Monday, May 19, 2025
Homeజాతీయంకుల వివక్ష అంతానికి నిబంధనలు ఖరారు చేయండి

కుల వివక్ష అంతానికి నిబంధనలు ఖరారు చేయండి

- Advertisement -

– ఉన్నత విద్యా సంస్థల్లో ఆత్మహత్యల పరిశీలనకు జాతీయ టాస్క్‌ఫోర్స్‌ : సుప్రీంకోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష నిర్మూలనకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) 2025 నాటి ముసాయిదా నిబంధనలను ఖరారు చేయవచ్చని, దానిని నోటిఫై చేయొచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను ప్రస్తావిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌.కోటేశ్వర్‌ సింగ్‌లతో కూడి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఆత్మహత్యలకు సంబంధించిన సమస్యలను పరిశీలించడానికి జాతీయ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసినట్టు ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే పిటిషనర్లు యూజీసీకి సూచనలు చేశారని తెలిపారు. ప్రతిపాదిత నిబంధనలు అధికారికంగా ప్రకటించే ముందు, వివిధ భాగస్వామ్య పక్షాలు చేసిన సూచనలను యూజీసీ పరిగణనలోకి తీసుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని ధర్మాసనం పేర్కొంది. అయితే సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ అభ్యర్థన మేరకు టాస్క్‌ఫోర్స్‌ ముందు సూచనలను సమర్పించే స్వేచ్ఛను పిటిషనర్లకు ధర్మాసనం ఇచ్చింది.
అలాగే ఇందిరా జైసింగ్‌ ఉన్న విద్యాలయాల్లో జరిగిన ఆత్మహత్యల గురించి మాత్రమే కాకుండా, భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలను నివారించడానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. టాస్క్‌ఫోర్స్‌ సిఫారసులు ఇచ్చే వరకు, ప్రతిపాదిత యూజీసీ నిబంధనలు అమలును వాయిదా వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ కొనసాగుతున్న ప్రక్రియకు అంతరాయం కలిగించవద్దని అన్నారు. అభ్యంతరాలు అందినందున ముసాయిదా నిబంధనలను ఖరారు చేయడానికి సమావేశం జరుగుతుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రతిపాదిత నిబంధనలు అమలులోకి వస్తే, టాస్క్‌ఫోర్స్‌ వాటిని కూడా పరిశీలించి, ఏవైనా లోపాలుంటే, సిఫారసులు చేసే అవకాశం ఉందని అన్నారు. టాస్క్‌ఫోర్స్‌ సిఫారసులు అమలులోకి వచ్చే వరకు యూజీసీ నిబంధనలు అమలు చేయొచ్చని తెలిపారు.
2016 జనవరి 17న హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. మూడేండ్ల తరువాత 2019 మే 22న ముంబయిలో టీఎన్‌ టోపీవాలా నేషనల్‌ మెడికల్‌ కాలేజీలో ఆదివాసీ విద్యార్థిని పాయల్‌ తడ్వి కూడా కుల వివక్ష కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఇద్దరు విద్యార్థుల తల్లులు రాధిక వేముల, అబేదా తాడ్వి క్యాంపస్‌లలో కుల ఆధారిత వివక్షను అంతం చేయడానికి ఒక యంత్రాంగాన్ని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -