Magazines

ఆశల పల్లకిలో ఉద్యోగులు ఇంకెంతకాలం?

15 నిమిషాల క్రితం

How much longer will employees remain in a palanquin of hopes?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 3 నిమిషాల చదవడం

ఆశల పల్లకిలో ఉద్యోగులను ఊరేగిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి రెండు కరువు భత్యాలు విదిల్చి పండుగలు చేసుకోమం టున్నది. పీఆర్సీ నివేదిక తెప్పిస్తామంటూ మాటలు చెబుతున్నది తప్ప ఆచరణలో ముందడుగు కనిపించడం లేదు. నివేదిక అందించడానికి స్పష్టమైన గడువు విధించకుండా ఎంతకాలమైనా ఎదురుచూడాలన్నట్లుగా వ్యవహరిస్తున్నది. జేఏసీతో చర్చల సందర్భంగా గడువు పెట్టామని, ఫలానా తేదీలో నివేదిక అందుతుందని చెబుతున్నా ఆచరణలో మాత్రం నివేదిక అందని ద్రాక్షగానే మిగులుతున్నది. ప్రభుత్వం తలుచుకుంటే నివేదిక అందదా? కమిటీ నివేదిక ఇవ్వలేని పరిస్థితి ఉంటుందా? ఇవి ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు. ఉద్యోగులకు కలిసిరాని కాలంలో ప్రభుత్వంతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. చట్టబద్ధంగా ఉద్యోగులకు అందాల్సిన హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అమలు జరగకపోవడంతో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలపై ఉంది. ప్రతి ఐదేళ్లకోసారి అమలు చేయాల్సిన పీఆర్సీ పట్ల పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం తనకు రావాల్సిన ఆదాయాన్ని లెక్కించుకుంటున్నది కానీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాల విషయంలో మాత్రం ఉపేక్షిస్తున్నది. నూతన వైద్య ఆరోగ్య పథకం అమలు జరగకుండానే ఒకటిన్నర శాతం లెక్కపెట్టి జమ చేసుకుంటున్న ప్రభుత్వం, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నదన్నది ప్రశ్న.

దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఉద్యోగుల సహనానికి కూడా పరిమితి ఉంటుందని జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. 206 సంఘాలకు, 13 లక్షల 30 వేల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జేఏసీ ఉద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వ ఆదాయానికి, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు ముడిపెట్టడం సమంజసం కాదు. ప్రభుత్వ ఆదాయమంతా ఉద్యోగులకే పంచాలని ఎవరూ కోరడం లేదు. నెలల తరబడి కరువుభత్యం అందక, మూడేండ్లు దాటినా పీఆర్సీ అమలు కాక ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఏండ్ల తరబడి వాయిదా వేస్తున్నది. రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా వారి ప్రయోజనాలు, దాచుకున్న సొమ్ము సకాలంలో అందక పోవడం విచారకరం. 33 ఏండ్లు ప్రభుత్వానికి సేవలందించి చివరకు అసంతృప్తితో ఉద్యోగ జీవితం ముగించాల్సి రావడం బాధాకరం.

ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడకుండా దసరా, దీపా వళి, సంక్రాంతి అంటూ కాలం గడుపుతున్నది. మరో రెండేళ్లలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ కాలపరిమితి ముగిసి ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వ అప్పులు, ఉద్యోగుల బకాయిల పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. గత ప్రభుత్వ అప్పులను సాకుగా చూపి ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నది. ప్రభుత్వాలు మారినా ఉద్యోగుల పట్ల పాలకుల వైఖరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. బాధ్యత ఎవరిదైనా ఉద్యోగులకు చెల్లించాల్సిన హక్కులను నిర్లక్ష్యం చేయడం సరికాదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉద్యోగులను ఎంతకాలం ఆశల పల్లకిలో ఊరేగిస్తారు? మాటలతో కడుపు నింపగలరా? పెరుగుతున్న ధరలతో జీతాలు పోటీ పడలేకపోతున్నాయి. ప్రభుత్వానికి జమ ఖర్చులు ఎలాగో ఉద్యోగుల కుటుంబాలకు కూడా బడ్జెట్ అవసరమే. కుటుంబాలు గడవడానికి సరిపడా ఆదా యం లేనప్పుడు ఎదురయ్యే సమస్యలు పాలకులకు తెలియనివి కావు. ఇప్పటికే మూడేళ్లు దాటినా 2023 జూలైలో అమలు కావా ల్సిన పీఆర్సీ నివేదిక 2026 ముగింపు నాటికీ అందకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. నివేదిక వచ్చేది ఎప్పుడు? అమలు చేసేది ఎప్పుడు? ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందేది ఎప్పుడో ప్రభుత్వమే చెప్పాలి. మరో రెండేళ్లు కూడా ఉద్యోగులను ఆశల పల్లకిలో ఊరేగించే పరిస్థితి రాకూడదు.

ప్రభుత్వం పట్ల ఉద్యోగ సంఘాలు ఎంతో సహనంతో, సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. ఆ సహనాన్ని బలహీనతగా భావిస్తే భవిష్యత్తులో పరిణామాలు మరో విధంగా ఉంటాయని జేఏసీ నాయకత్వం హెచ్చరిస్తున్నది. ఇప్పటివరకు చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. చివరకు ప్రభుత్వంతో తేల్చుకోవడానికి ఉద్యమమే శరణ్యమా అన్న ప్రశ్న ముందుకొస్తున్నది. చర్చల పేరుతో మరో రెండేళ్లు కాలయాపన చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమైతే ఉద్యోగుల అసంతృప్తి మరింత పెరుగుతుంది. ఉద్యోగులను, ప్రజలను నిర్లక్ష్యం చేసి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే గత ప్రభుత్వం ఎదుర్కొన్న రాజకీయ పరిణామాలు పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఇది బెదిరింపు కాదు, పాలకులు గుర్తించాల్సిన వాస్తవం. ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పాలకవర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు హక్కుల సాధనకు ఉద్యమాలే మార్గమవుతాయని ఉద్యోగ సంఘాలు గుర్తించాలి.

కె.వెంకటేశ్వర్లు, 9440854149

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్