‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు ప్రతిభ గల కళాకారులను, సాంకేతిక నిపుణులకు గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులను ఇచ్చి ప్రోత్సహిస్తోంది’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులపై మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ గుండె చప్పుడునుతన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ గద్దర్ బాణి, పాటలను అనుకరిస్తారు. గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆయన పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం హర్షనీయం. జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ఈ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. అందుకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తాం’ అని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జూన్ 14న అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాం అని తెలంగాణ ఫిల్మ్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చెప్పారు. 14 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. జ్యూరీ కమిటీ చైర్మన్‌గా నటి జయసుధ వ్యవహరిస్తున్నారు. అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా, వ్యక్తిగత విభాగంలో 1172, ఫీచర్ ఫీల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిల్లో 76 దరఖాస్తులు అందాయి.