తెలంగాణపై ఢిల్లీ సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తున్నది. కేంద్ర సర్కారు దేశాన్ని బీజేపీ, బీజేపీయేతర రాష్ట్రాలుగా విభజించి సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని పార్లమెంటులో వాగ్దానం చేసిన కేంద్రం, పదేండ్లు గడిచినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. జాతీయ జీడీపీతోపాటు కేంద్ర పన్నులకు తెలంగాణ తన వాటా అందిస్తున్నా, నిధుల కేటాయింపుల్లో వివక్షను ఎదుర్కొంటున్నది. 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి 15వ ఫైనాన్స్ కమిషన్‌కు వచ్చేసరికి నిధులు భారీగా తగ్గాయి. 2023-24లో కేంద్రానికి లక్షల కోట్ల పన్నులు చెల్లించిన తెలంగాణ, రూపాయికి 40 పైసలు మాత్రమే తిరిగి పొందగలిగింది. బీహార్‌కు మాత్రం రూపాయికి రూ. 7.20 చొప్పున అందించింది. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సెప్టెంబరు నివేదిక ప్రకారం, తెలంగాణకు గ్రాంట్ల రూపంలో విడుదల చేయాల్సిన రూ. 12,083 కోట్లలో రూ. 8,377 కోట్లు తక్కువగా ఇచ్చింది.
విభజన హామీల అమలులోనూ నిర్లక్ష్యం కొనసాగుతున్నది. ఆశించిన ఆదాయం రాక, కేంద్రం నుంచి నిధులు అందక రాష్ట్రం ఇటీవల దాదాపు రూ. 44 వేల కోట్ల రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. రాష్ట్రం నుంచి ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా ప్రయోజనం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సకాలంలో అందకపోవడం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఒత్తిడులు పెరుగుతున్నాయి. కేంద్రం నుంచి నిధుల జాప్యం ఒకవైపు, పెరుగుతున్న ఆర్థిక అవసరాలు మరోవైపు రాష్ట్రానికి భారంగా మారుతున్నాయి.
గత కోవిడ్ సమయంలో ఉచిత పథకాల కోసం తెలంగాణ మూడు శాతం మేర ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రుణం తీసుకోవడంతో, కేంద్రం 2024-25లో రుణ పరిమితిని కుదించింది. ఇదే నిబంధనను ఉత్తరప్రదేశ్‌కు వర్తింపజేయ కుండా, ఆ రాష్ట్రానికి అదనంగా 4.1 శాతం రుణం తీసుకునే అవకాశం కల్పించింది.
ఐదేండ్ల పాటు జీఎస్టీ నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ముందుగానే రద్దు చేయడంతో తెలంగాణ రూ. 15 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ నెరవేరలేదు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ యూనిట్ ఇచ్చి, వేలాది ఉద్యోగాల అవకాశాలను దెబ్బతీసింది. ములుగు గిరిజన విశ్వవిద్యా లయానికి అవసరమైన రూ. 900 కోట్లకు గాను రూ. 30 కోట్లు మాత్రమే ఇచ్చింది.
హైదరాబాద్‌కు యూపీఏ ప్రభుత్వం రూ. 2.30 లక్షల కోట్ల పెట్టుబడితో మంజూరు చేసిన ఐటీఐఆర్‌ను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేసింది. సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్రం చెల్లించాల్సిన రూ. 1,200 కోట్ల బకాయిలు ఉపాధ్యాయుల జీతాలపై ప్రభావం చూపుతున్నాయి. 2018లో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించినా, కృష్ణాజలాల వివాదాన్ని కారణంగా చూపుతూ కేంద్రం అనుమతులి వ్వకుండా పెండింగ్‌లో ఉంచింది.
నిటి ఆయోగ్ లెక్కల ప్రకారం, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే ఎనిమిది బీజేపీయేతర రాష్ట్రాలకు తలసరి కేంద్ర పథకాల నిధులు 23 శాతం తక్కువగా అందుతున్నాయి.
కేంద్రం నిర్లక్ష్యం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంపైనా ప్రభావం చూపుతున్నది. పదేండ్ల తర్వాత కూడా రావాల్సిన నిధులను పెండింగ్‌లో పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరుగుతున్నది. ఎల్‌నినో నేపథ్యంలో తెలంగాణలోని 365 మండలాలు తీవ్ర కరువును ఎదుర్కొంటున్నా, కేంద్రం నుంచి తగిన సహాయం అందడం లేదు. నిధుల కేటాయింపుల్లో సమానత్వం, విభజన హామీల అమలులో చిత్తశుద్ధి సమాఖ్య వ్యవస్థకు అత్యవసరం. రాజకీయ ప్రయోజనాల ఆధారంగా రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం దేశ సమగ్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు అనుమతులు అందితే రాష్ట్ర అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమానికీ తోడ్పడుతుంది. తెలంగాణ కోరుతున్నది భిక్ష కాదు, తన రాజ్యాంగ హక్కు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఢిల్లీ, హైదరాబాద్‌లు పరస్పర సహకారం తప్పనిసరి. అదే సమాఖ్య స్ఫూర్తి.






కామెంట్లు (0)