“నేను పేదలకు ఆహారం పెడితే వారు నన్ను దేవదూత అన్నారు. అదే నేను పేదలు ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తే వారు నన్ను కమ్యూనిస్టు అని పిలిచారు” ఈ మాటలు చెప్పింది బ్రెజిల్ కాథలిక్ ఆర్చిబిషప్ హెల్డర్ కమారా. ఆయన ఆ దేశంలో మిలిటరీ నియంతల పాలన సాగిన కాలంలో మానవహక్కులు, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ప్రముఖుల్లో ఒకరు. అమెరికాలో క్రైస్తవులు 93 శాతం, యూదులు రెండు శాతం, హిందువులు, ముస్లింలు, బౌద్ధులు ఒక్కొక్క శాతం, ఇతర మతా లకు చెందిన వారు రెండుశాతం ఉన్నారని అంచనా. ఒక శాతమే ఉన్నప్పటికీ ముస్లింలు కమ్యూనిస్టులతో చేతులు కలుపుతున్నందున అమెరి కాకు, క్రైస్తవానికి ముప్పు వచ్చిందంటూ అక్కడి మితవాదులు గుండెలు బాదుకుంటారు. మనదేశంలో అలాంటి వారి జిగినీ దోస్తు నరేంద్రమోడీ. తన విధానాలను విమర్శించే లేదా వ్యతిరేకించే వారిని ట్రంప్ సోషలిస్టులు, కమ్యూనిస్టులు, విద్య, ఇతర రంగాల్లో చొచ్చుకుపోయారు, అమెరికా వ్యతిరేకులు అంటాడు.
వారిని అనుకరిస్తున్న కాషాయదళాలు, వారి నాయ కుడు మోడీ కూడా వివిధ రంగాల్లోకి చొచ్చుకుపోయిన దిమాగీ నగ్జల్స్, దేశద్రోహులు, వ్యతిరేకులని ముద్రవేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారిలో ముస్సోలినీ, హిట్లర్ వంటి నిరంకుశ శక్తుల డిఎన్ఎ ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.
నవంబరు మూడవ తేదీన అమెరికాలో పార్లమెంటు, వివిధ రాష్ట్రాలు, నగరాలలో ఎన్నికలు జరిగాయి. ట్రంప్, రిపబ్లికన్ పార్టీ, లేదా డెమోక్రటిక్ పార్టీలో ఉన్న మితవాదులు కూడా డెమోక్రటిక్ సోషలిస్టులకు కమ్యూనిస్టు, ముస్లిం ఉగ్రవాద ముద్రవేసి ప్రచారదాడి చేశారు. అయినప్పటికీ తొలిసారి అనేక మంది సోషలిస్టు ముస్లింలు చట్టసభల్లో ప్రవేశించారు. ఇది ఎలా సాధ్యమైంది, మొత్తంగా సోషలిస్టులు మరింత ముందుకు పోగలరా? అని కొందరు సానుకూల పరిశీలకులు ప్రశ్నిస్తుంటే ఎలా అడ్డుకోవాలా అని అమెరికా ప్రభుత్వం మల్లగుల్లాలు పడు తున్నది. అమెరికా అధ్యక్షుడు అధికారికంగా కమ్యూనిజం వ్యతిరేకవారం పాటించాలని ప్రకటించాడు. వరుసగా ఇది రెండవ సంవత్సరం. సరిగ్గా మధ్యంతర ఎన్నికల పోలింగ్ రోజే నిరంకుశ సంకెళ్లు అంటూ ఆదేశాల మీద సంతకం చేశాడు.
శతాబ్దానికిపైగా కమ్యూనిజం, సోషలిస్టు భావజాలాలు వ్యక్తుల హక్కులను హరిస్తున్నాయని, జనాభాను ప్రభుత్వ అదుపులో ఉంచుతున్నాయని, స్వేచ్ఛగా ఉండే దేశాలలో దేవుడిచ్చిన హక్కులను హరించి వేస్తున్నాయని ట్రంప్ ఒక ప్రకటనలో ఆరోపించాడు. ఫలితంగా కోట్లాది మంది దారిద్య్రం, హింసా కాండ, దోపిడీ, దుర్భర జీవితాలను గడుపుతున్నారని కూడా సెలవిచ్చాడు. వాటిని పట్టించుకోకుండా ఆ పెద్దమనిషికి, ప్రపంచంలో అతగాడిని అనుసరిస్తున్న వారికి దిమ్మతిరిగిపో యేలా ఓటర్లు తీర్పునిచ్చారు. రిపబ్లికన్ల కంచుకోటలను బద్దలు కొట్టి సరికొత్త చరిత్రలను లిఖించారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న మెజారిటీ, అత్యధిక రాష్ట్రాలలో రిపబ్లికన్లు అధికా రాన్ని కోల్పోయారు. డెమోక్రటిక్ సోషలిస్టులు ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో రెండు నుంచి ఎనిమిది సీట్లకు పెరిగారు. వివిధ రాష్ట్రాల చట్టసభల్లో గెలిచారు. అతిపెద్ద నగరమైన న్యూయార్క్ మేయర్‌గా జో హ్రాన్ మందానీ ఇప్పటికే పని చేస్తుండగా రెండవ పెద్ద పట్టణమైన లాస్ ఏంజల్స్ కు భారతీయ సంతతికి చెందిన నిత్యా రామన్, దేశ రాజధాని వాషింగ్టన్ డిసి, మరోపెద్ద పట్టణం సియాటిల్, మరికొన్ని పట్టణాల మేయ ర్లుగా డెమోక్రటిక్ సోషలిస్టులు ఎన్నికయ్యారు. మిషి గాన్ రాష్ట్ర సెనెటర్‌గా వారి మద్దతు పొందిన పాల స్తీనా హక్కుల ఉద్యమకారుడు అబ్దుల్ ఎల్ సయద్ ఎన్నికయ్యాడు.
వీరంతా సోషల్ డెమో క్రాట్లు కాదు, కరడుగట్టిన దేవుడిని నమ్మని కమ్యూనిస్టులు, 250ఏండ్ల అమెరికా స్వాతం త్య్ర చరిత్రలో తొలిసారిగా వీరి నుంచి పెను ముప్పు వచ్చిందని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నోరు పారవేసు కున్నాడు. డెమోక్రటిక్ సోషలిస్టులు (డిఎస్ఏ) డెమోక్రటిక్ పార్టీలో ఒక వేదికగా పనిచేస్తున్నారే తప్ప ప్రత్యేక పార్టీ కాదు. అభ్యర్థులుగా వారు ఎంపిక కావటాన్ని సహించలేనివారు మనదేశంలో మాదిరి తిరుగుబాటు అభ్యర్థులు అవుతున్నారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన మాజీ గవర్నర్ ఆండ్రూ కుమో స్వతంత్రుడిగా పోటీపడి రెండవ స్థానం లో మందానీ చేతిలో ఓడిపోయాడు. మిషిగాన్ సెనెటర్ సయ్యద్త ో అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన డెమోక్రటిక్ పార్టీ నేత ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీకి ఓటు వేయాలంటూ అడ్డం తిరిగాడు. ఇంత చేసినా డెమోక్రటిక్ సోషలిస్టుల విజయాన్ని అడ్డుకోలేకపోయా రు. ఈ వేదికలో 2013లో ఆరున్నరవేల మంది సభ్యులుంటే ప్రస్తుతం లక్షా 30వేలకు పెరిగారు. తాము పెట్టుబడిదారీ విధా నానికి వ్యతిరేకమని ప్రకటించుకున్నారే తప్ప కమ్యూనిస్టులం అని ఎక్కడా చెప్పుకోలేదు. అయితే అనేక మంది సోషలిస్టు, మార్క్సిస్టు భావజాలం కలిగిన వారు ఉన్నమాట నిజం.
‘బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం’ అనే పేరుతో కొంతమంది రాసిన ఆధా రంలేని రాతల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాల అణచివేత, వారు తెచ్చిన కరువుతో పదికోట్ల మంది మరణించారని పేర్కొన్న అంశం పెద్దఎత్తున ప్రచారంలో ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకో వటంలేదు. బ్రిటీష్ ఏలుబడిలో 1876-78 కరువులో మనదేశం లో ఆకలి, వ్యాధులతో కోటిమంది మరణించారు. ఒక్క రాయల సీమ ప్రాంతంలో ఏడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత 1943లో బెంగాల్ కరువులో నలభై లక్షల మంది మరణించారు. కాపిటలిజమ్ కిల్స్ అనే వెబ్సైట్ పెట్టుబడిదారీ విధానం, వ్యవస్థ కారణంగా మరణించిన, ప్రతి నిమిషానికీ జరుగుతున్న ఇరవై మరణాల గురించి అంచనాలను వెల్లడిస్తు న్నది. దాని ప్రకారం ఇప్పటి వరకు 42 కోట్ల 38లక్షల మందికి పైగా మరణించారు. రెండవ ప్రపంచయుద్ధంలో మరణించిన 7 నుంచి 8.5కోట్ల మంది మరణాలు, మరికొన్నింటిని ఈ సంఖ్య నుంచి మినహాయించారు. అనేక దేశాల్లో యువత ఇప్పుడు కమ్యూనిజం వైఫల్యం గురించిగాక పెట్టుబడిదారీ విధాన విఫలత్వం గురించి ఆలోచిస్తున్నారు.
అమెరికాలో సోషలిస్టు పార్టీ తరఫున మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు వెయ్యి మందికి పైగా వివిధ పదవులకు వారు ఎన్నికయ్యారు. ఆ పార్టీ సభ్యత్వం లక్షా ఇరవైవేలు ఉంది. మూడు వందల వరకు పత్రి కలు, మాగజైన్లు నడిపారు. ఇప్పుడు మరోసారి ఆ భావజాలం కలిగిన వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. తరువాత ఆ పార్టీ కనుమరుగైంది.
అమెరికా అంటే పెట్టుబడిదారీ విధాన అత్యున్నత దశలో ఉన్న దేశం. అపార సంపదలకు నిలయం, అలాంటి చోట 2025 లెక్కల ప్రకారం అధికారికంగా 10.2శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. 13.1శాతం మంది దారిద్య్రం కార ణంగా ప్రభుత్వ రాయితీలు పొందుతున్నారు. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం రోజుకు మూడు డాలర్ల కంటే (మన కరెన్సీలో ఒక డాలరుకు రు.95 అటూ ఇటూగా ఉంటాయి, బ్రాకెట్లలో అంకెలు చైనావి) పిపిపి పద్ధతిలో తక్కువ ఖర్చు చేసేవారు మనదేశంలో 2022లో 5.3 శాతం(0), 4.20డాలర్ల కంటే తక్కువ 23.9(0.5), మూడో తరగతిలో 8.3 డాలర్లులోపు ఖర్చు చేసేవారు 82.1(21.5) ఉన్నారు. దారిద్య్రం తగ్గింపులో నరేంద్రమోడీ దగ్గర అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఉందని గొప్పలు చెబుతారు, ఎక్కడ పేదరికం ఎక్కువ ఉంది? కమ్యూనిస్టు చైనాలోనా, పెట్టుబడిదారి భారత్‌లోనా? జనజీవితాలను అతలా కుతలం చేసే పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించేవారందరూ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అమెరికాలో డెమోక్రటిక్ సోషలిస్టులుగా మారుతున్నారు. సోషలిజం పట్ల యువతరంలో ఏడాదికేడాది సానుకూలత పెరుగుతున్నది.
కార్మికవర్గం ఎక్కువగా ఉన్నచోట సోషలిజం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని మార్క్స్, ఎంగెల్స్‌లు చెప్పారు కదా!
అమెరికాలో సోషలిజం ఎందుకు లేదు అని ప్రశ్నిస్తూ 20వ శతాబ్దపు ప్రారంభంలో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే జర్మన్ ఆర్థికవేత్త వెర్నర్ సోంబార్ట్ (1863-1941) ఒక వివరణ ఇచ్చాడు. అమెరికన్లు “లేట్ కాపిటలిజం” (వర్తమాన పెట్టుబడి దారీ విధానం) దారుణమైన విధ్వంసాలతో ఇబ్బంది పడలేదు గనుక వారు సోషలిజాన్ని పట్టించుకోలేదన్నాడు. తరువాత 1972లో పురోగామి ఆర్థికవేత్త ఎర్నెస్ట్ మండెల్ మరింత వివరంగా లేట్ కాపిటలిజం గురించి రాశాడు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచాన్ని నడిపిస్తున్నది అదే అని పేర్కొన్నాడు. బహుళజాతి గుత్త సంస్థలు, ద్రవ్యీకరణ, ప్రపంచీ కరణ ప్రతికూల పర్యవసానాలను చూస్తున్నాం. సాంప్రదాయ వస్తూత్పత్తి కంటే ద్రవ్యమార్కెట్, అప్పులు, ఊహాకల్పన లేదా సట్టా వ్యాపారం (స్పెక్యులేషన్) ఆర్థిక వ్యవస్థలను నడుపుతు న్నాయి. సంపదల కేంద్రీకరణ పెరుగుదల, ఆర్థిక అంతరాలతో పాటు కళలు, మీడియా, రోజువారీ జీవనం అంతా వాణిజ్య మయమే. సోంబార్ట్ 1902-27 సంవత్సరాల మధ్య ఆధునిక పెట్టుబడిదారీ విధానం గురించి పెద్ద గ్రంథమే రాశాడు. అందులో పెట్టుబడిదారీ విధానాన్ని నాలుగు దశలుగా వర్ణించాడు.
ఒకటి, భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ విధానానికి మారిన సంధి దశ (ప్రోటో కాపిటలిజం 14 నుంచి 18వ శతాబ్దంవరకు), తొలి, ఉన్నత, లేట్ కాపిటలిజం అంటూ వర్ణించాడు. రష్యాలో అక్టోబరు విప్లవం వచ్చిన 1917 తరువాత అమెరికన్ సోషలిస్టు లలో కొందరు కమ్యూనిస్టులుగా మారారు. మనదేశంలో తామే సోషలిజాన్ని తెస్తామంటూ కాంగ్రెస్, గాంధియన్ సోషలిజం అంటూ బీజేపీ ఎన్నికలలో విజయాలు సాధించటం కోసం ఎలా చెప్పాయో అమెరికా డెమోక్రాట్లు సోష లిస్టు తరహా వాగ్దానాలు చేయటం ప్రారంభించారు. దేశంలో జీవన పరిస్థితులు దిగజారుతుండటంతో ఆ పార్టీలోని కొందరు అదే సోషలిజాన్ని సాధించాలనే సంకల్పంతో 1982 డిఎస్ఏ వేదికను ఏర్పాటు చేశారు. అక్కడ సంపదలు వేగంగా వృద్ధి చెందుతున్న తరుణం లో పేదలు తాము కూడా ఒకనాటికి సంపన్నులమవుతామనే భ్రమలతో సోషలిజానికి దూరంగా ఉన్నారు. అవి కలలే అని కండ్ల ముందు కనిపిస్తుండటంతో తాతగారి నాన్నగారి భావాలను వదలిపెట్టి ముందుయుగపు దూతలుగా సోషలిజంపై సానుకూలత చూపుతున్నారు.
డిఎస్ఏ వెబ్సైట్ పాక్షిక సమాచారం ప్రకారం 2026లో జరిగిన 216 ఎన్నికల పోటీలో ఆ సంస్థ తమ అభ్యర్థులుగా ప్రకటించిన వారిలో 88 చోట్ల విజయాలు సాధించగా 80 చోట్ల ఓడిపోయారు. ఈ విజయాలు సంఖ్యరీత్యా చిన్నవేగావచ్చుగానీ ఆ పార్టీలోని వామపక్ష భావజాల వ్యతిరేకులకు ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టీ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షుడు జైమీ హారిసన్ డిఎస్ఏ అభ్యర్థులు పార్టీ గుర్తుమీద పోటీ చేయరా దంటూ ధ్వజమెత్తాడు. సొంతంగా పార్టీని పెట్టుకోవాలంటూ ఉక్రోషం వెళ్లగక్కాడు. పార్టీ నాయకత్వం డిఎస్ఏ బలపరిచిన అభ్యర్థులకు బిఫారాలు ఇవ్వకూడదన్నాడు. డెమోక్రటిక్ సోషలి స్టులు అందరికీ ఆరోగ్యం, కార్మికుల హక్కులను విస్తరించాలని, సంపన్నులపై పన్ను పెంచి సంక్షేమ చర్యలకు ఖర్చు చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. దానికి రోజురోజుకూ యువత నుంచి మద్దతు పెరుగుతున్నది. ఈ మాత్రానికే వారిని కమ్యూనిస్టు లంటూ ట్రంప్ అండ్‌కో చిత్రిస్తున్నది.
అదే గనుక కమ్యూనిజం అయితే మేం కమ్యూనిస్టులమే అనే రోజు వస్తుందేమో! తప్పనిసరైతే తమ జీవితాల మెరుగుదలకు ఆటంకంగా ఉన్న వ్యవస్థను కూలదోసేందుకు సిద్ధపడతారేమో!! ఒక చిన్న దేశం ఇరాన్ చేతుల్లో చిక్కి అమెరికా గిలగిల్లాడుతుందని ఎవరైనా కలగన్నారా? 2028లో జరిగే ఎన్నికల నాటికి అమెరికా ఓటర్లలో యువత సగం మంది ఉంటారని అంచనా. చరిత్రలో జరిగిన అనేక పరిణామాలను ముందుగా ఎవరూ ఊహించ లేదు! గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా యువత అమెరికాను ఎటు నడిపించనుందో? ఒకటి మాత్రం స్పష్టం. సమాజం ముందుకే తప్ప వెనక్కుపోదు, అలా నడపాలని ఎవరైనా ప్రయత్నిస్తే దాని రథచక్రాల కింద నలిగిపోవాల్సిందే!
ఎం కోటేశ్వరరావు 8331013288






కామెంట్లు (0)