‘‘ఎవరడ్డమొచ్చినా ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయడం ఆగదు’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్పష్ట ప్రకటన చేశారు. విలీనంపై ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ వస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో హడావిడి చేస్తున్నారు. ఈ విషయంలో చర్చించడం మంచిదే. ఎలాగూ మార్పునకు శ్రీకారం చుట్టినప్పుడు, దానిచుట్టూ అనుబంధంగా ఉన్న సంస్కరణ అంశాలు కూడా పరిష్కారానికి దగ్గరగా వస్తాయి. కనుక పనిలో పనిగా తెలంగాణ విద్యా కమిషన్ సూచించిన ప్యాటర్న్‌కు అనుగుణంగా మార్పులు చేయడం ఒక అవకాశంగా కలిసివస్తుంది.
ప్రభుత్వ బడుల తగ్గుదల.. ప్రైవేటు పెరుగుదల
కేంద్రం జూలై 7న ప్రకటించిన 2025-26 తెలంగాణ రాష్ట్ర యూడైస్ గణాంకాలు కూడా ప్రభుత్వ విద్యారంగంలో మార్పును కోరుకుంటున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, 2023-24 యూడైస్ నుంచి 2025-26 యూడైస్ నాటికి ప్రభుత్వ పాఠశాలలు 30,047 నుంచి 28,088కి తగ్గాయి. అంటే 1,969 పాఠశాలలు మూతపడ్డాయి. ఇదే సమయంలో ప్రైవేటు రంగంలో 12,424 పాఠశాలల నుంచి 13,245 పాఠశాలలకు పెరిగాయి. అంటే ప్రైవేటు రంగంలో 771 పాఠశాలలు పెరిగాయి. విద్యార్థుల సంఖ్య కూడా ఇదే నిష్పత్తిలో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 26.5 లక్షల మంది విద్యార్థులు (34.5 శాతం) ఉండగా, ప్రైవేటు విద్యాసంస్థల్లో 49.5 లక్షల మంది (64.5 శాతం) నమోదయ్యారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది ఒకటో తరగతిలో చేరిన 6.4 లక్షల మంది విద్యార్థుల్లో 70 శాతం మంది ప్రైవేటు విద్యాసంస్థల్లోనే చేరిపోయారు. ఈ గణాంకాలు దేనికి సంకేతం? దిగజారుతున్న ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ, మూత పడుతున్న ప్రభుత్వ పాఠశాలల భవితవ్యం ఏమిటో చూపిస్తున్నాయి. కనుక ఇంటర్ పాఠశాల విలీనం ప్రక్రియలో మార్పులు, చేర్పులు అవసరమైనప్పుడు ప్రభుత్వ బడుల సంస్కరణకు ఇదే సరైన సమయం, తరుణం కూడా అవుతుంది.
9-12 తరగతులతో ఉన్నత పాఠశాల వ్యవస్థ
గతేడాది పదో తరగతి పాసైన 4,97,312 మందిలో కొంత తగ్గినా, వారంతా మరుసటి విద్యా సంవత్సరం 12వ తరగతి (ఇంటర్ ద్వితీయ సంవత్సరం) పరీక్షలు రాయబోతున్నారు. ఈ ఏడాది మరో ఐదు లక్షల మంది విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులవుతారని లెక్కించుకుంటే, సుమారు 10 లక్షల మంది 11,12 తరగతుల్లో విద్యార్థులుంటారు. ఇక 9,10 తరగతుల విద్యార్థులను 10 లక్షలుగా అంచనా వేస్తే, 9-12 తరగతులతో ఉన్నత పాఠశాల విద్యా మండలిని ఏర్పాటు చేయడం ద్వారా ఇంటర్మీడియట్ బోర్డునే ఉన్నత పాఠశాల విద్యా బోర్డుగా మార్చుకునే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విద్యా కమిషన్ సూచించిన తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ (1-4 తరగతులు), కొన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు (1-8)కు పునర్వ్యవస్థీకరణ చేసి, ఇప్పుడు ఉన్న ఎస్సెస్సీ బోర్డును ప్రాథమికోన్నత విద్యా మండలిగా వ్యవస్థీకరించడం ద్వారా స్వల్ప మార్పులతో పాఠశాల విద్యా సంస్కరణ కూడా పూర్తవుతుంది.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా పునర్వ్యవస్థీకరణ
ఇంటర్ విలీనంతో పాటు పాఠశాల తరగతుల పునర్వ్యవస్థీకరణ కాస్త క్లిష్టమైనప్పటికీ, మండలాన్ని యూనిట్‌గా తీసుకొని యాక్సెస్ దృష్టి ఆధారంగా, కనీసం విద్యార్థుల సంఖ్యను ప్రాతిపదికన ఉన్న పాఠశాలల్లో కొన్ని ప్రాథమిక పాఠశాలలు (1-4), కొన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు (1-8)గా మార్చడంతో పాటు, ఇప్పుడున్న 426 జూనియర్ కళాశాలలు, 5,100 ఉన్నత పాఠశాలలను ఇంటర్‌తో కలిపి ఉన్నత పాఠశాల వ్యవస్థగా వ్యవస్థీకరించడం ఉత్తమ మార్గం అవుతుంది. విద్యార్థుల సంఖ్య, పాఠశాల అందుబాటు, కనీస సౌకర్యాలు, విద్యార్థుల నమోదు అనే నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్‌తో కూడిన ఉన్నత పాఠశాల వ్యవస్థను వ్యవస్థీకరించాలి. ఉన్నత పాఠశాలల్లో ఇప్పుడున్న 6,7,8 తరగతులను సమీప ప్రాథమికోన్నత పాఠశాలలకు, ఒకవేళ సరైన సంఖ్యలో విద్యార్థులు లేని ఉన్నత పాఠశాలల్లోని 9,10 తరగతులను సమీప ఇంటర్‌తో కూడిన ఉన్నత పాఠశాలకు షిఫ్ట్ చేయడం ద్వారా ఆయా పాఠశాలలను (1-8) తరగతులతో కూడిన ప్రాథమికోన్నత పాఠశాలలుగా మార్చవచ్చు. ఈ మార్పులన్నీ 2027 జూన్ పాఠశాల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాలంటే యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే యాక్సెస్ కోసం రవాణా సౌకర్యాలు సైతం కల్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విద్యారంగ సంస్కరణకు ఇంతకు మించి ప్రత్యామ్నాయాలు లేవు.
విలీనానికి మార్గదర్శకాలు.. ప్రైవేటుకు నిబంధనలు
ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఈ మార్పుల్లో అంతర్భాగం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం మొదటి చర్యగా పాఠశాల పునర్వ్యవస్థీకరణ, ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులను ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాల విద్యా బోర్డులుగా మార్చడంతో పాటు, జిల్లా, మండల స్థాయిలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కోసం అనుభవం కలిగిన సీనియర్ ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో కమిటీలు వేసి పునర్వ్యవస్థీకరణ సిఫార్సులు తీసు కోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన స్పష్టమైన గైడ్‌లైన్స్, విలీనంలో తలెత్తే సమస్యలపై కూడా రాష్ట్రస్థాయిలో విద్యానిపుణులతో చర్చించి నిబంధనలు రూపొందించడం అవసరం. ఈ ప్రక్రియ కేవలం ఇంటర్ తరగతులను ఉన్నత పాఠశాలకు అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి చేతులు దులుపుకునేది ఎంతమాత్రం కాదు. అలా చేయడం వలన దుష్ఫలితాలు తప్ప సత్ఫలితాలు కనిపించవు. కనుక ఇంటర్ విలీన ప్రక్రియలో అంతర్భాగంగానే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యలో చేసిన మార్పులనే ప్రైవేటు విద్యావ్యవస్థలు కూడా పాటించాలి. అలా చేయని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దుకు నోటీసులిచ్చి వెనువెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు పాఠశాలల్లో తెలంగాణ విద్యా కమిషన్ చేసిన ప్రధాన సూచన ప్రకారం, జీ, టోఫెల్ లాంటి జాతీయ పరీక్షల కోచింగ్ ప్రక్రియను రద్దు చేయాలి. అవసరమైన మేరకు అలాంటి శిక్షణను ఇంటర్ విలీన ప్రక్రియ తర్వాత అన్ని ఉన్నత పాఠశాలల్లో 9-12 తరగతుల సిలబస్‌లోనే కోచింగ్ అంతర్భాగం చేసి బోధించాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా వ్యవస్థలు ఏవైనా ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన విద్యా బోర్డుల ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకునేలా చూడాలి.
సంస్కరణలకు చట్టబద్ధత
ఇలా చేయడం వలన రోజురోజుకూ నమోదు పడిపోతున్న గ్రామీణ పాఠశాల వ్యవస్థ పునర్జీవం, పునరుత్తేజం పొందడంతో పాటు, పాఠశాల మౌలిక సౌకర్యాల కల్పన, బోధనా, బోధనేతర సిబ్బంది సర్దుబాటు, నియామకం సైతం అవసరమవుతుంది. పాఠశాల పునర్వ్యవస్థీకరణతో పాటే ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాల మానిటరింగ్ సిస్టమ్‌కు కూడా ఉన్న నిబంధనలను వెలుగులోకి తెచ్చి ప్రాణప్రతిష్ట చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నూతనంగా తెస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఆధునిక మార్పుల్లో అంతర్భాగం కావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే తెలంగాణ పాఠశాల పునర్వ్యవస్థీకరణకు చట్టబద్ధత పూర్తిస్థాయిలో లభిస్తుంది.
ఎన్.తిర్మల్, 9441864514






కామెంట్లు (0)