– కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
– కేసుల పెండింగ్‌కు న్యాయమూర్తుల కొరతే కారణం
– ఈ పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయాలి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పెండింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సిఫారసులను త్వరగా పరిష్కరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల కారణంగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల నియామకాలకు కొలీజియం సిఫారసులపై త్వరగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభరు ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ”న్యాయమూర్తుల నియామకాల కోసం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను త్వరగా ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించుకోవాలి” అని పేర్కొంది. బెయిల్ మంజూరుకు సంబంధించిన అంశాలకు సంబంధించిన సుమోటో కేసును విచారిస్తున్న సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వివిధ హైకోర్టులలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 7,24,192 లక్షల క్రిమినల్ అప్పీళ్ల ఆందోళన కరమైన పరిస్థితిని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పెండింగ్ అనేక హైకోర్టులలో న్యాయమూర్తుల కొరతకు నేరుగా ముడిపడి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. సంక్షోభాన్ని నొక్కిచెప్పడానికి ధర్మాసనం వివరణాత్మక గణాంకాలను అందించింది. ”2,72,000 క్రిమినల్ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్న అలహాబాద్ హైకోర్టులో 160 మంది న్యాయమూర్తుల సంఖ్య ఉన్నప్పటికీ, కేవలం 79 మంది న్యాయమూర్తులతో మాత్రమే పనిచేస్తున్నారు. ముంబయి హైకోర్టులో 94 మంది న్యాయమూర్తులకు గాను కేవలం 60 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. కోల్‌కతా హైకోర్టులో, 72 పోస్టులు మంజూరు చేయగా, 44 మంది న్యాయమూర్తులు మాత్రమే పని చేస్తున్నారు. అదే విధంగా, ఢిల్లీ హైకోర్టు 60 మంది న్యాయమూర్తులతో మాత్రమే పనిచేస్తోంది, అయినప్పటికీ అది 36 మంది న్యాయమూర్తులతో పనిచేస్తుంది” అని ధర్మాసనం తెలిపింది. కనుక న్యాయమూర్తుల పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు గుర్తించింది. కొన్ని రోజుల క్రితం, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల డేటాను ఈ కోర్టు విడుదల చేసింది.
కొలీజియం సిఫారసులు త్వరగా పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -