– బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే విద్యార్థి నేతలపై వేటు
– హిందూ.. హిందుస్థానీ అంటూ పాఠ్యపుస్తకాల్లో మార్పు : ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను
– జనం కోసం ప్రాణమిచ్చేవాడే నిజమైన హీరో : సినీ నటులు, అభ్యుదయవాది డాక్టర్ మాదాల రవి
– ఖమ్మంలో ప్రారంభమైన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఐదవ మహాసభలు
– బహిరంగ సభకు భారీగా విద్యార్థులు
– ర్యాలీగా కదం తొక్కిన విద్యార్థులు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా భారత విద్యార్థి ఫెడరేషన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నదని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను తెలిపారు. హిందూ.. హిందుస్థానీ.. అంటూ కేంద్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకొస్తున్నదన్నారు. బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన విద్యార్థి నేతలను విద్యాలయాల నుంచి సస్పెండ్ చేస్తోందని తెలిపారు. వేలాది మంది కోసం పోరాడేవాడే నిజమైన హీరో అని సినీ నటులు, అభ్యుదయవాది డాక్టర్ మాదాల రవి అన్నారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం (సీతారాం ఏచూరి నగర్)లో మూడ్రోజులపాటు కొనసాగే ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఐదవ మహాసభలు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమయ్యాయి. దీనికి ముందు కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వీపీ సాను మాట్లాడారు. కాశ్మీర్‌లో పర్యాటకులపై దాడికి భద్రతా వైఫల్యమే కారణమని అన్నారు. పార్లమెంట్ మొదలు పుల్వామా వరకు అనేక చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయని, ప్రధానిగా మోడీ, హౌం మంత్రిగా అమిత్ షాకు కొనసాగే అర్హత లేదన్నారు. పెహల్గాలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చారంటే ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనన్నారు. నరేంద్రమోడీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే.. యూనివర్సిటీ విద్యార్థి నేతలపై వేటు వేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ హెచ్‌సీయూ భూములను కాజేస్తున్నారన్నారు. సమస్యలపై ప్రశ్నించినందుకు విద్యార్థి నేతలపై దేశద్రోహం కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. టీఐఎస్‌ఎస్ రీసెర్చ్ స్కాలర్ రాందాస్‌పై రెండేండ్లు వేటు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. నయా ఉదారవాద విధానాలు పెట్రేగుతున్నాయని చెప్పారు. ఫాసిస్టు, మతోన్మాద విధానాలను రూపుమాపాలని కోరారు.
పోరాటాలకు ఏకైక మార్గం చైతన్యం : మాదాల రవి
పోరాటాలకు చైతన్యం ఏకైక మార్గమని సినీ నటులు, నిర్మాత డాక్టర్ మాదాల రవి అన్నారు. అభ్యుదయ శక్తులు ఐక్యం కావాలని, వామపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. పోరాటాల ఖిల్లా ఖమ్మం జిల్లాకు రెడ్ సెల్యూట్ అంటూ ఉపన్యాసాన్ని ప్రారంభించారు. ‘చదువు ఎందుకు? చదువు ఎందుకు?? చదువు ఎందుకురా..??? నలుగురిలో దీపమై నిలిచేందుకు రా..!’ అంటూ ఉర్రూతలూగిం చారు. వేలాది మంది కోసం ప్రాణమిచ్చే వాడు నిజమైన హీరో అని, దాస్య శృంఖలాల నుంచి దేశానికి విముక్తి కల్పించిన భగత్ సింగ్, ప్రపంచ విప్లవాన్ని ముందుకు నడిపిన చేగువేరా.. బడుగు జీవుల కోసం పాటుపడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిజమైన హీరోలని వ్యాఖ్యానించారు. ఒక్క రూపాయి కూడా పంచకుండా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎన్నికవుతారో ఆరోజే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని తెలిపారు. కళ కళ కోసం కాదు.. కాసుల కోసం కాదు.. సమాజ చైతన్యం కోసమని ‘ఎర్రమల్లెలు’ పూయించిన మాదాల రంగారావు ప్రజానాట్యమండలి నుంచి వచ్చిన వారేనని చెప్పేందుకు గర్వపడుతున్నానని అన్నారు. ప్రజా కళాకారులు సమాజానికి పట్టిన జబ్బును వదలగొట్టాలని పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో గరికపాటి రామ్మోహన్‌రావు నిర్మించిన పుట్టిల్లు సినిమా ఈ కోవలోనిదేనని చెప్పారు. భగత్ సింగ్ లాంటి మహౌన్నత వ్యక్తులు ఇంట్లో పుట్టొద్దనే.. సమాజ ధోరణిలో ఎస్‌ఎఫ్‌ఐ మార్పు తీసుకురావాలన్నారు. శ్రమజీవుల రక్తం నుంచి ఎర్ర జెండా పుట్టిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని స్పష్టం చేశారు. ఏ వ్యవస్థ మారాలన్నా సాంస్కృతిక విప్లవం రావాలని పిలుపునిచ్చారు.
విద్యారంగంలోనే అభివృద్ధి : టి.నాగరాజు
విద్యారంగంతోనే రాష్ట్ర అభివద్ధి సాధ్యమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ చేయాలన్నారు. 4 వేల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఆరేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు కాకుండా అడ్డుకోవాలని తెలిపారు. కొత్త నిర్ణయాలతో పోరాటాలకు వెళ్లాలని ఆహ్వాన సంఘం వైస్ చైర్మెన్ ఐవీ రమణారావు, రిసెప్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు రవి మారుత్ సూచించారు. అధ్యయనం కొరవడితే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. ఈ బహిరంగ సభలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్, విద్యావేత్తలు మువ్వా శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఎఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం.పూజ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, తుడుం ప్రవీణ్ పాల్గొన్నారు.
ఖమ్మం వీధుల్లో కదంతొక్కుతూ ర్యాలీ..
ఎస్‌ఎఫ్‌ఐ ఐదవ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఖమ్మం నగర వీధుల్లో విద్యార్థులు కదం తొక్కుతూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జడ్పీ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ వైరా రోడ్ మీదుగా మహాసభల ప్రాంగణం భక్త రామదాసు కళాక్షేత్రం వరకు సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. నినాదాలు చేస్తూ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జెండాలు, భగత్ సింగ్, చేగువేరా ప్లకార్డులు, కోలాటం, డప్పు నృత్యాలు, కోయ కళాకారుల రేల నృత్యాలతో ఆద్యంతం ఆకట్టుకునేలా ప్రదర్శన సాగింది. బహిరంగ సభ అనంతరం ఐద్వా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళలు భోజనాలు వడ్డించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు మూర్తి జెండా ఆవిష్కరించటంతో మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభల్లో భాగంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు.
నయా ఫాసిస్టు విధానాలపై పోరు
- Advertisement -
RELATED ARTICLES