ప్రజాస్వామ్యంలో అధికారం ఎంత బలంగా ఉంటే దాన్ని ప్రశ్నించే గొంతుకలూ అంత స్వేచ్ఛగా ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, అధికార దుర్వినియోగాన్ని బయటపెట్టడం, ప్రజాధనం వినియోగంపై లెక్క అడగడం మీడియా బాధ్యత. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పాలకులే సమాచారంపై నియంత్రణలు విధిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. వ్యక్తిగత సమాచార పరిరక్షణ పేరుతో జర్నలిజానికి ముప్పు ఏర్పడుతోందన్న ఆందోళన సుప్రీంకోర్టుకు చేరడం ఈ నేపథ్యంలోనే చర్చకు దారితీసింది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం (డీపిడీపీ)పై వార్తా సంస్థల అభ్యంతరాలు కేవలం మీడియాకు సంబంధించినవి కావు. ప్రజల సమాచార హక్కు, పాలకుల జవాబుదారీతనం, ప్రజాస్వామ్య పారదర్శకతకు సంబంధించినవి.
వ్యక్తుల వ్యక్తిగత సమాచా రాన్ని దుర్వినియోగం కాకుండా కాపా డటం అవసరమే. అయితే ఆ లక్ష్యంతో రూపొందించిన చట్టం ప్రజా ప్రయోజనాల కోసం సమాచారాన్ని సేకరించే జర్నలిస్టుల స్వేచ్ఛకు ఆటంకంగా మారకూడదు.
ప్రభుత్వ అవినీతి, అధికారుల అక్రమాలు, కార్పొరేట్ సంస్థల మోసాలపై కథనాలు రాసేటప్పుడు సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాల్సి వస్తే పరిస్థితి ఏమిటి? తప్పు చేసినవారే తమపై వార్తలు రాకుండా అడ్డుకుంటే ప్రజలకు వాస్తవాలు ఎలా తెలుస్తాయి? అందుకే వ్యక్తిగత గోప్యతను పరిరక్షిస్తూనే జర్నలిజానికి స్పష్టమైన మినహాయింపులు ఉండాలన్న డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకుంది.
డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ తరఫున 21 వార్తా సంస్థలు ఈ చట్టంలోని నిబంధనలను సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. వార్తల్లో ప్రస్తావించే వ్యక్తుల సమ్మతి, వ్యక్తిగత సమాచార వినియోగంపై పరిమితులు పరిశోధనాత్మక జర్నలిజాన్ని దెబ్బతీస్తాయని, సమాచార వనరుల గోప్యతకు ముప్పు కలిగిస్తాయని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారమిచ్చే వ్యక్తుల వివరాలు బయటపడతాయన్న భయం పెరిగితే ప్రభుత్వ వ్యవస్థల్లోని అక్రమాలను వెలుగులోకి తెచ్చేవారు తగ్గిపోవచ్చు.
వార్త ప్రచురించిన తరు వాత దాని నిజానిజాలను ప్రశ్నించడం వేరు. ప్రచురణకు ముందే ఆంక్షలు విధించే పరిస్థితి ఏర్పడటం వేరు. ఈ తేడాను ప్రభుత్వం గుర్తించాలి.
ఈ వివాదంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తిగత గోప్యత, మీడియా స్వేచ్ఛ మధ్య సమతుల్యత అవసరమని పేర్కొంది. జర్నలిజానికి సంబంధించిన సమస్యలపై మీడియా సంస్థలే సూచనలు ఇవ్వాలని కోరింది. కేంద్రానికి నోటీసులు జారీచేసిన ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. ఈ దశలో చట్టాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించ లేదు, దాని అమలుపై స్టే కూడా ఇవ్వలేదు. అయితే కోర్టు సూచించిన సమతుల్యత కీలకమైనది. గోప్యతను కాపాడటం పేరుతో భావప్రకటనా స్వేచ్ఛను బలహీనపరచకూడదు. అదే సమయంలో మీడియా స్వేచ్ఛ పేరుతో వ్యక్తుల హక్కులనూ విస్మరించరాదు.
ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడటమంటే ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలను ప్రోత్సహించడం కాదు.
ప్రభుత్వాన్ని విమర్శించే కథనాలకు, అధికారుల తప్పులను బయటపెట్టే పరిశోధనలకు రక్షణ కల్పించడం. జర్నలిజానికి స్పష్టమైన మినహాయింపులు లేకుండా చట్టాన్ని రూపొందించినప్పుడు తలెత్తే సమస్యలను ముందుగానే ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఇప్పుడు అభ్యంతరాలను వింటామని చెప్పడం సరిపోతుందా? కేంద్రం వివాదాస్పద నిబంధనలను సమీక్షించి, పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా అవసరమైన మార్పులు చేయాలి. స్వేచ్ఛకు మద్దతు ప్రకటించడం కన్నా దానికి చట్టపరమైన భరోసా కల్పించడం ముఖ్యం.
ఈ వివాదం సమాచార హక్కు చట్టానికి చేసిన మార్పులతోనూ ముడిపడి ఉంది. వ్యక్తిగత సమాచారం వెల్లడించడంపై ఆంక్షలు పెరిగితే ప్రభుత్వ పథకాల అమలు, ప్రజాధనం వినియోగం, అధికారుల నిర్ణయాలపై సమాచారం పొందడం కష్టమవుతుందన్న ఆందోళన ఉంది. సమాచార హక్కు పాలకులను జవాబుదారీగా నిలబెట్టే ప్రజాస్వామ్య సాధనం. గోప్యత పేరుతో వ్యక్తిగత వివరాలను రక్షించాల్సిందే.
కానీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టడానికి ఆ నిబంధనలు ఉపయోగపడకూడదు.
ప్రజాస్వామ్యం ఎన్నికలతోనే పూర్తికాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ, సమాచారాన్ని తెలుసుకునే హక్కు, అధికార దుర్వినియోగాన్ని బయటపెట్టే అవకాశం ఉన్నప్పుడే అది సార్థకమవుతుంది. మీడియా కూడా నిరాధార ఆరోపణలకు, వ్యక్తిగత జీవితాల్లో అనవసర జోక్యానికి దూరంగా బాధ్యతా యుతంగా వ్యవహరించాలి. అయితే ఆ తప్పులను సరిదిద్దే పేరుతో జర్నలిజాన్ని నియంత్రించకూడదు. కేంద్రం చట్టంలోని లోపాలను సరిదిద్ది, మీడియా స్వేచ్ఛకు స్పష్టమైన రక్షణ కల్పించాలి. ప్రజల తరఫున ప్రశ్నించే కలానికి కళ్లెం వేయడం కాదు, అది స్వేచ్ఛగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలి. ప్రశ్నలు లేని చోట జవాబుదారీతనం ఉండదు, జవాబుదారీతనం లేని పాలన ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.
ప్రశ్నించే కలానికి కళ్లెమా?
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026 | 3 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)