Magazines

‘‘ఎల్‌‌నినో’’ వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా?

2 గంటల క్రితం

global summit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 3 నిమిషాల చదవడం

హైదరాబాద్‌లో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత తీవ్రతరమవుతున్న తరుణంలో గ్లోబల్ సమ్మిట్ ఆకృతులు ధూమ్‌ధాంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ముచ్చటపడినట్లు డిజైన్లు, సదస్సు, అతిథులు, సందర్శకులకు నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు అనివార్యం. అంటే, నీరు, కరెంటు వినియోగంపై మరింత ఒత్తిడి పడుతుంది.ప్రపంచ స్థాయి సదస్సుతో తక్షణం ఒనగూరే ప్రయోజనమేమిటో తెలియదు. కానీ, ఈ కరువులో నీరు, విద్యుత్, నిధులు వంటి వనరుల అదనపు వ్యయభారం దృష్ట్యా సమ్మిట్ వాయిదా అవకాశాలను చురుగ్గా పరిశీలించాలి. ఎల్‌నినో పరీక్షా కాలంలో అంతర్జాతీయ సదస్సు పేరిట పటాటోపాలు అవసరమా? ఆలోచించాలి. పరిస్థితులు సాధారణంగా, సజావుగా ఉన్నప్పుడే తలపెడితే ఎంతోకొంత సార్థకత ఉండొచ్చు. సమయం కాని సమయంలో, అసందర్భ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉద్ధరించేదేమిటో పునరాలోచించాలి. ఇప్పటినుంచే ఏసీ, ట్యూబ్‌లైట్‌ వాడకాలు తగ్గించాలని, ఇళ్లలోనూ నీటి వినియోగాన్ని ఇరవై శాతం కుదించాలని స్వయంగా ముఖ్యమంత్రే సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా పౌర సమాజాన్ని ఆ దిశగా సమాయత్తం చేస్తోంది.

గ్లోబల్ సమ్మిట్ తలపెట్టిన డిసెంబర్ 7, 8, 9 తేదీలకల్లా నీరు, విద్యుత్ సరఫరా, డిమాండ్ మధ్య అంతరం పెరిగే ప్రమాదముంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ 7వ తేదీనే సమ్మిట్ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ సర్కారు మూడో వసంతంలో క్షామం గాఢంగా అలుముకోవడం ఆ పార్టీ శ్రేణుల అనుభూతిని ఆవిరి చేసే కాలమే. ప్రజలెవరూ సంతోషంగా లేని విపత్కర స్థితిలో అట్టహాసాలు ఎబ్బెట్టుగానే ఉంటాయి. మూడు రోజుల సమ్మిట్ కోసం కాపాడుకోవాల్సిన నీరు, కరెంటును అదనంగా వినియోగించడం సరైనదేనా? ఇప్పటికే హైదరాబాద్‌లో వాటర్ ఎమర్జెన్సీ ఛాయలు నెలకొన్నాయి. డిసెంబర్ కల్లా ఎల్‌నినో ప్రభావం తీవ్రతరమైతే తగినంత నీరు, విద్యుత్ లభ్యత ప్రశ్నార్థకం కావొచ్చు. సమ్మిట్‌కు ముందు, ఆ మూడు రోజుల్లో అదనపు వినియోగం నగరానికి తలకు మించిన భారమే. ప్రాథమిక హక్కులైన ఈ వనరులను సాధా రణ పౌరులకు మరింత దూరం చేసేలా ఈ సమయంలో సమ్మిట్ నిర్వహించడం సందర్భోచితం కాదు. ప్రజాధనాన్ని, విలువైన నీటిని, విద్యుత్ వనరులను ప్రచార కండూతికి తగలేయరాదు. గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్‌లో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీ వెళ్లడమే ఆయన ప్రాధాన్య క్రమాన్ని సూచిస్తోంది.

హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ సన్నా హాలకు పిలుపునిస్తూనే, హస్తినలో కేంద్రాన్ని రూ.30 వేల కోట్ల కరువు సహాయం కోరాలనుకోవడం తెలంగాణలో కోరలు చాచిన దుర్భిక్షానికి ప్రతీక. గోదావరి జలాలను ఎత్తిపోయకపోవడం వల్ల కాళేశ్వరం నెట్‌వర్క్‌లోని బరాజ్‌ల మీదుగా రోజుకు సుమారు ఇరవై వేల క్యూసెక్కుల జలాలు సముద్రం పాలవుతున్నాయి. రాజకీయ కారణాలతో వెలకట్టలేని నీటిని ఒడిసిపట్టకపోగా, గ్లోబల్ సమ్మిట్ వల్ల హైదరాబాద్‌లో నీరు, కరెంటు వినియోగం మరింత భారంగా మారనుంది. అక్టోబర్ 28 నాటి అంచనాల ప్రకారం హైదరాబాద్‌కు ప్రస్తుతం రోజుకు సుమారు 550 ఎంజీడీల నీరు సరఫరా అవుతోంది. ప్రస్తుత అవసరాలకు 700 ఎంజీడీలు కావాలి. అంటే 150 ఎంజీడీల వ్యత్యాసం ఉంది. 2027 నాటి అవసరాలను బట్టి అంచనా డిమాండ్ 835 ఎంజీడీలు. సింగూరు నుంచి నీటి లభ్యత తగ్గితే రాబోయే నెలల్లో రోజుకు సుమారు 50 ఎంజీడీల కొరత ఏర్పడవచ్చు. ఒక ఎంజీడీ సుమారు 45.46 లక్షల లీటర్లు.


50 ఎంజీడీలు అంటే రోజుకు 22.73 కోట్ల లీటర్లు, 150 ఎంజీడీలు అంటే 68.19 కోట్ల లీటర్లు. విద్యుత్ విషయంలోనూ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. అనధికార అంచనా ప్రకారం అక్టోబర్ 26 వరకు ఈ నెలలో సుమారు 17 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత నమోదైంది. నివాస సముదాయాలు, ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, పరిశ్రమలు, నిర్మాణ రంగం, బోర్లు, మోటార్ల వినియోగంపై ఈ ప్రభావం పడుతుంది. నీరు, కరెంటుకు కటకట తప్పని పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై పునరాలోచన అవసరం. అనావృష్టి దృష్ట్యా సమ్మిట్ వాయిదా వేయాలని ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి లేదా గవర్నరుకు విన్నవించాలి. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. ప్రజల తాగునీటి అవసరాలు, విద్యుత్ సరఫరాకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. కరువు పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవడం ప్రభుత్వ బాధ్యత. తాత్కాలిక ప్రచార ప్రయోజనాల కంటే ప్రజల ఇబ్బందుల పరిష్కారమే ముఖ్యం. ప్రస్తుత పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి, గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై ప్రజాప్రయోజనాల దృష్టితో నిర్ణయం తీసుకోవాలి.


ఇల్లెందుల దుర్గాప్రసాద్, 9440850384

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్