Magazines

సూపర్‌హీరో టోపీని వదిలేయండి

15 నిమిషాల క్రితం

Leave the superhero hat behind.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 4 నిమిషాల చదవడం

మన దేశంలో ఒక మహిళ గర్భవతి అయితే ఏం తినాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, ఏ పరీక్షలు చేయించుకోవాలి అనే విషయాలపై ప్రతిఒక్కరి దగ్గర ఒక జాబితా రెడీగా ఉంటుంది. కానీ చాలా వరకు తల్లి తన ఆరోగ్యం కంటే పుట్టబోయే బిడ్డకే ప్రాధాన్యం ఇస్తుంది. నవజాత శిశువుకు జ్వరం వస్తే శిశు వైద్యులకు వెంటనే ఫోన్ చేస్తారు. కానీ తల్లి ఎదుర్కొనే సమస్యలు మాత్రం కనబడవు. బిడ్డకు జన్మనివ్వడం, అర్ధరాత్రి ఒంటి గంటకు పాలు పట్టడం వంటి సమస్యలను అధిగమించడం నుండి, ఇంటి పనులు చక్కబెట్టుకుని తిరిగి ఉద్యోగంలో చేరడం వరకు ఆమె ఒక సూపర్‌హీరోలా అన్నిటినీ ఎదుర్కోవాలని ఆశిస్తారు. గర్భస్రావం, సంతానలేమి సమస్యలు, ప్రసవానంతరం కోలుకోవ డానికి పడే ఇబ్బందులు, తల్లులకు సరైన సంరక్షణ అందుబాటులో లేకపోవడం వంటి ఎన్నో సమస్యలను తన వ్యక్తిగత అనుభవంలో ఐశ్వర్య మిశ్రా గమనించారు. ఈ అంతరాన్ని పూడ్చడానికి ఆమె ‘ది మామా సర్కిల్’ను స్థాపించారు.


33 ఏండ్ల ఐశ్వర్య మిశ్రాకు ప్రసూతి సంరక్షణలోని ఈ అంతరం వ్యక్తిగతమైంది. నీటి పారుదల, పట్టణ రంగాలలో ఎనిమిదేండ్ల అనుభవం ఉన్న ఒక అభివృద్ధి నిపుణురాలిగా జైకా (జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ), ఆసియా అభివృద్ధి బ్యాంకులో పనిచేసిన అనుభవంతో ఆమె డేటాతో సమస్యలను పరిష్కరించడానికి అలవాటు పడ్డారు. ఆమె చేసిన ఈ ప్రయాణం ఆమెకు ప్రసూతి రంగంలోని అనేక లోపాలను బహిర్గతం చేసింది. తన మొదటి గర్భాన్ని కోల్పోయారు. తర్వాత ఐవీఎఫ్ మందులు వాడుతూ ఆరు నెలల పాటు ఆందోళనను భరించారు. ఆపై రెండవ గర్భం, ప్రసవానంతర కోలుకునేందుకు ఆమె అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఆమె హాస్పిటల్‌ ‌నుండి వస్తున్నపుడు ఆన్‌లైన్‌లో ఉన్న చాలా చెక్‌లిస్ట్‌లు కేవలం నవజాత శిశువుల కోసమే రూపొందించబడ్డాయని ఆమె గ్రహించారు. ‘ఒక తల్లికి ఏం కావాలో, ఆమెకు ఉపయోగపడే ఉత్పత్తులు చాలా తక్కువగా ఉన్నాయి’ అని ఆమె అంటున్నారు.

ఇండియన్ పేరెంటింగ్ ఫోరమ్‌

ప్రతి గర్భం భిన్నంగా ఉంటుంది. కనుక కుటుంబం, పేరెంటింగ్ వెబ్‌సైట్‌లు, వాట్సాప్ గ్రూపుల నుండి వచ్చిన సలహాలు ఆమెకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయాయి. బిడ్డ పుట్టిన ఆరవ నెల చివరిలో ఆమె ఇండియన్ పేరెంటింగ్ ఫోరమ్‌లో చేరారు. ఇది 4,000 నుండి 5,000 మంది తల్లులు ఉన్న ఒక వాట్సాప్ కమ్యూనిటీ. ఇందులోని సభ్యులు బిడ్డ ఏడవడం, పాలు పట్టడంలో ఇబ్బందులు, ఇతర సమస్యల గురించి నిత్యం గ్రూపును సంప్రదించేవారు. కానీ సరైన సమాధానాల కోసం చాలా ఇబ్బంది పడేవారు. ఈ విషయంపై జరిగిన సంభాషణలు, అలాగే పిల్లలున్న ఇద్దరు సన్నిహిత స్నేహితులతో జరిపిన చర్చలు ఆమె అనుమానాన్ని మరింత బలపరిచాయి. గర్భధారణ సమయంలో మహిళల పట్ల కొంత శ్రద్ధ ఉంటుంది కానీ ప్రసవానంతర మాత్రం ఆమెను ఆమే చూసుకోవాలి.

పంథాను మార్చుకునేలా చేసింది

ఐశ్వర్య తన గర్భధారణ నోట్స్‌ను ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టడంతో మొదలుపెట్టింది. MakeMyTripలో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తన భర్త అభినవ్ త్యాగితో ఈ విషయం గురించి చర్చించిన తర్వాత ఆమె ఆ ఫైల్‌ను ఒకే వేదికగా మార్చాలని నిర్ణయించుకుంది. ఈ లోపాలను పూరించడానికి వారు మే 2026లో ఢిల్లీలో TheMamaCircleను ప్రారంభించారు. మొదట్లో ఇది ఒక సాధారణ చాట్‌బాట్‌తో కూడిన కేవలం ఉత్పత్తి సిఫార్సుల డైరెక్టరీ మాత్రమే. కానీ కొత్త తల్లుల నుండి వచ్చిన అభిప్రాయం వెంటనే పంథాను మార్చుకునేలా చేసింది. ‘మహిళలకు షాపింగ్ లింకులు వద్దు. అర్ధరాత్రి ఒంటి గంటకు బిడ్డ ఏడుపు ఆపనప్పుడు లేదా తాము కోలుకోవడంలో ఇబ్బందులు అనిపించినప్పుడు సరైన సమాధానాలు కావాలి’ అని ఆమె అంటారు. ఐశ్వర్య కేటలాగ్ పద్ధతిని వదిలిపెట్టి ఏఐతో పాటు వైద్య నిపుణులతో సంప్రదింపుల ఆధారంగా ప్లాట్‌ఫామ్‌ను పునర్నిర్మించారు.

నిపుణుల సలహాలను మేళవించి

ఐదు నెలల కూతురు ఆర్యానాను చూసుకుంటూ ఐదుగురు సభ్యుల ప్రధాన బృందాన్ని నిర్వహించడం అంటే ఒంటరిగా చేయడం కష్టం. ఐశ్వర్య మాతృ-ఆరోగ్య పరిశోధన, కంటెంట్ నిర్మాణానికి నాయకత్వం వహించగా ఆమె భర్త త్యాగి రియాక్ట్, టైప్‌స్క్రిప్ట్, గూగుల్ జెమిని మోడల్స్‌పై సాఫ్ట్‌వేర్ స్టాక్‌ను నిర్మించారు. ‘ఆర్యానా కోసం నేను నిద్రలేని రాత్రులు గడిపితే, అతను ప్లాట్‌ఫామ్ కోసం నిద్రలేని రాత్రులు గడిపాడు’ అని ఐశ్వర్య చెబుతున్నారు. అలాగే తన తల్లిదండ్రులు రోజువారీ ఇంటి పనులను చూసుకోవడానికి ముందుకు వచ్చారని తెలిపారు. అనేక దశల ఆధారంగా రూపొందించబడిన ‘ది మామా సర్కిల్’ తన సేవలను మూడు ప్రత్యేక విభాగాలుగా నిర్వహిస్తుంది. అవి ‘సర్కిల్ ఫర్ మామా’, ‘సర్కిల్ ఫర్ ప్రెగ్నెన్సీ’, ‘సర్కిల్ ఫర్ బేబీ’. గర్భధారణకు ముందు సంతానోత్పత్తి, పోషణ, గర్భధారణ నుండి మొదలుకొని, ప్రసవానంతర ఆరు నెలల కోలుకునే సమయం, బాల్యం వరకు వివిధ దశలలో కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే ఈ వేదిక లక్ష్యం. ప్రసవానంతరం 40 రోజుల విశ్రాంతి, గర్భ సంస్కారం, భారతీయ పోషకాహార అవసరాలను వివరిస్తుంది. చాలా మంది ఈ 40 రోజులను ఆచారాలతో ముడిపెడతారు. కానీ ఐశ్వర్య దృష్టిలో ముఖ్యమైన విషయం విశ్రాంతి. పుట్టిన మొదటి 10 రోజుల్లోనే ఇంటి పనులు మొదలుపెట్టే తల్లికి శారీరకంగా కోలుకోవడానికి సమయం ఉండదని ఆమె అంటారు.

రోజువారి ప్రశ్నల కోసం...

డిజిటల్ పరంగా ఈ ప్లాట్‌ఫామ్ రోజువారీ పేరెంటింగ్ ప్రశ్నల కోసం మామాఏఐ (MamaAI) అనే చాట్‌బాట్‌ను అందిస్తుంది. దీనితో పాటు క్రై అనలైజర్ (Cry Analyser), బేబీ పూప్ అనలైజర్ (Bappy Poop Analyser), డయాస్టాసిస్ రెక్టి చెకర్ (Diastasis Recti checker), సి-సెక్షన్ మచ్చలు, ప్రసవానంతర రక్తస్రావం కోసం ఫొటో ఆధారిత తనిఖీలు, వెల్నెస్ ఆరా స్కోర్ (Wellness Aura Score) వంటి సాధనాలను కూడా అందిస్తుంది. వైద్య నిర్ధారణలా కాకుండా, 22 ప్రశ్నల స్వీయ-ఆడిట్‌గా రూపొందించబడిన ఈ స్కోర్ ఒక తల్లికి ఎలాంటి మద్దతు అవసరమో సూచిస్తుంది. ఇది మానసిక శ్రేయస్సుకు 30%, శారీరక కోలుకోవడానికి, ఆహారానికి చెరో 25%, నిద్ర, పోషణకు కలిపి 20% ప్రాధాన్యం ఇస్తుంది. ఐశ్వర్య అనుభవాలు ఈ ప్లాట్‌ఫామ్‌ను మరింతగా తీర్చిదిద్దాయి. 30 గంటల ప్రసవ వేదన తర్వాత ఆమె చనుబాలు పట్టించడంలో సమస్యలు, ప్రసవానంతర డిప్రెషన్‌తో కూడా పోరాడవలసి వచ్చింది. తనకు అండగా నిలిచే భర్త, కుటుంబం ఉన్నప్పటికీ మార్గదర్శనం కోసం ఒక నిపుణుడిని సంప్రదించాల్సిన అవసరం ఉందని కూడా ఆమె గ్రహించింది.

సూపర్‌హీరోల పని చేయాలని...

ఐశ్వర్యకు భారతదేశంలోని ప్రసవానంతర సంరక్షణ అంతరాన్ని పరిష్కరించడమంటే కుటుంబాలు మాతృత్వం, కోలుకోవడం పట్ల చూసే దృక్పథాన్ని సవాలు చేయడం కూడా. మన దేశంలో అలసిపోని సూపర్‌హీరోల పని చేయాలని ఆశిస్తూ కొత్త తల్లులపై తీవ్రమైన భారం వేస్తున్నారని ఐశ్వర్య అంటున్నారు. ఇలాంటి కారణాల వల్ల మహిళలు ఇంటి పనుల్లో సహాయం అడగడానికి, తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడానికి మొహమాటపడుతుంటారు. ఈ విషయంలో తన కుటుంబంతో కూడా ఐశ్వర్య ఘర్షణను ఎదుర్కొన్నారు. ఆ చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొత్త తల్లులకు వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని శిశు సంరక్షణకు పునాదిగా భావించాలని, అంతేగాని తర్వాత ఆలోచించాల్సిన విషయంగా కాదని ఆమె చెబుతుంది.

తనదైన మార్గాన్ని కనుగొనాలని

ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్‌కు నెలకు 20,000 కంటే ఎక్కువ మంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారు. ఆమె మరిన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవాలని, అలాగే ఈ ప్లాట్‌ఫామ్‌పైకి మరింత మంది నిపుణులను తీసుకురావాలని భావిస్తున్నారు. ‘కేవలం ఏఐ ఫీచర్లను జోడించడం కాకుండా, విశ్వాసాన్ని, సంరక్షణలో కొనసాగింపును పెంపొందించడమే మా తదుపరి ప్రాధాన్యం’ అని ఆమె అంటున్నారు. ఆమె తల్లులు, పిల్లల కోసం శిక్షణ పొందిన సంరక్షకుల నెట్‌వర్క్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఐశ్వర్యకు ఈ కంపెనీని నిర్మించాలనే ప్రేరణ చాలా వ్యక్తిగతమైనది. తన కుమార్తె ఆర్యానా, తన తల్లి ఒక నిజమైన సమస్యపై పనిచేయడాన్ని చూస్తూ పెరగాలని, ఆ పనిని ముందుకు తీసుకెళ్లడానికి, ఇతరులకు సహాయం చేయడానికి తనదైన మార్గాన్ని కనుగొనాలని ఆమె కోరుకుంటున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్