Magazines

విదేశీ వాణిజ్య ఒప్పందాలతో తీవ్ర నష్టం

15 నిమిషాల క్రితం

agreements
avatar
balaji

ప్రచురించబడింది నవం 18, 2026 | 3 నిమిషాల చదవడం

​మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలి

రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్న కేంద్రం..
రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం : ఏఐకేఎస్‌ జాతీయ కార్యదర్శి విజూ కృష్ణన్‌


​నల్లగొండ నుంచి ఎమ్‌డి సాదత్ అలి

​​‘‘అమెరికా, ఐరోపా సమాఖ్య, న్యూజిలాండ్‌, బ్రిటన్‌ తదితర దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు భారత రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంది ’ అని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ కార్యదర్శి విజూ కృష్ణన్‌ అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ కార్యదర్శి విజూ కృష్ణన్‌ పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ కార్మిక పోరాటంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొంటాయని ఆయన చెప్పారు.ఈ నెల 26న దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాటాలు నిర్వహిం చనున్నారని తెలిపారు. నల్లగొండలో కొనసాగు తున్న ఏఐకేఎస్‌ 36వ జాతీయ మహాసభ రెండో రోజు మంగళవారం సారంపల్లి మల్లారెడ్డి నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభకు తెలంగాణ నలుమూలల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారని, బహిరంగ సభను విజయ వంతం చేసిన రైతాంగా నికి, ప్రజా సంఘాలకు, యువతకు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులకు ఆహ్వాన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

​బడా వ్యాపార సంస్థల ప్రయోజనాలకే 
ప్రభుత్వ విధానాలు

కేంద్ర ప్రభుత్వం ​2014 నుంచి అనుసరిస్తున్న విధానాలు రైతులు, కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని విజూ కృష్ణన్‌ విమర్శిం చారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెడుతూ, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలపై ప్రభుత్వ నియంత్రణను తగ్గిస్తున్నా రని అన్నారు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి వ్యయం పెరుగుతూ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. గుజరాత్‌లో రైతులు అప్పట్లోనే ఇది అభివృద్ధి నమూనా కాదని, మోడీ, అదానీ, అంబానీ ప్రయోజనాలకు అనుగుణంగా సాగుతున్న పాలనా విధానమని విమర్శించారని గుర్తుచేశారు. నేటి పరిస్థితులు ఆ విమర్శలను నిజం చేస్తున్నాయన్నారు.​ అమెరికా, ఐరోపా సమాఖ్య, న్యూజిలాండ్‌ వంటి దేశాల రైతులకు అక్కడి ప్రభు త్వాలు భారీగా ఆర్థిక సహాయం అందిస్తున్నాయని, అక్కడ ఒక రైతుకు సుమారు రూ.22 లక్షల వరకు రాయితీలు లభిస్తుండగా, భారతదేశంలో రైతుల సగటు భూమి విస్తీర్ణం ఐదు ఎకరాల్లోపే ఉంటుందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటే దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

​రైతుల ఆత్మహత్యలు దేశానికి తీవ్ర ఆందోళన

​2014 నుంచి 2026 వరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో సుమారు ఐదు లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణలో 32 జిల్లాల్లోని 365 మండలాల్లో కరువు ప్రకటించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు తగిన సహాయం అందడం లేదని విమర్శిం చారు. నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయడం తోపాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని అన్నారు. ​స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా ధర నిర్ణయించాలన్నారు. ఓటు హక్కును హరిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కూడా ఉద్యమిస్తామని వెల్లడించారు.

​27 రాష్ట్రాల్లో బలమైన రైతు సంఘం

​దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అఖిల భారత కిసాన్‌ సభ క్రియాశీలంగా పనిచేస్తోందని విజూ కృష్ణన్‌ ‌తెలిపారు. 2022 మహాసభ అనంతరం ఇప్పటివరకు 21 లక్షల మంది కొత్త సభ్యులు చేరడంతో సంఘం సభ్యత్వం కోటి 58 లక్షలకు చేరిందని తెలిపారు. తెలంగాణలోనూ రెండు లక్షల మందికి పైగా కొత్త సభ్యులు చేరారని చెప్పారు. ​దేశవ్యాప్తంగా రైతుల హక్కుల కోసం సాగించిన పోరాటాల్లో చారిత్రాత్మకమైన విజయం సాధించా మని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవ సాయ చట్టాలను రైతుల ఉద్యమం ద్వారానే వెనక్కి తీసుకునేలా చేశామని గుర్తుచేశారు. రైతు వ్యతిరేక విధానాలను మరో రూపంలో తిరిగి అమలు చేసేందు కు ప్రయత్నిస్తే ఐక్యంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. ​ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, తీగల సాగర్‌, నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా కన్వీనర్‌ కందాల ప్రమీల పాల్గొన్నారు.

​పోరాటాలతోనే రైతుల విజయాలు

మూడేండ్లలో వివిధ రాష్ట్రాల్లో రైతు సంఘం నిర్వహించిన పోరాటాలతో అనేక విజయాలు సాధించామని విజూ కృష్ణన్‌ ‌వివరించారు. మహారాష్ట్రలో దీర్ఘకాల పాదయాత్రలు, ఆందోళనల ఫలితంగా రూ.32 వేల కోట్ల రుణమాఫీ సాధించామని తెలిపారు. తమిళనాడులోనూ సుమారు రూ.9 వేల కోట్ల రుణమాఫీ అయిందన్నారు. రాజస్థాన్‌లో పంటల బీమా పరిహారం కోసం రైతులు చేసిన పోరాటంతో చూరు జిల్లాలో 2017 నుంచి 2023 మధ్య రూ.4 వేల కోట్లకు పైగా పరిహారం సాధించారని వివరించారు. కర్నాటకలో బెంగళూరు విమానాశ్రయం సమీపంలోని చెన్నరాయపట్నంలో పరిశ్రమల ఏర్పాటు పేరుతో రైతుల నుంచి సేకరించిన సుమారు 1,200 ఎకరాల భూమిని మూడేండ్ల పోరాటం అనంతరం తిరిగి రైతులకు అప్పగించారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్