పండుగలంటే ఆనందం, ఆత్మీయత, ఐక్యత, సౌభ్రాతృత్వం. కష్టసుఖాలను పక్కనపెట్టి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, గ్రామ ప్రజలంతా కలిసి సంతోషంగా జరుపుకునే సామూహిక ఉత్సవాలు. కానీ నేటి సమాజంలో కొన్ని చోట్ల పండుగలే కులవివక్షకు వేదికలవుతున్నాయి. మనుషుల మధ్య ప్రేమానుబంధాలను పెంచాల్సిన పండుగలు కొందరికి అవమానాన్ని, బాధను మిగులుస్తున్నాయి. ఇటీవల బతుకమ్మ, వినాయక చవితి, దసరా పండుగల సందర్భంగా జరిగిన ఘటనలు ఈ చేదు వాస్తవాన్ని బయటపెడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం అమ్మనబోలు గ్రామంలో ఎస్సీ మహిళా సర్పంచ్ మామిడాల నరసమ్మ, వార్డు సభ్యురాలు బొజ్జ శ్రీలత బతుకమ్మలు పట్టుకొని వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. వారు గ్రామానికి ప్రథమ పౌరులైనా, కులం పేరుతో అవమానిస్తూ తమతో కలిసి బతుకమ్మ ఆడవద్దని అడ్డుకున్నారు. వారి బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు. అదే మండలం టీ రేపాకలో దళిత మహిళలను బతుకమ్మ ఆడనివ్వలేదు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం కోటపహాడ్లో దళిత మహిళలు బతుకమ్మ పెట్టడంపై ఆగ్రహించిన అగ్రకుల మహిళలు తమ బతుకమ్మలను పసుపు నీళ్లతో శుద్ధి చేసుకున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్‌లో దళిత సర్పంచ్‌ను సైతం బతుకమ్మ ఆడనీయలేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రేగడి గణపురంలోనూ బతుకమ్మ వేడుకల్లో దళితులపై వివక్ష కొనసాగింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి (పీటీ)లో డప్పులు కొట్టడానికి ఎక్కువ పారితోషికం అడిగారనే వివాదం దళితులపై దాడికి దారితీసింది. సర్పంచ్ మన్నే కళ్యాణ్ తన అనుచరులతో దాడి చేయగా మహిళలు, యువకులు గాయపడ్డారు. పంచాయతీ కార్మికులపైనా దాడి జరిగింది.
వినాయక ఉత్సవాల్లోనూ వివక్ష తప్పలేదు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో దళితులు ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనాన్ని ముందుగా నిర్వహించకూడదని పెత్తందారులు హెచ్చరించారు. నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్న దళితులపై దాడి చేయగా, పోతేపాక సాయికుమార్ గొంతు కోసి ప్రాణాపాయ స్థితికి చేర్చారు.
సిద్దిపేట జిల్లా ఇమాంబాద్‌లో వినాయక మండపం వద్ద అన్నప్రసాదం పంపిణీ సందర్భంగా ఎస్సీలకు ఒక టేబుల్, ఇతరులకు మరో టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రశ్నించిన దళితులను మీతో కలిసి ఉండలేమంటూ అవమానించారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం మైకోడ్లోనూ వినాయక ఉత్సవాల్లో దళితులకు వేర్వేరుగా భోజనం వడ్డించారు. భువనగిరి జిల్లా హన్మాపురంలో డీజే నిర్వహణ సమయంపై వివాదం దళిత యువకులపై దాడికి, కుల దూషణలకు దారితీసింది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లిలో దుర్గమ్మ పండుగ సందర్భంగా మాల, మాదిగ కులాల పేరుతో దూషణలు, యువకులపై దాడులు జరిగాయి. సంగారెడ్డి జిల్లా హత్నూరులో దసరా జమ్మిపూజ, రావణ దహనం విషయంలో దళిత సర్పంచ్‌పై ఒత్తిడి తీసుకొచ్చి, అనంతరం ఆయనను బెదిరించారు. గుజరాత్లో గర్బా నృత్యంలో పాల్గొన్న దళిత యువతిని కులం పేరుతో దూషించి బయటకు గెంటేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పి.కె. మల్లేపల్లిలో గ్రామసభ సందర్భంగా మహిళా వీఓఏ గనిపల్లి మాధవిని కులం పేరుతో దూషించి కిందపడేసి కొట్టారు.
ఈ ఘటనలన్నింటినీ పరిశీలిస్తే పండుగల్లో పాల్గొనే హక్కును కూడా కులం ఆధారంగా నిర్ణయించాలనే ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన దళిత సర్పంచ్‌కే బతుకమ్మ ఆడే హక్కు నిరాకరించడం, దేవుడి అన్నదానంలో కులాలవారీగా భోజనాలు పెట్టడం, ఆలయంలోకి వెళ్లినందుకు దాడులకు పాల్పడడం సమాజం ఎటువైపు పయనిస్తోందో ఆలోచింపజేస్తున్నాయి. బతుకమ్మ ప్రకృతిని ఆరాధించే పండుగ. వినాయక చవితి సామూహిక భక్తికి ప్రతీక. దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. అలాంటి పండుగల్లోనే కులవివక్షకు పాల్పడటం వాటి అసలు స్ఫూర్తిని అవమానించడమే. ఒకే దేవుడిని పూజిస్తూ అన్నదానం చేసే సమయంలో మాత్రం కులాలవారీగా విడిపోవడం ఎంతటి వైరుధ్యం! ప్రకృతిని పూజించే బతుకమ్మలో మనిషిని అవమానిస్తే ఆ పూజకు అర్థమేమిటి? చెడుపై మంచి సాధించిన విజయాన్ని చాటే దసరాలో కుల అహంకారానికి చోటిస్తే ఆ విజయానికి విలువేమిటి?
పట్టణీకరణ పెరిగింది. విద్యావకాశాలు విస్తరించాయి. రాజ్యాంగం సమానత్వపు హక్కులను కల్పించింది. అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో కులవివక్ష కొనసాగడం, అట్టడుగు వర్గాలు తమ హక్కుల కోసం నిలబడితే దాడులకు దిగడం ఆందోళన కరం.
కులవివక్ష బాధితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, పిల్లల్లో హెచ్చుతగ్గుల భావనలను నాటు తుంది. గ్రామాల్లో ఐక్యతను దెబ్బతీసి ఘర్షణలకు దారితీస్తుంది. కులం పేరుతో అంటరానితనం పాటించడం, అవమా నించడం, దాడులకు పాల్పడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, చట్టరీత్యా కూడా నేరం. కులవివక్షను అరికట్టడంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి. బాధితులకు న్యాయం చేయాలి. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. కులవివక్ష పాటించిన వారిని రాజకీయ పలుకుబడితో కాపాడే ధోరణికి స్వస్తి పలకాలి. గ్రామాల్లో కులవివక్ష వ్యతిరేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. అన్ని కులాల ప్రజలు కలిసి పండుగలు జరుపుకునేలా, సహపంక్తి భోజనాలు చేసేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి.
యువతరం కూడా కులవివక్షకు వ్యతిరేకంగా నిలబడాలి. తమ కులానికి చెందినవారే వివక్షకు పాల్పడినా తప్పును తప్పుగా ఖండించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మధ్య ఐక్యతను బలోపేతం చేయాలి. భూస్వామ్య, పెత్తందారీ భావజాలాన్ని ప్రశ్నించాలి.
గ్రామాల్లో కులమత భేదాలు లేకుండా కలిసి చదువుకున్నట్లే కలిసి జీవించే సంస్కృతిని పెంపొందించాలి. మనుషులందరికీ ఒకే రక్తం ప్రవహిస్తుంది. అందరూ తల్లి గర్భం నుంచే జన్మిస్తారు, చివరికి మట్టిలోనే కలిసిపోతారు. అలాంటప్పుడు మనుషుల మధ్య కులం ఆధారంగా హెచ్చుతగ్గులు ఎందుకు? పశువులను ప్రేమించాలని చెప్పే సమాజం తోటి మనిషిని గౌరవించడం కూడా నేర్చుకోవాలి.
పండుగల గొప్పదనం పూలలోనో, అలంకరణల్లోనో, దీపాల వెలుగుల్లోనో మాత్రమే ఉండదు. అందరినీ సమానంగా ఆహ్వానించి, కలిసిమెలిసి ఆనందాన్ని పంచుకోవడంలోనే ఉంటుంది. ఒకరి బతుకమ్మను మరొకరు ఆదరించాలి. ఒకరి వినాయక మండపానికి మరొకరు తోడ్పడాలి. ఒకరి పండుగలో మరొకరు భాగస్వాములు కావాలి. పండుగలు ప్రజలను కలపాలి కానీ విడదీయకూడదు. భక్తి ప్రేమను పెంచాలి కానీ ద్వేషాన్ని కాదు. అందరినీ కలుపుకొని జరుపుకునే పండుగే నిజమైన పండుగ, ప్రతి మనిషిని సమానంగా గౌరవించే సమాజమే నిజమైన నాగరిక సమాజం.
టి.స్కైలాబ్‌బాబు, 9177549646






కామెంట్లు (0)