన్నవే! విశ్వాసాలకు భౌతిక చర్యలకు, ఎప్పుడూ సంబంధం ఉండదు! కాబట్టీ ఊహాజనిత కల్పిత గాథలతో మానవ సమాజాన్ని విశ్లేషించకూడదు! ఊహాజనితమైన మనుధర్మ భావజాలంతో, మతపరమైన వ్యవస్థ నిర్మాణం కాకూడదు! అన్ని మతాల్లోని మత గ్రంథాలు మనుషులు రాసినవే. అందుకే అందులో అశాస్ర్తీయాలు, సామాజిక అసమానతలు ఆ పుస్తకాల నిండా ఉంటాయి! వాటి ఆధారంతో వ్యవస్థను నిర్మిస్తామంటే కుదరదు! ఏ మతాల్లో అయినా ఆ మత భావజాల ప్రభావం వల్ల, ప్రజల్లో ప్రశ్నించే చైతన్యం, మనిషిలో ఉండే సృజనాత్మక భావాలు బలహీనమవు తాయి! కష్టాలకు కారణాలు - కర్మ రాత పునర్జన్మ అని అవి నమ్మిస్తాయి! ఒక్కమాటలో చెప్పాలంటే, మతపరమైన ఆలోచనలు శాస్త్రీయ విజ్ఞానానికి పూర్తిగా విరుద్ధం! ఈ అశాస్త్రీయ భావనలో భాగంగానే, సమాజంలో మరింతగా సామాజిక ఆర్థిక అసమానతలు పెంపొందిం చేందుకు..

మత రాజ్యాలను నిర్మించడానికి చూస్తున్నారు. అందుకే ఒక పథకం ప్రకారం నేడు కోట్లాది ప్రజల ఓట్లను కొల్లగొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రేక్షకులుగా ఉండడం మానవీయత కాదు! రేషన్ కార్డు కోసం, పెన్షన్ కోసం, ఇతర సంక్షేమ పథకాల కోసం వందల సార్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతారు! మరి ఇప్పుడు మీ ఓటు పోయిందని మీకు తెలిసినప్పుడు, ఏం చేస్తున్నారు? ప్రజల ఓట్లు తొలగించడానికి మీరెవరు అంటూ, పెద్ద ఎత్తున మన బిడ్డలు దేశమంతా ఉద్యమాలు చేస్తుంటే.. వాళ్లకు మీరు ఎందుకు సంఘీభావం తెలపడం లేదు? వాళ్లతో కలిసి ఎందుకు ఉద్యమాలు చేయడం లేదు! వాళ్లు పోరాడుతున్నదినరేంద్ర మోడీ మీద కాదు, బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద! దీన్ని ముందు ఆలోచించాలి. మన కోసం పోరాడుతున్న మన బిడ్డల మీద, దారుణమైన హింస జరుగుతుంది! మగ పిల్లల మీద, ఆడపిల్లల మీద.. ఈ మతోన్మాద శక్తులు, కొంతమంది పోలీసులు అమానుషంగా వ్యవరిస్తున్నారు! ఈ సంఘటనలు టీవీలో చూస్తూ కూడా స్పందించడం లేదంటే, మనిషితనం కోల్పోతున్నట్టే! ఇప్పటికైనా కండ్లు తెరవండి. ఈ దేశం సౌభాగ్యం కోసం పోరాడుతున్నటువంటి మన బిడ్డలకు మద్దతుగా నిలవండి! ఈ అమానుష విధానాలను సమర్థించే వాళ్లని, ఎక్కడికక్కడ నిలదీయండి, ప్రశ్నించండి! మతం పేరుతో మనల్నే ముంచుతున్నా రనీ, ఇప్పటికైనా గ్రహించండి! ఇప్పుడు మేలుకోకపోతే, ఇంక మనకు భవిష్యత్తు ఉండదు! అందుకే ఎవరు ప్రమాదంలో ఉన్నారు? ఆలోచించండి.. ‘ఖత్ రే మే హిందూ నహీ హై! పూరే దేశ్ కె లోగ్ హై!’ (హిందువులు ప్రమాదంలో లేరు! మొత్తం దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు!).


ముద్దగౌని సుభాష్ , 9000904284

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్