కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసును ఛేదించిన పోలీసులు
నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్య పల్లవి.. కుమార్తె చంపినట్లుగా పోలీసులు తేల్చారు.ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు కనుగొన్నారు. అయితే చావుబతుకుల మధ్య రక్తపుమడుగులో ఉన్నప్పుడు తనను కాపాడాలంటూ 15 నిమిషాలు ఓం ప్రకాష్ వేడుకున్నారు. కానీ భార్య, కుమార్తె ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయలేదని పోలీసులు తెలిపారు. ఇక ఘటనాస్థలిలో రెండు కత్తులు, ఒక బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. హత్య చేశాక.. ఘటనాస్థలిలో కారం పొడి చల్లేశారు. ఆయుధాలపై కూడా కారం చల్లారు. ఇక ఓం ప్రకాష్‌ను చంపేశాక భార్యనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని నివాసానికి పోలీసులు వచ్చారు. చాలా సేపు డోర్లు ఓపెన్ చేయలేదు. మొత్తానికి లోపలికి వెళ్లి చూడగా హత్యకు గురైనట్లుగా గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు. ఓం ప్రకాష్ స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని చంపారన్. 1981 బ్యాచ్ ఐపీఎస్ అయిన ఈయన బళ్లారిలోని హరపనహళ్లీలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్క మగళూర్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆయన తన సర్వీసులో కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ, లోకాయుక్తలో పదవులు, అగ్నిమాపక సేవల డీఐజీ, సీఐడీ ఐజీపీ వంటి కీలక పదవులను నిర్వహించారు. 1993 భత్కర్ మత అల్లర్లలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2015లో డీజీపీ అండ్ ఐజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో పదవీ విరమణ చేశారు.