Magazines

పెరుగుతున్న ‘ప్రచ్ఛన్న’ నిరుద్యోగం

19 నిమిషాల క్రితం

Rising ‘disguised’
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 5 నిమిషాల చదవడం

ఇండియా వంటి దేశాలలో నిరుద్యోగం లెక్కల్లో కనిపించేదానికన్నా ఎక్కువగా, ప్రచ్ఛ న్నంగా- అంటే పైకి కనిపించకుండా ఉండే విధంగా- విస్తరించి వుంటుందని అభివృద్ధి గురించి చర్చించే ఆర్థికశాస్త్రం ప్రాథమికంగా పరిగణిస్తుంది. దీనికి కారణం ఏమిటి? ఇండియా వంటి మూడవ ప్రపంచ దేశాలలో చిన్న కమతాల వ్యవసాయం, కుటీర లేదా గృహ పరిశ్రమలు గణనీయంగా ఉంటాయి. వీటిలో కుటుంబ సభ్యులందరూ పని చేస్తారు. ఈ కుటుంబాలకు చెందినవారు ఇతరత్రా ఉద్యోగాలకు కావలసిన విద్యా, సాంకేతిక అర్హతలు సంపాదించుకున్నా చాలామందికి అటువంటి ఉద్యోగాలు దొరకవు. అటువంటివారు తమ కుటుంబంపైనే ఆధారపడవలసి వస్తుంది. ఆ పరిస్థితుల్లో వారు కూడా తమ కుటుంబానికి సంబంధించిన వ్యవసాయ పనుల్లోనో, కుటీర పరిశ్రమ పనుల్లోనో పాలు పంచుకుంటారు. ఒకవేళ జీతానికి పనులు ఎక్కడైనా దొరికితే ఇటువంటివారు ఆ పనుల్లోనే కుదురుకోడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి పని ఏదీ దొరకనందువల్లే వాళ్లు కుటుంబపనుల్లో నిమగ్నమ వుతున్నారు. ఒకవేళ బయట పనులు దొరికితే ఇటువంటి వారిని ఆ పనుల్లోకి పంపడానికి కుటుంబ సభ్యులు కూడా సుముఖంగానే ఉంటారు. ‘వేన్నీళ్లకు చన్నీళ్లు’ లాగా బయట పని నుంచి వచ్చే ఆదాయం తమ కుటుంబానికి తోడవు తుందని, లేకపోతే కనీసం ఒకరిని పోషించే భారమైనా తగ్గుతుందని వారు భావిస్తారు.

ఇటువంటి ఆర్థిక వ్యవస్థలో సాధారణ స్థాయి వేతనం లభించే పనులు తక్కువగా ఉంటాయి. ఆ పనులను చేసేందుకు సిద్ధంగా ఉండేవాళ్లు ఎక్కువగా ఉంటారు. ఖాళీగా, పని లేకుండా గడిపే బదులు ఏదో ఒక పనిని చేసుకుంటూ బతుకు కొనసాగిస్తారు. ఆ పనులకు సాధారణ స్థాయి వేతనం కన్నా చాలా తక్కువ వేతనమే దక్కుతుంది. అయినప్పటికీ వేరే మార్గం లేక ఆ పనుల్లోనే వీళ్లు కొనసాగుతారు. ఇటువంటి వారందరూ పనిలోనే ఉన్నట్టు, వారికి ఎటువంటి నిరుద్యోగ సమస్యా లేనట్టు ప్రభుత్వం పరిగణిస్తుంది. ఇది ‘ప్రచ్ఛన్న నిరుద్యోగం’’ కిందకే వస్తుంది. మార్క్స్‌ ‘శ్రామి కుల రిజర్వు సైన్యం’ అంటూ అభివర్ణించిన నిరు ద్యోగుల కోవలోకే ఈ ‘‘ప్రచ్ఛన్న నిరుద్యోగులూ’’ వస్తారు. ఇటువంటివారి సంఖ్య ఎంత పెరిగితే, అంతమేరకు రిజర్వు సైన్యపు శ్రామికులకు, పనుల్లో ఉన్న శ్రామికులకు మధ్య నిష్పత్తి అంతగా పెరిగిపోతూ వుంటుంది.

ప్రస్తుతం మనం ఇండియాలో ఈ నిష్పత్తి పెరిగిపోవడాన్ని చూస్తున్నాం. అంటే, లెక్కల్లో కనిపించనప్పటికీ, మన దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోతోంది. 2017-18లో, ఆ తర్వాత 2023-24లో జరిపిన కార్మిక జన సర్వేలను పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. 2017-18లో శ్రమలో పాల్గొన్న మహిళల శాతం 24.7గా ఉంటే అది 2023-24 నాటికి 47.6 శాతానికి పెరిగింది. మహిళా కార్మికుల సంఖ్య ఈ విధంగా పెరగడం అంటే అది అభివృద్ధే కదా అని అనుకునేవారుంటారు. సాధారణంగా మహిళ ఉద్యోగం చేస్తే ఆ మేరకు ఆమె ఆర్థిక స్వాతంత్ర్యం కలిగి వుంటుంది. కనుక తన విషయంలో, కుటుంబ నిర్వహణ విషయంలో ఆ మేరకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలు గుతుంది. అందుచేత మహిళా కార్మికుల శాతం పెరగడం మంచిదే అని అనిపిస్తుంది.

కాని అసలు వాస్తవం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. పనుల్లో ఉండే మహిళల శాతం పెరిగిన మాట నిజమే కాని ఈ పెరుగుదల ఎక్కువగా ఏ వేతనమూ పొందని పనుల్లో జరిగింది. అంటే ఈ మహిళల్లో ఎక్కువమంది తమ స్వంత వ్యవసాయ పనుల్లోనో, తమ కుటుంబం నిర్వహించే కుటీర పరిశ్రమ పనుల్లోనో పని చేస్తున్నారు. అయితే వారంతా పనుల్లోనే ఉన్నారు కనుక ప్రభుత్వ సర్వేలో వారిని శ్రామికులుగానే గుర్తిస్తారు. ‘‘స్వయం ఉపాధి పొందుతున్న కార్మికులు’’గా వారిని నమోదు చేస్తారు. ఇటువంటి పనులు చేసే మహిళల శాతం పెరగడం అంటే వారు చేసే ఇంటి చాకిరీకి అదనంగా మరింత చాకిరీ తోడయిందే తప్ప అందుకు వారికి ఏ వేతనమూ లభించలేదు కదా. మరి స్వంత ఆదాయం లేనప్పుడు ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కడి నుంచి వస్తుంది?

అంతే కాదు. దేశంలో వ్యవసాయ కమతాల సంఖ్య పెరగలేదు. కుటీర పరిశ్రమల సంఖ్య కూడా పెరగలేదు. అంటే మొత్తం మీద అదనంగా ఉపాధి అవకాశాలు ఏమీ పెరగలేదు. కాని వాటిలో పని చేసే మహిళల శాతం మాత్రం పెరిగింది. దీని అర్ధం ఏమిటి? అంతకు మునుపు ఆ వ్యవసాయంలో, లేదా కుటీర పరిశ్రమలో కూలీకి పనిచేసే వ్యక్తుల్ని తెచ్చి పెట్టుకునేవారు. ఇప్పుడు చిన్న కమతాల వ్యవసాయం, కుటీర పరిశ్రమలు చితికిపోతున్నందున కూలీ ఇచ్చి మనుషుల్ని పెట్టుకునే స్తోమత లేకుండా పోయింది. ఫలితంగా అటువంటి పనులన్నీ ఇండ్లలోని మహిళల నెత్తిన పడ్డాయి. అంతేకాక, అంతకు ముందు ఈ రంగాల్లో బయటవారికి దొరికే పనులు ఇప్పుడు దొరకడం లేదు. అంటే ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. కాని ఇదేమీ ప్రభుత్వం వేసే ‘నిరుద్యోగ రేటు’ అంచనాల్లో ఎక్కడా కనిపించదు.

ఇంటి చాకిరీ, బిడ్డల పెంపకం వంటి బాధ్యతలకు తోడు అదనంగా కుటుంబ వ్యవసాయంలోనో, కుటీర పరిశ్రమలోనో మహిళలు శ్రమ చేయడం పెరిగింది అంటే అది వారి కుటుంబాల్లో పెరిగిన పేదరికాన్ని సూచిస్తుంది. ఆ కుటుంబ వ్యవసాయమో, లేక కుటీర పరిశ్రమో కొనసాగాలంటే ఈ మహిళలు ఎటువంటి వేతనమూ లేకుండా వాటిలో శ్రమ చేయవలసిందే. కూలీ ఇచ్చి పనులు చేయంచుకునే బదులు ఎటువంటి కూలీ లేకుండా కుటుంబ మహిళలతో అవే పనులు చేయించుకోవడం అంటే ఆ కుటుంబం మరింత పేదరికంలోకి జారిపోతోందని కదా అర్థం?

ఇటువంటి దుర్భర పరిస్థితులు నెలకొన్న కాలంలో ఎన్డీయే ప్రభుత్వం పులి మీద పుట్ర లాగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తిపెట్టేసింది. నిరుద్యోగ సమస్య పట్ల ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందో చూడండి! వాస్తవానికి ఇటువంటి ఉపాధి హామీ పథకాలు పేదరికంలోకి దిగజారుతున్న గ్రామీణ కుటుంబాలకు ఊరట కల్పిస్తాయి. పేదరికం పెరిగిపోతు న్నప్పుడు ఇటువంటి పథకాల అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ పథకాన్ని మరింత విస్తరించే బదులు దానిని నీరుగార్చడం ఎంత దారుణమో గమనించండి. పైగా ఈ ఏడాది ఎల్‌-‌నినో ప్రభావం వలన పంటల దిగుబడి బాగా దెబ్బ తిననుంది. ఇటువంటి సమయంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటిది లేకపోవడం గ్రామీణ పేదరికాన్ని మరింత పెంచుతుంది.

ఇలా ప్రచ్ఛన్న నిరుద్యోగం పెరిగితే దాని ప్రభావం లేబర్‌ ‌మార్కెట్‌ ‌మీద కూడా కనిపిస్తుంది. క్రమానుగతంగా నిర్వహించే కార్మిక సర్వేల నుండి అందే డేటాను పరిశీలిస్తే వేతనాలు లభించే ఉద్యోగాల శాతం తగ్గి, స్వయం-ఉపాధి ఉద్యోగాల శాతం పెరుగుతున్నట్టు వెల్లడౌతోంది. 2017లో మొత్తం ఉద్యోగాలలో స్వయం-ఉపాధి ఉద్యోగాల శాతం 52.2 ఉంటే అది 2025 నాటికి 56.2 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో వేతనాలు లభించే ఉద్యోగాల శాతం 47.8 నుండి 43.8 కి తగ్గిపోయింది. వేగంగా పెట్టుబడిదారీ వ్యవస్థగా మార్పు చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఇటువంటి ఫలితం వస్తుందని ఎవరూ ఊహించరు. దీనిని బట్టి ఒక్కటే తెలుస్తోంది. పెట్టుబడిదారీ రంగం తగినంతగా ఉపాధి అవకాశాలను కల్పించడం లేదు. దాంతో ఎక్కువమంది చిన్న స్థాయి ఉత్పత్తి రంగం (చిన్న కమతాల వ్యవసాయం, కుటీర పరిశ్రమలు) వైపు మళ్ళవలసి వస్తోంది.

అక్కడ ఇప్పటికే రిజర్వు శ్రామిక సైన్యం గణనీయంగా ఉంది. 2019 తర్వాత స్వయం-ఉపాధి ద్వారా పొందుతున్న తలసరి ఆదాయాలు బాగా తగ్గిపోయాయంటే అది ఏమీ ఆశ్చర్యం కలిగించదు. అంతేకాదు. 2018-19 తర్వాత రెగ్యులర్‌ ‌వర్కర్ల వేతనాలలో పెరుగుదల నిలిచిపోయింది. అదే కాజువల్‌ ‌వర్కర్ల వేతనాలైతే వాస్తవంగా తగ్గిపోయాయి. లేబర్‌ ‌మార్కెట్‌ లో రిజర్వు శ్రామిక సైన్యం శాతం పెరిగిపోయి నందువల్ల ఈ పరిస్థితి ఎదురైంది.

భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు ఈ మధ్య ఈ విషయాన్ని అంగీకరించాడు. ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నా, ఆ ఉద్యోగాల ద్వారా తగినంత ఆదాయం మాత్రం లభించడం లేదని ఆయన అన్నారు. ఉద్యోగం, లేదా ఉపాధి అంటే దాని ద్వారా ఒకానొక ‘సాధారణ స్థాయి’ వేతనం లేదా ఆదాయం లభించేది అయివుండాలి. ఉద్యోగాలు పెరుగుతున్నాయి కాని ఆదాయాలు పెరగడం లేదంటే దానర్ధం ప్రచ్ఛన్న నిరుద్యోగం పెరుగుతోందని ఒప్పుకోవడమే. రిజర్వు శ్రామిక సైన్యం సైజు పెరుగుతోందని అంగీకరించడమే.

దేశంలో పెరుగుతున్న పెట్టుబడిదారీ విధానం గురించి, శరవేగంగా సాధిస్తున్న జీడీపీ వృద్ధి గురించి, స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్లను ఎలాగైనా సంతృప్తిపరిచి, ప్రసన్నం చేసుకుని ఒప్పందాలు కుదుర్చుకోవడం గురించి తెగ గొప్పలు చెప్పుకుం టున్నాయి ప్రభుత్వాలు. ఈ విధానాలే దేశ ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించేయగలవని సంబరపడి పోతున్నాయి. కాని వాస్తవంలో శ్రామిక రిజర్వు సైన్యం సాపేక్షంగా పెరిగిపోతోంది. నిష్ట దరిద్రుల శాతం పెరిగి పోతోంది. ఈ పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనా మన దేశానికి గాని, తక్కిన మూడవ ప్రపంచ దేశాలకు గాని ఎందుకూ ఉపయోగపడదన్న వాస్తవాన్ని ఇది స్పష్టం చేస్తోంది.

(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ ‌పట్నాయక్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్