Friday, May 9, 2025
Homeజాతీయంకానరాని బలగాలు

కానరాని బలగాలు

- Advertisement -

– పహల్గాంలో భద్రత విస్మరణ
– ఉగ్రవాదులకు కలిసి వచ్చిన అవకాశం
– దాడి తర్వాత ఘటనాస్థలికి వచ్చింది స్థానికులే
– వెల్లడిస్తున్న ప్రత్యక్ష సాక్షులు
– ముష్కరుల దాడి ఒమర్‌ సర్కారు వైఫల్యం : కేంద్రం
– నెపాన్ని జమ్మూకాశ్మీర్‌ సర్కారుపై నెడుతున్న బీజేపీ సోషల్‌ మీడియా
– 2019 నుంచి అక్కడి భద్రతా వ్యవస్థపై కేంద్రానిదే పట్టు
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా, జమ్మూకాశ్మీర్‌ ప్రజలు ఇంకా భయం గుప్పెట్లోనే ఉన్నారు. రాజకీయంగానూ ఇది తీవ్ర చర్చకు దారి తీస్తున్నది. ఎందుకంటే.. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హౌదా కలిగించే ఆర్టికల్‌ 370 రద్దును కేంద్రంలోని మోడీ సర్కారు అప్పట్లో ఒక పెద్ద విజయంగా చెప్పుకున్నది. ఉగ్రవాదం తగ్గుదలను చూసిందని గణాంకాలు చెప్పింది. ప్రస్తుత పహల్గాం ఉగ్రదాడితో మోడీ సర్కారు వాదనలకు పెద్ద ఎదురుదెబ్బే తాకినట్టయ్యింది. ఈ దాడి భద్రతా వైఫల్యం కారణంగానే జరిగిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర హౌం మంత్రి నుంచి జవాబుదారీతనాన్ని కోరుతున్నారు.
న్యూఢిల్లీ: బీజేపీ అనుకూల సోషల్‌ మీడియా మాత్రం ఉగ్రదాడిని మరొక కోణంలో ప్రచారం చేస్తున్నది. ”ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)లుగా విడిపోయింది. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌లు యూటీలుగా విడిపోయి లెఫ్టినెంట్‌ గవర్నర్ల ద్వారా అక్కడ కేంద్ర పాలన సాగింది. ఆ సమయంలో జమ్మూకాశ్మీర్‌ ప్రశాంతంగా ఉన్నది. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాతే ఈ పరిస్థితి తలెత్తింది. ఈ ఉగ్రదాడికి ఒమర్‌ అబ్దుల్లా పాలనే కారణం” అని సోషల్‌ మీడియాలో విపరీత ప్రచారం నిర్వహిస్తున్నది. మోడీ సర్కారు అనుకూల మీడియా సైతం ఇవే కథనాలను అల్లుతూ, ప్రజలను తప్పుదోవ పటిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ చేతుల్లోనే భద్రతా వ్యవస్థ
జమ్మూకాశ్మీర్‌ ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు సైన్యంతో సహా శాంతి భద్రతలు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఏకీకృత హైకమాండ్‌ కింద ఉండేది. కానీ, యూటీలో భద్రతా వ్యవస్థ కేంద్రం నియమించిన ఎల్జీ నేతృత్వంలో ఉంటుంది. ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వానికి శాంతిభద్రతలు, భద్రతా వ్యవస్థపై అధికార పరిధి లేదు. కాశ్మీర్‌ లోయలోని నిఘా సంస్థలు కేంద్ర ప్రతినిధి ఎల్జీ మనోజ్‌ సిన్హాకు నివేదిస్తాయి. ఆర్టికల్‌ 370 రద్దు పేరుతో 2019 నుంచి కేంద్రం జమ్మూకాశ్మీర్‌లోని భద్రతా వ్యవస్థపై తన పట్టును పెంచుకున్నది. 2024లో కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ జమ్మూకాశ్మీర్‌ పోలీసుల బడ్జెట్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకున్నది. గతంలో ఒక రాష్ట్రంగా జమ్మూకాశ్మీర్‌లో ఒక లక్షకు పైగా ఉన్న పోలీసులు తమ జీతాలు, పెన్షన్‌ను రాష్ట్ర బడ్జెట్‌ నుంచి తీసుకునేవారు. 2019 నుంచి ఇక్కడ పోలీసులు కేంద్రం నియంత్రణలో ఉన్నారు. వాస్తవానికి కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా భద్రతా సమీక్ష సమావేశాలను నిర్వహించారు. దాని నుంచి ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను మినహాయించటం గమనార్హం.
బైసరన్‌కు భద్రతేది?
లోయలోని పర్యాటక ప్రదేశాలను సాధారణం గా సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌), సశస్త్ర సీమా బల్‌, జమ్మూకాశ్మీర్‌ పోలీసులు వంటి పారామిలిటరీ దళాలు పహారా కాస్తాయి. భద్రతను అందిస్తాయి. అయితే, ముష్కరుల దాడి జరిగిన మంగళవారం నాడు బైసరన్‌లో ఎలాంటి బలగాలూ లేవని చాలా మంది ప్రత్యక్ష సాక్షులు చెప్తుండటం గమనార్హం. ఈ పరిస్థితి ఉగ్రవాదులకు మంచి అవకాశాన్ని కల్పించినట్టయ్యిందనీ, అమాయకుల ప్రాణాలు తీసి అక్కడి నుంచి స్వేచ్ఛగా తప్పించుకున్నారు. ఉగ్రదాడి తర్వాత ఘటనాస్థలికి మొదట స్థానికులు వచ్చారనీ, భద్రతా దళాలు కావని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాల ఉనికి ఉంటే ఒకవేళ ఉగ్రదాడి జరిగినా.. ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాడి సమయంలో అక్కడ 500-600 మంది పర్యాటకులు ఉన్నారని సమాచారం. గతంలో పహల్గామ్‌లో ఉగ్రదాడుల చరిత్ర ఉన్నది. అయినప్పటికీ.. అక్కడ భద్రతా దళాలలను ఎందుకు మోహరించకపోవటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. అమర్‌నాథ్‌ మందిరం నుంచి 50 కిలో మీటర్ల దూరంలోనే ఉన్న ప్రమాద ప్రదేశం ఇంతటి తీవ్రమైన ఉగ్రదాడికి గురవటం పట్ల ఆందోళన కలుగుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -