‘‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా.. నా పాలమూరులోనా..’’ అంటూ గోరేటి వెంకన్న పాలమూరు గోసను పాట రూపంలో పాలకులకు వినిపించారు. దశాబ్దాలుగా కరువు, వలసలు, ఆకలి బాధలతో సతమతమవుతున్న ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలోనే అత్యంత కరువు పీడిత పది జిల్లాల్లో పాలమూరు ఒకటిగా గతంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతం నుంచి అనేక మంది నాయకులు శాసనసభ, పార్లమెంటు స్థాయికి ఎదిగి ఉన్నత పదవులు పొందినా రైతాంగం సమస్యలు పరిష్కారం కాలేదు. ఇతర ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి పాలమూరు కార్మికులు వలస వెళ్లి శ్రమిస్తున్నా, సొంత జిల్లాలోని ప్రాజెక్టులు మాత్రం పూర్తికాకపోవడం విషాదకరం.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 45 నుంచి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటిలో కేవలం 21 శాతం భూములకే నీటిపారుదల సౌకర్యం ఉంది. దాదాపు 14 లక్షల ఎకరాలు వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, బావులు, బోర్లే రైతులకు ప్రధాన ఆధారం. తంగడి నుంచి మద్దిమడుగు వరకు కృష్ణానది జలాలు ప్రవహిస్తున్నా పాలమూరు భూములకు మాత్రం నీరు అందడం లేదు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి వందల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నప్పుడు, కూతవేటు దూరంలో ఉన్న పాలమూరు భూములకు నీళ్లు అందకపోవడం పాలకుల విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నది.
‘పాలమూరు-రంగారెడ్డి’తోనే పరిష్కారం
జూరాల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించే అవకాశం ఉంది. 17 టీఎంసీలకు పైగా కేటాయింపులు ఉన్నప్పటికీ ప్రస్తుతం 10 టీఎంసీల లోపే వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా కొంతమేర సాగునీరు అందుతున్నా పంపులు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడం, కాలువల పనులు పెండింగ్‌లో ఉండటంతో చివరి భూములకు నీరు చేరడం లేదు. పాలమూరు కరువును శాశ్వతంగా నివారించాలనే లక్ష్యంతో 2007-08లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. 2013 ఆగస్టు 8న జీవో 72 ద్వారా 70 టీఎంసీలతో ఆమోదం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి 60 రోజులపాటు రోజుకు ఒకటిన్నర టీఎంసీ చొప్పున వరద జలాలను తరలించి 90 టీఎంసీలతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు నీరు అందించడంతోపాటు నల్లగొండలోని దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య నివారణకు, 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాలకు కూడా నీటిని అందించాల నుకున్నారు. ఈ పథకంలో ఐదు రిజర్వాయర్లు, నాలుగు పంప్‌హౌస్‌లు, 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 34 మోటార్లు, 98 కిలోమీటర్ల కాలువలు, సొరంగాల నిర్మాణం చేపట్టారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన, ఉద్దండాపూర్, లక్ష్మీదేవిపల్లి మీదుగా నీటిని తరలించేలా నిర్మాణం చేపట్టారు. 2023లో కేసీఆర్ ట్రయల్ రన్ నిర్వహించి విజయవంతమైందని ప్రకటించారు. మిగిలిన పది శాతం పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అయినా నేటికీ పూర్తిస్థాయిలో పంట పొలాలకు నీరు అందడం లేదు. భూసేకరణ, నష్టపరిహారం, ఇతర సమస్యలతో పనులు జాప్యమవుతున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి పథకానికి అనుసంధానంగా డిండి లింక్ ఎత్తిపోతల పథకం చేపట్టడం వివాదానికి దారితీసింది. ఏదుల రిజర్వాయర్ నుంచి దుందుభి నదికి అనుసంధానం చేసి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రతిపాదనపై జలసాధన కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. పాలమూరు పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు ద్వారా ముందుగా ఈ ప్రాంతానికే నీరు అందించాలని డిమాండ్ చేస్తున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా నార్లాపూర్ వద్ద అదనపు పంపులు ఏర్పాటు చేసి అచ్చంపేటకు 0.1 టీఎంసీ, డిండి పథకానికి మిగతా నీటిని తరలించే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దీనివల్ల పాలమూరుకు నష్టం ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నప్పటికీ, ఆచరణలో ఎలా అమలవుతుందో చూడాలి.
ఇతర ప్రాజెక్టులదీ అదే దుస్థితి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని రూ.2,990 కోట్లతో నిర్మించి 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినా పంపులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. 29వ ప్యాకేజీ పనులు పెండింగ్‌లో ఉండటంతో చివరి భూములకు నీరు చేరడం లేదు. మిగిలిన పనుల కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసింది. వీటిని త్వరగా పూర్తి చేయాలి. నెట్టెంపాడు పథకం ద్వారా రెండు లక్షల ఎకరాలకు, బీమా పథకం ద్వారా రెండు లక్షల ఎకరాలకు, కోయిల్‌సాగర్ ద్వారా 50 వేల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యాలు కూడా పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. పంపులు, కాలువలు, మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేసి రైతులకు ప్రయోజనం కల్పించాలి.
కోరలు చాస్తున్న కరువు
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది 25 శాతం వర్షపాతం లోటు ఏర్పడటంతో పాలమూరులో కరువు పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 74 మండలాల్లో 63 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరువు వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక చర్యలు చేపట్టడం కాకుండా శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలి. 2025-26లో శ్రీశైలానికి 221 టీఎంసీలు, జూరాలకు 252 టీఎంసీల నీరు వచ్చినప్పటికీ పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి పథకాల ద్వారా ఆశించిన స్థాయిలో నీటిని వినియోగించుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వచ్చిన నీటిని దిగువకు తరలించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఈ విమర్శల్లో వాస్తవమెంతన్నది పక్కనపెడితే, కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే మౌలిక సదుపాయాలు సిద్ధంగా లేకపోవడం ఆందోళనకరం.
పాలమూరులోని వివిధ పథకాలకు 190 టీఎంసీల నీటిని వినియోగించుకోగలిగితే లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. తెలంగాణకు 500 టీఎంసీల కృష్ణా జలాల కేటాయింపుల కోసం వాదిస్తున్న పాలకులు, ప్రతి టీఎంసీని సద్వినియోగం చేసుకునే ప్రాజెక్టులను కూడా సిద్ధం చేయాలి.పాలమూరు కరువుకు పరిష్కారం కొత్త వాగ్దానాల్లో లేదు.. చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలోనే ఉంది. జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి పథకాలను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తి చేసి చివరి ఎకరం వరకు నీరందించాలి. నిధులు విడుదల చేసి భూసేకరణ, పరిహారం, నిర్మాణ సమస్యలను పరిష్కరించాలి. కృష్ణా జలాలను వృథా కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించాలి. అప్పుడే వలసల జిల్లాగా పేరుపొందిన పాలమూరు సస్యశ్యామలమవుతుంది. రైతుల బతుకులు మారుతాయి. లేకపోతే ప్రభుత్వాలు మారినా పాలమూరు ప్రజల కన్నీళ్లు మాత్రం ఆగవు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పాలకులే!
కె.వెంకటేశ్వర్లు 9440854149





కామెంట్లు (0)