Wednesday, April 30, 2025
Homeజాతీయంతమిళనాడు ప్రజలు నమ్మకద్రోహ బీజేపీని ఎప్పటికీ సహించరు : స్టాలిన్‌

తమిళనాడు ప్రజలు నమ్మకద్రోహ బీజేపీని ఎప్పటికీ సహించరు : స్టాలిన్‌

నవతెలంగాణ – చెన్నై : అన్నాడిఎంకె – బీజేపీ కూటమిని ‘ఓటమి కూటమి’గా ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ అభివర్ణించారు. ఢిల్లీకి తలవంచి తమిళనాడుకు ద్రోహం చేసే ‘నమ్మక ద్రోహ కూటమి’ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ సహించరని స్టాలిన్‌ అన్నారు. తమిళనాడులో బీజేపీతో ఆల్‌ ఇండియా అన్నా ద్రవిడ మునేత్ర కజగం (ఎఐఎడిఎంకె) పార్టీలు కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో స్టాలిన్‌ ఆ కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎఐఎడిఎంకె పొత్తు నేపథ్యంలోనే నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తమిళనాడుకి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో షా వ్యాఖ్యలపై శనివారం స్టాలిన్‌ స్పందించారు. ఈ కూటమిపై స్టాలిన్‌ స్పందిస్తూ.. ఎఐఎడిఎంకె- బీజేపీ కూటమి ఓటమి కూటమి. ఈ ఓటమిని తమిళనాడు ప్రజలు పదేపదే భరించారు. అయినప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ విఫలమైన కూటమిని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. నిన్న అమిత్‌షా చెన్నై పర్యటన సందర్భంగా ఇచ్చిన ప్రెస్‌ బ్రీఫింగ్‌ ఆయన పదవికి తగినది కాదు. ఎఐఎడిఎంకె- బిజెపిలు ఓ కూటమిగా ఏర్పాటు చేయాలనేది ఆయన ఎంపిక అయినప్పటికీ.. ఈ కూటమి ఎందుకు ఏర్పడిందో.. ఏ సైద్ధాంతిక పునాదిపై ఏర్పడిందో ఆయన స్పష్టం చేయలేదు. ఇరు పార్టీలు సాధారణ కార్యక్రమాలపై కలిసి పనిచేస్తామని మీడియా ముందు చెప్పడం.. అస్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది అని స్టాలిన్‌ అన్నారు. నీట్‌ పరీక్ష, త్రిభాషా విధానంతో హిందీని బలవంతంగా రుద్దడం, వక్ఫ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఎఐఎడిఎంకె గతంలో ప్రకటించింది. కానీ నిన్న అమిత్‌షాతో జరిగిన విలేకరుల సమావేశంలో ఎఐఎడిఎంకె వీటిపై నోరుమెదపలేదు.
రాష్ట్రంలోని డిఎంకె ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే మీడియా సమావేశాన్ని ఉపయోగించుకున్నారని తెలిసిపోతుంది అని స్టాలిన్‌ అన్నారు. అధికార దాహంతో ఉన్న ఎఐఎడిఎంకె- బీజేపీ కూటమి రాష్ట్ర హక్కుల్ని కాపాడడంలోనూ, తమిళ సంస్కృతిని పరిరక్షించడం వంటి ఆదర్శాలకు వ్యతిరేకం. ఈ కూటమిలోని పళనిస్వామి పదవుల కోరికతో తమిళనాడు ఆత్మగౌరవాన్ని, హక్కుల్ని ఢిల్లీకి తాకట్టుపెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నంచడం ఎవరూ మర్చిపోలేదు అని స్టాలిన్‌ అన్నారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో నీట్‌ అంశంపై జర్నలిస్టులు అమిత్‌షాని పదేపదే ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇవ్వలేకపోయాడు. నీట్‌ని వ్యతిరేకంగా డైవర్షన్‌ పాలిటిక్స్‌ అని షా అన్నారు. అయితే నీట్‌ వల్ల తమిళనాడులో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బీహార్‌లో కూడా కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. దీనిపై షా ఏం సమాధానం చెబుతారు? ఐదు రాష్ట్రాల్లో నీట్‌ సంబంధిత కుంభకోణాలపై ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు చేస్తోందని? ఈ కేసుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులను అరెస్టు చేశారని అమిత్‌షాకు తెలుసా? అని స్టాలిన్‌ ప్రశ్నించారు. సిబిఐ ఎవరి నియంత్రణలో ఉంది. ఆ సంస్థను దర్యాప్తు చేయనివ్వండి. అప్పుడే నీట్‌ను వ్యతిరేకించడం దృష్టి మరల్చే చర్యనా లేక వైద్య విద్యను పరిరక్షించడానికి చట్టబద్ధమైన వైఖరిని తీసుకున్నామా అని షా నిర్థారించగలరు అని స్టాలిన్‌ అన్నారు. తమిళనాడులో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని డిఎంకె ప్రభుత్వంపై షా విమర్శించారు. తమిళనాడు.. మణిపూర్‌ కాదు అని స్టాలిన్‌ గుర్తుచేశారు. ఎఐఎడిఎంకె నేతలు.. వారి బంధువులపై రెండుసార్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహించడంతోనే ఈ పొత్తుకు అంగీకరించినట్లు తమిళనాడు ప్రజలకు బాగా తెలుసు. కేవలం రెండుసార్లు జరిగిన దాడుల తర్వాత తమిళనాడుని కేంద్రం వద్ద తనఖా పెట్టేందుకు ఎఐఎడిఎంకె నేతలు సిద్ధమవుతున్నారు. ఢిల్లీకి తలొగ్గి తమిళనాడుకు ద్రోహం చేసే ద్రోహపూరిత కూటమిని ప్రజలు ఎప్పటికీ సహించరు అని స్టాలిన్‌ ఈ సందర్భంగా నొక్కొ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img