నీవు ప్రజలను మరిచినదానికి నీదే బాధ్యత. ఆడవారిపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు విజృంభించాయి. మూలాన్ని ముట్టకుండా ఫలితసమస్యను పరిష్కరించ ప్రయత్నించే మితవాద పాలనలో లైంగిక దాడులకు పాల్పడినవారి ఎదురు హత్యలూ (ఎన్కౌంటర్స్) పెరిగాయి. ఈ లైంగిక దాడులకు పాల్పడినవారి హత్యలు లైంగిక దాడులను ఆపుతాయా? ఇద్దరు వరంగల్ విద్యార్థినులపై యాసిడ్ దాడి నిందితులను 2008లో పోలీసులు న్యాయవ్యవస్థకు విరుద్ధంగా చంపారు. హైదరాబాదులో పశువైద్యురాలి లైంగిక దాడి, హత్యలో నలుగురు నేరస్తులను 06 డిసెంబర్ 2019న ఎదురుహత్య చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు బడిలో బాలికపై యంత్ర రంపంతో దాడిచేసిన బాలునిపై ఎదురుహత్య ప్రయత్నం చేశారు. బీజేపీ ఆర్నెళ్ల పాలనలో పశ్చిమ బెంగాల్లో నలుగురు లైంగిక దాడులు, హత్యలకు పాల్పడినవారిని ఎదురుహత్య చేశారు. ఇవి ఉత్తరప్రదేశ్ నమూనా అనుకరణలు.
యోగి పాలనలో దళిత యువతులపై అగ్రవర్ణ లైంగిక దాడులు, హత్యలు అధికంగా జరిగాయి. 2017 మార్చి నుంచి జరిగిన 17,043 ఎదురుహత్య యత్నాల్లో 289 మంది మరణించారు, 11,834 మంది గాయపడ్డారు. వీటిలో లైంగిక దాడులకు పాల్పడినవారిపై జరిగిన ఎదురుకాల్పులు కొన్నే. జయ భాదురి లాంటి స్త్రీ హృదయ కళాకార రాజకీయులు పార్లమెంటులో ఈ ఎదురు కాల్పులకు ఆనందామోదాలు తెలిపారు. యోగి, సువేందు లాంటి మితవాద ముఖ్యమంత్రులు, వారి సహచరులు ఎదురు హత్యలను పొగిడారు, ప్రోత్సహించారు. అందిన రాజకీయ ప్రశంసలతో పోలీసులు మరింత బరితెగించారు.
మన దేశంలో పార్లమెంటు ప్రమేయం లేకుండా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ 1994 నుంచి అమలయింది. విద్యావైద్యాలతో సహా అన్ని సేవల ప్రైవేటీకరణ ముమ్మరమయింది. విద్యావ్యాపారం మానవత్వ రహితమయింది. వ్యవసాయం దెబ్బతింది. పల్లెల్లో ఉపాధులు ఊడాయి. ప్రజలు పట్టణాలకు వలస వెళ్లారు. చిన్న ఒంటిగది అద్దె ఇండ్లల్లో కాపురాలు పెట్టారు. వలసజీవులు ఖరీదైన పట్టణ ప్రైవేటు బళ్లలో పిల్లలను చదివించలేకపోయారు.
కొందరు పిల్లలు గాలికి తిరిగి సామాజిక వ్యతిరేక శక్తులుగా, లైంగిక దాడులకు పాల్పడేవారుగా మారారు. కొందరు క్లబ్బులు, పబ్బులు, బార్లు, పెట్రోల్ పంపులు, వాహన రిపేర్లు, వ్యభిచార గృహాల సేవకులుగా కుదిరారు. అక్కడి అక్రమ శృంగార కృత్యాల దృశ్యాలు వీరికి లైంగిక దాడులకు ప్రేరకాలయ్యాయి. ఆ కేంద్రాలకు వచ్చే సంపన్నుల పాశ్చాత్య నాగరికతా పోకడలు వీళ్లకు కవ్వింపు కారణాలయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఆ అమాయక సంపన్న బాలికలు సమిధలయ్యారు. మోటర్ వాహనాలు, సెల్ ఫోన్లు, టీవీలు సంపన్నుల విరామ విలాసాలు, సామాన్యుల నాగరిక పేదరిక ఉపాధి సాధనాలు. ఇవే వీరి మానసిక వినాశానికీ దారితీసాయి.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో పాశ్చాత్య దేశాల సినిమాలు, సాహిత్యం ముందస్తు నిఘా లేకుండా భారత ప్రేక్షకుల అందుబాటులోకి వచ్చాయి. వీటిలో బహిరంగ శృంగార చేష్టలు సాధారణం. ప్రఖ్యాత అభ్యుదయ ఆంగ్ల రచయితలు ఆల్డస్ హక్స్లి, జార్జ్ ఆర్వెల్ల రచనల్లో కూడా పడకగది దృశ్యాల వర్ణన ఎక్కువగా ఉంది.
పాశ్చాత్య పారదర్శక సమాజాల ఈ శృంగార చిత్రాలు, దాంపత్య చర్యల సాహిత్యం, సృష్టిచర్యలను పాపపు పనులుగా పరిగణించే రహస్య మార్మిక దాంపత్య జీవితాల మూసిన తలుపుల భారత సమాజంలో ప్రజలకు, ప్రత్యేకించి యువతకు ఊహించని మానసిక రోగాలుగా మారాయి. అవకాశం దొరికినపుడు లైంగిక దాడులకు పురిగొల్పాయి. దురాశాపరులైన మన సినీరంగ నిర్మాతదర్శకులు కూడా శృంగారదృశ్యాలను చూపుతున్నారు. కూటికోసం వచ్చిన నటీమణులకు ఆకర్షణీయ కురచ దుస్తులను తొడుగు తున్నారు. భాష రాని పరభాషా కళాకారిణులతో కుళ్లు సాహిత్య గీతాలు చిత్రీకరిస్తున్నారు. ద్వంద్వార్థాల సంభాషణలు పలికిస్తున్నారు. దీనికితోడు మన పురుషాధిక్య సమాజంలో బాధ్యులు, రాజకీయులు నీచ కీచకులుగా మారారు. ఈ అవగాహనాహీన అధికార చర్యలతో దారితప్పిన సంపన్న యువతకు సమ్మతి, సమర్థన లభించాయి.
ఆడవారిని అంగడి సరుకుగా, వస్తుసేవల ప్రచార ప్రకటనల, మగాళ్ల ఆకర్షక సామాజిక బొమ్మలుగా, మగాళ్ల ఆస్తిగా, వారికి సుఖవినోదాలను పంచే బానిసలుగా, అసమానతల ఆలయాలుగా, మృగాళ్లను రెచ్చగొట్టటానికి తప్ప ఏ పనికీ పనికిరాని, విద్య, విషయ సేకరణలకు నిషేధ ప్రాణులుగా, మనుషులుగా గుర్తింపు పొందని జీవులుగా పరిగణించారు. కరిచే పామును కట్టడిచేయాలనరు. కాటుకు గురయ్యే వారిని బంధించాలంటారు. అందుకే ‘తిరక్క మగాడు, తిరిగి ఆడది’ చెడిపోతారన్న సామెత పుట్టింది. అంతర్జాల సౌకర్యం ప్రగతితో పాటు ప్రజల సమయాన్ని మింగటానికి, యువతను తప్పుదారి పట్టించడానికి ఉపయోగపడుతోంది. ప్రతిపక్షాల ఫోన్లపై నిఘా పెట్టే పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ను ఫోన్లలో చొప్పించి ఉద్వేగాలను రెచ్చగొట్టే శృంగార క్రీడలను నిషేధించాలి. నిర్మాణ అంశాల సమాచారాలను మాత్రమే అనుమతించాలి.
పురుషాధిపత్య మాన్యతతో స్త్రీలు కూడా తమ భర్తల, కొడుకుల, ఇతర మృగాళ్ల దుశ్చర్యలను దుర్మార్గ క్రియలుగా, మహిళలను కించపరిచేవిగా, వారి హక్కులను హరించేవిగా, మానవత్వాన్ని హత్యచేసేవిగా చూడటం లేదు.
తమ సొంత తెలివిని, జ్ఞాపకశక్తిని, వాస్తవికతను అనుమానించే మానసిక మార్గాల ద్వారా ఎదుటివారిని తారుమారుచేసే మోసపూరిత ప్రమాదకర సూక్ష్మ మానసిక గ్యాస్ లైటింగ్ మనస్తత్వాన్ని అలవర్చుకున్నారు. లింగవివక్ష, అసమానతలను భరిస్తున్నారు. లైంగిక దాడులు, హత్యలు, స్త్రీలపై హింసలకు ప్రోత్సాహకులుగా మారుతున్నారు. అందువలన లైంగిక దాడులకు పాల్పడినవారు హత్యలకు గురయినా లైంగిక దాడుల భావజాలం అంతం కావడం లేదు. లైంగిక దాడులు ఆగడం లేదు. స్త్రీలను మనుషులుగా చూడని నీచ సంస్కృతి పాలితుల్లో తగ్గింది. కాని నేటి సంఘ్ పాలకుల్లో మాత్రం విపరీతంగా పెరిగింది. వాళ్లు నిర్మించి నిర్వహిస్తున్న వనితావ్యతిరేక ఉచ్చును వాళ్లే తొలగించాలి. సనాతన భావజాలానికి బలం చేకూరుస్తున్న పడతీవిరుద్ధ ప్రపంచీకరణ ప్రక్రియలను సరిదిద్దాలి. పాలకులు ఈ ప్రజా బాధ్యతను నిర్వహించిన యాభై ఏండ్లకు కాని లైంగిక దాడులు తగ్గవు. ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడే ఎదురుకాల్పుల హత్యల అవసరం ఉండదు.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 94902 04545





కామెంట్లు (0)