– జమ్మూకాశ్మీర్‌లో పర్యాటకులపై ముష్కరుల దాడి
– 28 మంది మృతి పలువురికి గాయాలు
– వారిలో 26 మంది భారతీయులు ఇద్దరు విదేశీయులు
– తెగబడిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ స్థానిక శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్
– సౌదీ నుంచి అమిత్‌షాకు ప్రధాని మోడీ ఫోన్
– శ్రీనగర్‌కు కేంద్ర హోంమంత్రి
– ఉగ్రదాడిపై పలువురి ఖండన
వేసవి సెలవులు ప్రారంభమవడంతో జమ్మూకాశ్మీర్‌లో సేదతీరటానికి వస్తున్న పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం నాడు పిల్లాపాపలతో ఇక్కడి పర్యాటకులే కాదు…విదేశీ టూరిస్టులు కూడా భారీగా పయనమయ్యారు. సుందరమైన కాశ్మీరాన్ని కనులారా చూడడానికి వెళ్లిన పర్యాటకులపై ముష్కరులు తుపాకులు ఎక్కుపెట్టారు. వాహనాలపై ఏకబిగిన తూటాలతో తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో ఇప్పటివరకు
28 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. రక్తసిక్తమైన ఆ ప్రాంతమంతా కుటుంబీకులను కోల్పోయిన వారి రోదనలతో హృదయవిదారకంగా మారింది.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో 26 మంది భారతీయులు కాగా ఇద్దరు విదేశీయులు ఉన్నట్టు సమాచారం. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న భద్రతాదళాలు ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి.
అమర్‌నాథ్ యాత్రకు ముందు..
అమర్‌నాథ్ యాత్రకు పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పొడవైన పచ్చికబయళ్లతో ఆహ్లాదకర వాతావరణంతో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గామ్‌లో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. బైసరన్ లోయలోని పర్వతం పైనుంచి దిగివచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. కొండ ప్రాంతం కావటంతో.. గాయపడినవారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. 38రోజులపాటు కొనసాగే అమర్‌నాథ్ యాత్ర జులై 3నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్‌నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఒకటి అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48కిలోమీటర్ల దూరం ఉండగా, మరొకటి గందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు మోడీ ఫోన్
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ ఉగ్రదాడిని ఖండించారు. అనంతరం కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఘటనాస్థలాన్ని సందర్శించాలని సూచించారు. దీంతో ఆయన శ్రీనగర్‌కు పయనమయ్యారు. భద్రతా సంస్థలతో సమావేశమై శాంతిభద్రతలను సమీక్షించనున్నారు. వర్షబీభత్సం సృష్టించిన రాంబన్ పర్యటనలో ఉన్న జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అర్ధంతరంగా తన పర్యటనను రద్దు చేసుకొని శ్రీనగర్‌కు చేరుకున్నారు. అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఉగ్ర ఘాతుకం వెనుక..?
కాశ్మీర్‌లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు భద్రతాదళాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ స్థానిక శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్టు ప్రకటించుకుంది.
దాడిపై దిగ్భ్రాంతి
ఈ దాడిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. దాడిని క్రూరమైన, అమానీయ చర్యగా విమర్శించారు. దాడిని నిర్ద్వంద్వంగా ఖండిచాలని తెలిపారు. అమాయక పౌరులపై, ముఖ్యంగా పర్యాటకులపై దాడి చేయడం భయంకరమైనదని, క్షమించరానిదని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆక్షాంక్షించారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ దాడిపై సోషల్ మీడియాలో స్పందించారు. ఉగ్రదాడిని ఖండిస్తూ, ఈ దారుణమైన చర్య వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెడతామని ప్రకటించారు. ఉగ్రదాడి ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, ఉగ్రవాదపోరాటంలో భారత్‌కు మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా సౌదీ పర్యటనలో ఉన్న మోడీ తన పర్యటనను రద్దు చేసుకుని భారత్‌కు తిరుగు పయనమయ్యారు.
ఉగ్రోన్మాదం
- Advertisement -
RELATED ARTICLES