Magazines

బాటలన్నీ నల్లగొండకే

3 రోజుల క్రితం

All roads lead to Nalgonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

పల్లవి: పోరాటానికి శషభిష లేంటిరా - హబ్బరిదెబ్బ

చావోరేవో తేల్చగ కదలిరా

పైపంచ తలకు చుట్టు

ములుకర్రకు జెండా కట్టు

ఊరూవాడా చేయగ ఏకం

గుడ్ల కుక్కుకో లోపలి శోకం

బిరబిర చెరచెర బరిలో దిగుదాం

దబిడి దిబిడి తాండవమవుదాం

​

అనుపల్లవి: బాటలన్నీ నల్లగొండకే

రైతుల పరుగు మహాసభలకే

తల్లీ.. పెళ్లాం.. పిలా జెల్లా

దోస్తులందరిని కట్టర దండు

నల్లగొండ సై అంటూ రండు

|| బాటలన్ని ||

1.చరణం: ఇంటిల్లపాది చేసిన చాకిరి

గిట్టుబాటు కాలేదంటూ

పండిన పంటకు పైసల లెక్క

అడ్డగోలు కారదంటూ

మాటలు చెప్పే కోతలగాళ్లు

కథలింకా వినబోమంటూ

నేలతల్లి పురిటి నొప్పులు

పరిహాసం చేయొద్దంటూ || బాటలన్ని ||

2.చరణం: నారుమడి ఏళ నుండి

కండ్లనీళ్లతో మొదలౌజూదం

నాటు కోత కట్టే తలు

ఏదైనా అవి కడుపుకోతలు

అప్పో సప్పో చేయక తప్పదు

చిటికెడు సాయం దేనికి నప్పదు

పెట్టిన దానికి రెట్టింపు

దక్కేటందుకు గుంపులు గుంపు

|| బాటలన్ని ||

3.చరణం: పంటల బీమా కట్టుడెగాని

తుఫానులొస్తే ఇవ్వరు పైస

కల్తీ విత్తులు దొరకని ఎరువులు

ఎంతటివారికి పట్టదు ధ్యాస

రైతులు పెడితే అరిగోస

హామీలన్నీ ఒకటే మూస

ఏలేటోడు ఎవ్వడొచ్చినా

దక్కలేదు రైతు భరోసా || బాటలన్ని ||

4. చరణం: ఏడినీళ్లకు చన్నిళ్లంటూ

రైతు మహిళా చేసే చాకిరి

పెరిగే ధరలలో కష్టం మొత్తం

అయిపోతోంది అంతా ఆవిరి

పిల్లల చదువు... ఒంట్లో సుస్తి

వస్తే చాలవు ఎన్నో లక్షలు

పాలకులంతా ఈడ ఆడ

కక్ష కట్టడం చూపరు తేడ || బాటలన్ని ||

5. చరణం: రామరాజ్యము ఏమోగాని

కావాలిప్పుడు రైతు రాజ్యము

అన్నదాతంటు బిరుదులు వద్దు

అరికట్టాలి ఆత్మహత్యలు

కరువున పడ్డ బతుకులు అన్ని

ఒడ్డుకు చేర్చే చేయి కావాలి

పల్లె సీమలు పక్కున నవ్వే

పచ్చని రోజులు మాకు కావాలి || పోరాటానికి ||

- దేవేంద్ర


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్