Saturday, May 10, 2025
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్సే హీరో

కాంగ్రెస్సే హీరో

- Advertisement -

– తెలంగాణ ఇచ్చిన పార్టీ
– నేడు సోనియాగాంధీ చిత్రపటాలకు పాలాభిషేకాలు
– కేసీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రులు ఫైర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్‌)కు చింత చచ్చినా, పులుపు చావలేదని రాష్ట్ర మంత్రులు ధీటుగా సమాధానం చెప్పారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రసంగం పూర్తయిన అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, జూపల్లి కృష్ణారావులు సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కాంగ్రెస్‌పార్టీపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీ, సోనియాగాంధీనే అని నిండు అసెంబ్లీలో స్వయంగా ఆయనే చెప్పిన మాటల్ని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం సోనియాగాంధీ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. 15 నెలల కాంగ్రెస్‌ పాలనలో కేసీఆర్‌కు ఒక్క మంచి పని కూడా కనిపించలేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు జనం రాకపోతే, ఆ నెపాన్ని పోలీసులు, ప్రభుత్వంపైకి నెట్టి, తమ అసమర్థతను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేండ్లలో తెలంగాణను స్వర్గధామం చేస్తే, రజతోత్సవ సభలో ‘ధరణి’ గురించి ఎందుకు చెప్పుకోలేకపోయారని ప్రశ్నించారు. రేషన్‌షాపుల్లో సన్న బియ్యం ఇస్తున్న విషయం ఆయనకు తెలీదా అని అడిగారు. రూ.లక్ష కోట్ల అవినీతికి గేట్లు తెరిచిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే కూలిన విషయాన్ని ఎలా విస్మరించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఈఎన్సీ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తే దాదాపు రూ.200 కోట్ల సొమ్ము బయపడిందనీ, అలాంటిది అధికారంలో ఉన్న మీ దగ్గర ఇంకెంత దొరుకుతుందో అని వ్యాఖ్యానించారు. ఎల్కతుర్తి సభలో చెప్పిన అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామనీ, దానికోసం కేసీఆరే తేదీ, సమయం ఫిక్స్‌ చేయాలని కోరారు. కులగణనలో పాల్గొనకుండా, సబ్బండవర్గాలను కేసీఆర్‌, ఆయన కుటుంబం అవమానపరిచిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్‌ ఉన్నారనీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్ట్‌ను బీసీకి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ”అసెంబ్లీకి ఎలాగూ రావట్లేదు. ప్రతిపక్షనేత పదవిని ఓ దళితుడికి ఇవ్వొచ్చు కదా!” అని సూచించారు.
కడుపు నిండా విషంతో కొన్ని పడికట్టు పదాలు వాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తూ, బదనాం చేయాలని ఎంత తాపత్రయ పడినా, ప్రజాప్రభుత్వాన్ని విజ్ఞులైన ప్రజల నుంచి వేరు చేయలేరని స్పష్టం చేశారు. అసలు బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలో రూ.1,500 కోట్ల నిధులు ఎలా వచ్చాయని అడిగారు. ”అసలు ఒకరి ఫోన్లు ట్యాపింగ్‌ చేయాల్సిన ఖర్మ ఏంటి? దాని సూత్రదారులంతా ఎందుకు విదేశాల్లో దాక్కున్నారు?” అని ప్రశ్నించారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం కల్లే అని చెప్పారు. ప్రగతిభవన్‌ పోవాలన్నా, ఫామ్‌ హౌజ్‌కు వెళ్లాలన్నా ఎంత గోస పెట్టారో, గ్రామాల్లో ఎన్ని అరాచకాలు చేశారో అప్పట్లో మంత్రిగా చేసిన తానే ప్రత్యక్ష సాక్ష్యం అని జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌పార్టీ విలన్‌ అనే వ్యాఖ్యల్ని కేసీఆర్‌ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వారి అగ్గిపెట్టె రాజకీయాలకు ప్రాణత్యాగాలు చేసిన అమరులకు ఆ సభలో కనీసం నివాళులు కూడా అర్పించలేదని తప్పుపట్టారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అట్టర్‌ప్లాప్‌ అయ్యిందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -