– భూభారతి సదస్సులో అధికారులకు మంత్రి హెచ్చరిక
– ప్రతి రైతుకూ భూభారతి ద్వారా న్యాయం చేస్తాం..
– త్వరలో 6 వేల మంది సర్వేయర్లు : అవగాహనా సదస్సుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-దేవరకొండ/ఇబ్రహీంపట్నం
భూభారతి చట్టంపై, రైతుల సమస్యలపై అవగాహన పెంచుకోకపోవడం.. క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడంతో అధికారులపై రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంపై అధికారులు అవగాహన పెంచుకోకపోయినా, తప్పులు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ చట్టం ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని మంత్రి చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులకు, భూములున్న ఆసాముల కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూ భారతి- 2025 చట్టంపై సోమవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలకేంద్రంలో, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో 4 మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని, నెలాఖరుకు పైలట్ ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. జూన్ 2 నుంచి పైలట్ మండలాల్లో వ్యవసాయ భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిం చనున్నామని తెలిపారు. మే 1 నుంచి అన్ని జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుంటామన్నారు. అత్యంత వెనుకబడిన చందంపేట మండలాన్ని పైలట్ మండలంగా తీసుకునే విషయమై ఆలోచిస్తామన్నారు. ప్రతి గ్రామానికీ తహసీల్థార్ స్థాయి అధికారులు వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటారని, రైతులు రూపాయి చెల్లించకుండా రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. భూముల సర్వే కోసం 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించ నున్నామని తెలిపారు. ప్రతి గ్రామానికీ గ్రామ పరిపాలన అధికారి చొప్పున 10695 మంది మే మొదటి వారంలో రానున్నట్టు వివరించారు. ప్రతి మనిషికి ఆధార్‌కార్డు లాగే భూదార్ కార్డు ఇచ్చి ఖాతా నెంబర్ ఇవ్వనున్నామన్నారు. గతంలో భూములు అమ్మినా, కొన్నా మ్యాపింగ్ లేదని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ ఏర్పాటు చేసేలా చట్టంలో తీసుకొచ్చామని చెప్పారు. సాదా బైనామాలను పరిష్కరిస్తామన్నారు. 9 లక్షలా 26 వేల సాదాబైనామా దరఖాస్తులున్నాయని, వాటిలో న్యాయమైన వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ చట్టాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. గతంలో పట్టాలిచ్చిన డీ లిమిటేషన్ ఫారెస్ట్ భూములను పరిశీలించి, ఎవరు ఎంత భూమిలో సాగులో ఉన్నా రైతులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. పునరావాసం కింద ఒక చోట నుంచి మరోచోటికి రైతులు వెళ్లిన సందర్భంలో ఇచ్చిన భూముల డీ లిమిటేషన్‌లో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు గత ప్రభుత్వంలో రైతులు మంగళసూత్రాన్ని అమ్మి కోర్టుకు ఎక్కాల్సిన దుస్థితి ఉండేదని ఇబ్రహీంపట్నం సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 18 లక్షల ఎకరాలు పార్ట్-బిలో పెట్టారని, వాటిని కూడా పరిష్కరిస్తామని అన్నారు. ఇండ్ల స్థలాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ధరణి మాదిరిగా భూభారతిలో తప్పులు చేయకూడదన్నారు.
దేవరకొండ ఆర్డీఓపై మంత్రి ఆగ్రహం
రెవెన్యూ డివిజన్‌పై దేవరకొండ ఆర్‌డీఓకు ఏమాత్రం అవగాహన లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై మంత్రి అడిగిన ప్రశ్నలకు ఆర్డీఓ రమణారెడ్డి సరైన సమాధానం చెప్పలేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీఓగా వచ్చి ఆరునెలలైనప్పటికీ భూభారతి చట్టంపై సరైన అవగాహన లేదన్నారు. భూ సమస్యలపై రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సబ్జెక్టు మీద అవగాహన లేదని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆర్డీఓకు సూచించారు. భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోకపోతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
తప్పులు చేస్తే శిక్షలు తప్పవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES