ఎన్నికల సంఘం మీ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సరిచేసే ప్రక్రియను పూర్తి చేసి.. తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చూసుకుంటారు. ఉండాల్సిన చోట మీ పేరు ఉండటంతో ఊపిరి పీల్చుకుం టారు. ఓటరు గుర్తింపు కార్డు నంబరు (ఎపిక్), పోలింగ్ స్టేషన్ నంబరు.. అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో మరోసారి సరిచూసుకుని, హమ్మయ్య.. నా ఓటు భద్రంగానే ఉందని నిశ్చింతగా ఇంటికి చేరతారు. కానీ, పోలింగ్ రోజున ఓటు వేయడానికి వెళ్లినప్పుడే అసలు సమస్య ఎదురవుతుంది. పోలింగ్ బూత్‌లో ఉన్న ప్రిసైడింగ్ అధికారి దగ్గర ఓటర్ల జాబితాలో మీ ఎపిక్ నంబరు ఎదురుగా వేరే వ్యక్తి పేరు కనిపిస్తే? ఎపిక్ నంబరు మీదే అయినా, జాబితాలో పేరు వేరే ఉందంటూ.. ‘‘మీరు అసలైన ఓటరు కాదు’’ అని అధికారులు మిమ్మల్ని ఓటు వేయకుండా అడ్డుకుంటే? తుది ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందని ముందే నిర్ధారించుకున్నా..
పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేసరికి మీ ఓటు మీకు దక్కకపోతే? మీ ఓటు లేకుండానే ఎన్నికలు జరిగిపోతాయి. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే నాయ కుడెవరో మీ ప్రమేయం లేకుండానే నిర్ణయమ వుతుంది. ఓటు హక్కు లేకపోతే రేషన్ కార్డు రద్దవుతుందేమో, సంక్షేమ పథకాలు నిలిచిపోతా యేమో, చివరకు పౌరసత్వమే ప్రశ్నార్థకమ వుతుందేమోనన్న భయాలు కూడా వెంటాడతాయి. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కు కళ్లముందే చేజారిపోతుంది. ఇదంతా ఏదో సినిమా సీను కాదు.. ఊహాగానం అంతకన్నా కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై వెలుగులోకి వచ్చిన ఉదంతం ఇది. తాజాగా.. అక్టోబరు నెలలో బయటపడిన ఈ వ్యవహారంలో ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గంలో ఏకంగా 13,500 మంది ఓట్లు గల్లంతైనట్లు వార్తలు వెలువడ్డాయి. పత్రికలు ఈ వ్యవహారానికి ‘‘పిలిభిత్ మోడల్’’ అని పేరు పెట్టాయి.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నది. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా ఈ ప్రక్రియ చేపట్టాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన వివరాలతో బహిర్గతమైంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఇప్పటివరకు విదేశీయులు 689 మంది పట్టుబడ్డారని ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత పౌరుల ఓట్లు 13కోట్లు గల్లంతయ్యాయంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఓటు చోరీకి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్త యింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న తుది ఓటరు జాబితాను ప్రకటించారు. ఇక ఇందులో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరి తొలగించిన ఓట్ల సంగతి?
పిలిభిత్‌లో బయటపడిన ఓట్చోరీ
అక్టోబర్ 4న పిలిభిత్ నియోజకవర్గ కేంద్రంలోని ఓ ఓటరు స్థానిక కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లి తన ఓటరు గుర్తింపు కార్డును ప్రింట్ చేయించుకున్నాడు. ఆపరేటర్ ఇచ్చిన కార్డును చూసి షాక్ తిన్నాడు. అందులో ఎపిక్ నంబరు పాతదే, మిగతా వివరాలూ పాతవే. కానీ తన పేరు, తండ్రి పేరు మాత్రం పూర్తిగా మారిపోయి కొత్త పేర్లు కనిపించాయి! అదే సమయంలో అక్కడున్న రెహాన్ అలీ అనే న్యాయవాది అప్రమత్తమై తనకు తెలిసిన పది మంది బంధువుల ఎపిక్ నంబర్లను సేకరించి అదే కంప్యూటర్ సెంటర్లో పరిశీలించగా, వారిలో నలుగురి విషయంలో గోల్మాల్ జరిగినట్లు బయటపడింది. స్థానికంగా కలకలం రేగడంతో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ నాయకులు జిల్లా అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. జిల్లా అధికారులు తూతూమంత్రంగా వ్యవహరించి కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. అధికారులపై నమ్మకం కోల్పోయిన స్థానిక యువకులు బృందాలుగా ఏర్పడి ఐదు రోజుల పాటు నియోజకవర్గ ఓటర్ల పూర్తి జాబితాపై పరిశీలన చేపట్టారు.
ఈ పరిశీలనలో మొత్తం 13,500 మంది ఓటర్ల పేర్లు మారిపోయి గల్లంతైనట్లు గుర్తించారు. 2022 ఎన్నికల్లో అక్కడ గెలిచిన ఎమ్మెల్యేకు వచ్చిన మెజారిటీ సుమారు ఆరు వేల ఓట్లు మాత్రమే. దీంతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో కుట్రపూరితంగా పేర్లు మార్చారన్న అనుమానాలు వ్యక్తమ య్యాయి. గల్లంతైన ఓట్లలో అధిక శాతం మైనారిటీలకు చెందినవేనని స్థానికులు ఆరోపించారు. అధికార బీజేపీ నాయకులు, ఎన్నికల సంఘంలోని ఉన్నతాధికారుల ప్రమే యంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఓటరు గుర్తింపు కార్డులో ఎపిక్ నంబరు యథాతథంగా ఉండి, అదే నంబరుకు సంబంధించిన పేరు మారిపోవడం సాధారణ సాంకేతిక తప్పిదంగా కొట్టిపారేయలేని విషయం. ఓటరు తన వివరాలను సరిచూసుకున్నా, అధికారిక జాబితాలోనే పేరు మారిపోతే అతనికి తన ఓటు హక్కును నిరూపించుకోవడం కష్టమవు తుంది. అందుకే ఇలాంటి మార్పులు ఎప్పుడు జరిగాయి, ఎవరు చేశారు, వాటికి అనుమతి ఎవరిచ్చారు అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు బయటకు రావాలి.
అధికారుల విచారణ.. నేరపూరిత కుట్రకోణం
ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా విచారణ చేపట్టాల్సి వచ్చింది. అక్టోబర్ 23న పత్రికా ప్రతినిధులకు వివరాలు వెల్లడించిన ఆయన, తుది జాబితా ప్రకటించిన తర్వాత ఓటర్ల పేర్లలో మార్పులు జరిగినది వాస్తవమేనని అంగీకరిం చారు. ఇద్దరు ఈఆర్ఓలను, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించామని, ముగ్గురిపై పోలీసు కేసు కూడా నమోదు చేశామని తెలిపారు. మొత్తం 13,500 ఓట్లు ఈ రీతిన గల్లంతయ్యాయని, ఎలాంటి ఫిర్యాదులు, పత్రాలు లేకుండానే మే 31 నుంచి ఆగస్టు 29 మధ్య ఆన్లైన్లో ఈ వ్యవహారం సాగిందని చెప్పారు. ఇది మామూలు పొరపాటు కాదని, నేరపూరిత కుట్రకోణంలో పరిశీలించాల్సిన వ్యవహార మని రాష్ట్ర ఎన్నికల అధికారి అభిప్రాయపడ్డారు.
పిలిభిత్ వ్యవహారం కాకతాళీయంగా బయటపడింది. అక్కడి ప్రజలు అప్రమత్తమై అధికారులను నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లోని మిగతా నియోజకవర్గాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరగలేదన్న గ్యారెంటీ లేదు. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా యువకులు, స్వచ్ఛంద సంఘాల సహకారంతో ఓటరు జాబితాలను పరిశీలిస్తామని ప్రకటించాయి. ఆ ప్రక్రియ పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా పిలిభిత్ మోడల్ ఎంతమేరకు అమలైందనే విషయం బయటపడే అవకాశం ఉంది. అక్రమాలు మరింత పకడ్బందీగా జరిగి ఉంటే అవి బయటపడకపోవచ్చన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. బీహార్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో లక్షలాది ఓట్ల తొలగింపు నేపథ్యంలో తెలంగాణలోనూ జాబితాలపై సందేహాలుంటే వాటిని పారదర్శకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఢిల్లీ నిరసనలు.. కేంద్రం వ్యవహారం
ఓటరు జాబితాల సవరణలు, ఓట్లు గల్లంతవుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోనూ నిరసనలు జరిగాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు, నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ విధానం, ఎన్నికల సంఘం పనితీరుపై తమ సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ నిరసనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడటం ఎంత ముఖ్యమో, ప్రజల్లో ఏర్పడిన సందేహాలను నివృత్తి చేయడం కూడా అంతే ముఖ్యం. ఓటర్ల ఆందోళనలను రాజకీయ వివాదంగా మాత్రమే చూడకుండా, ఆరోపణలపై పారదర్శక విచారణకు సహకరించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత.
ఎన్నికల సంఘం కూడా ఓటరు జాబితాల్లో జరిగిన మార్పులు, తొలగింపుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచి, అనుమానాలకు తావులేకుండా చూడాలి. కానీ, ఆ బాధ్యతను కేంద్రం సరిగా నిర్వర్తించకపోవడం వల్ల ఓట్లపై రోజురోజుకూ అనుమానాలు బల పడుతున్నాయి. ఎందుకంటే, దేశంలో ఓటుపై ఇంత గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో జవాబుదారిగా ఉండాల్సిన కమిషన్ కూడా చేతులెత్తేసింది. కేంద్రం కనుసన్నల్లోనే నడుస్తున్నామన్న సంకేతాలిస్తే దాని స్వతంత్రత ఎక్కడుం టుంది? ఇప్పటికైనా ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఓటరు జాబితాలో అక్రమ మార్పులు జరగకుండా ఎలాంటి భద్రతా వ్యవస్థ ఉంది? తప్పుగా పేరు తొలగించబడిన పౌరుడికి న్యాయం ఎలా జరుగుతుంది?
ఓటరు జాబితా..పారదర్శకత
విదేశీ చొరబాటుదారులను ఏరివేస్తామనే లక్ష్యంతో ప్రారంభమైన సర్ ప్రక్రియలో ఇంతవరకు ఒక్క విదేశీ ఓటు తొలగించినట్టు వెల్లడికాలేదు. కానీ, అర్హులైన భారతీయుల ఓటు హక్కుకు మాత్రం తూట్లు పొడుస్తున్నారు. పిలిభిత్‌లో బయటపడిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపితే అనేక అక్రమాలు బయటపడే అవకాశముంది. ఓటు హక్కు లేకపోతే పౌరుడు తన పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోతాడు. అందుకే ఓటరు జాబితాలో పేరు ఉండటం నుంచి ఈవీఎంలో ఓటు నమోదయ్యే వరకూ ప్రతి దశలోనూ భద్రత, పారదర్శకత ఉండాలి. ఓటరు జాబితాపై ప్రజలకు నమ్మకం కలిగినప్పుడే ఎన్నికలపై విశ్వాసం నిలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది పౌరుడి గొంతుక, అతని రాజకీయ హక్కు. ఆ హక్కును కాపాడటం ఎన్నికల సంఘం, ప్రభుత్వాల బాధ్యత.
ఆర్. రాజేశమ్, 9440443183






కామెంట్లు (0)