గోదావరి, కృష్ణా వంటి రెండు జీవనదులు, వాటికి అనుసంధానమైన అనేక ఉపనదులు ప్రవహిస్తున్న తెలంగాణలో ఒక్క ఏడాది వర్షాభావం ఏర్పడితేనే నాలుగు కోట్ల ప్రజలు సాగు, తాగునీటి కోసం అల్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? వేలాది గొలుసుకట్టు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఉన్నప్పటికీ వర్షపు నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితికి రాష్ట్రం ఎందుకు చేరుకుంది? దీనికి ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కారణం కాదు. తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత అధికారంలో ఉన్న ప్రభుత్వాల తప్పుడు నీటి విధానాలు, దూరదృష్టి లేని నిర్ణయాలు కూడా ప్రధాన కారణాలే. ఈ వైఫల్యాల మూల్యం నేడు రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు చెల్లిస్తున్నారు.
గతేడాది రాష్ట్రంలో 1,178 మి.మీ. వర్షపాతం నమోదవగా, ఈ ఏడాది సాధారణ వర్షపాతం 833.9 మి.మీ. ఉండాల్సిన చోట కేవలం 630.1 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే 203.1 మి.మీ. (24 శాతం) తక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు 2025 ఖరీఫ్‌లో 62.33 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 2026 ఖరీఫ్‌లో కేవలం 56.80 లక్షల ఎకరాల్లోనే సాగైంది.
ప్రస్తుతం నెలకొన్న తీవ్ర వర్షాభావంతో సాగుచేసిన పంటలో సగమైనా చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిరప, కూరగాయల సాగు కూడా దెబ్బతింటోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలకు 409 టీఎంసీలు కావాల్సి ఉండగా, కేవలం 200 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వమే అంచనా వేసింది. ఫలితంగా బియ్యం కిలో ధర రూ.100కు చేరగా, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు నివసించే హాస్టళ్లు సైతం నీటి కొరతతో మూతపడుతున్నాయి. రాబోయే ఎనిమిది నెలల్లో నీటి ఎద్దడి మరింత తీవ్రం కానుందనే హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
తెలంగాణకు గోదావరిలో సుమారు 700 టీఎంసీలు, కృష్ణానదిలో 400 టీఎంసీలు కలిపి దాదాపు 1100 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది.
అయినప్పటికీ కనీసం వెయ్యి టీఎంసీల నీటిని సమర్థవంతంగా ఎత్తిపోసి నిల్వ చేసుకునే ప్రణాళికలను ప్రభుత్వాలు అమలు చేయలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగింది. ప్రజల త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నీటి ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించకుండా, 2016 మే 2న రూ.94 వేల కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. 2019 జూన్ 21న ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 270 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యం పెట్టుకున్నప్పటికీ, ఐదేళ్లలో ఎల్లంపల్లికి చేరిన నీరు 162.368 టీఎంసీలే. గోదావరి వరదల సమయంలో సుమారు 63 టీఎంసీల నీటిని తిరిగి దిగువకు వదలాల్సి వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ నిర్ణయాలు, వాటి నిర్వహణలోని లోపాలు ప్రాజెక్టు వైఫల్యాన్ని బయటపెట్టాయి. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు కుంగిపోవడంతో నీటిని ఎత్తిపోయడం కూడా ప్రశ్నార్థకమైంది.
వడ్డీలతో కలిపి లక్ష కోట్ల రూపాయలు దాటిన వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ఆశించిన ప్రయోజనాలను అందించలేకపోయింది.
దక్షిణ తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. జూరాల నుంచి చేపట్టాల్సిన ప్రాజెక్టును 2015 జూన్ 11న శ్రీశైలం బ్యాక్‌వాటర్‌కు మార్చడంతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాల దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యం దెబ్బతింది. మరోవైపు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి వనరుల అభివృద్ధి కంటే మద్యం అమ్మకాల ఆదాయం పెరుగుదలకే ప్రాధాన్యమిచ్చింది. 2014-15లో రూ.10,883 కోట్లుగా ఉన్న మద్యం అమ్మకాల ఆదాయం 2025-26 నాటికి రూ.44,457 కోట్లకు చేరింది. గ్రామం నుంచి నగరం వరకు మద్యం దుకాణాలు విస్తరించగా, నీటి భద్రత మాత్రం ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలింది.
ఇక 2023 నవంబర్ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కరువు నివారణ, సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణలో ఆశించిన చొరవ చూపలేదు.
మహాలక్ష్మి, 100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాలు మినహా వృద్ధాప్య, ఆసరా పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. కాళేశ్వరం మూడు బ్యారేజీలు, కడెం ప్రాజెక్టును బాగుచేసి 2023 డిసెంబర్ 18లోగా నివేదిక సమర్పించాలని 2023 సెప్టెంబర్ 4న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ, ప్రభుత్వం ఆ దిశగా సకాలంలో చర్యలు చేపట్టలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడంతో ఇప్పుడు రూ.4,193 కోట్లతో కాళేశ్వరం పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పనులను రెండేళ్ల క్రితమే చేపట్టి ఉంటే, అందుబాటులో ఉన్న నీటిని ఎత్తిపోసి నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నేడు ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని 621 మండలాల్లో 450 మండలాలు ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
దీనికి పాలకవర్గాలు అనుసరించిన విధానాలే కారణం.
ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తక్షణ కరువు నివారణ చర్యలు చేపట్టాలి. రాబోయే ఎనిమిది నెలల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల నుంచి రూ.50 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలి. ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు పెద్దఎత్తున ఉపాధి కల్పించాలి. పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించి, చిన్న, సన్నకారు రైతులకు రుణమాఫీతో పాటు కొత్త స్వల్పకాలిక రుణాలు మంజూరు చేయాలి. నిత్యావసరాలు, కూరగాయల ధరలను నియంత్రించాలి. పట్టణ, నగర ప్రాంతాల్లో పేదల జీవన ప్రమాణాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
దీర్ఘకాలిక నీటి భద్రత కోసం ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు, కుంటవాగుల ఆక్రమణలను తొలగించి వాటి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలి. వర్షపు నీరు వృథాగా నదుల్లోకి వెళ్లకుండా చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించాలి. భూగర్భజలాల పెంపునకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. సాగునీటి ప్రాజెక్టులతో పాటు స్థానిక నీటి వనరుల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. పశువులకు తాగునీరు, పశుగ్రాసం అందుబాటులో ఉంచడంతో పాటు వన్యప్రాణుల రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలి. జీవనదులున్నాయనే భరోసాతో నిర్లక్ష్యం చేస్తే కరువు నుంచి తెలంగాణను కాపాడలేం. నీటి వనరుల సంరక్షణ, సమర్థవంతమైన నీటి నిర్వహణ, బాధ్యతాయుతమైన పాలన ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కోగలం.
చిక్కుడు ప్రభాకర్, 8500810630






కామెంట్లు (0)