– సింధు ఒప్పందం రద్దుపై నిపుణుల మనోగతం
– భారత్‌పై తొలగనున్న ఆంక్షలు
– ఇక పొరుగు దేశానికి నీటికీ కటకటే
న్యూఢిల్లీ: కాశ్మీర్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పైశాచిక దాడి నేపథ్యంలో 1960లో కుదుర్చుకున్న సింధు జల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేసిన విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును పాకిస్తాన్ విశ్వసనీయంగా, కచ్చితంగా నిలిపివేసే వరకూ ఈ ఒప్పందాన్ని తిరిగి అమలు చేసే ప్రశ్నే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ ఒప్పందం రద్దు ప్రభావం పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలోనే ఉంటుందని జల నిపుణులు తెలిపారు. సింధు ప్రధాన నది కాగా దానికి ఐదు ఉప నదులు…రావి, చీనాబ్, బియాస్, సట్లెజ్, జీలం ఉన్నాయి. ఇవి నదికి ఎడమ ఒడ్డున ఉన్నాయి. ఇక కుడి ఒడ్డున ఉన్న కాబూల్ ఉప నది మన దేశం గుండా ప్రవహించదు. రావి, బియాస్, సట్లెజ్ నదులను కలిపి తూర్పు నదులు అంటారు. చీనాబ్, జీలం, సింధు పశ్చిమ నదులు. దీని జలాలు భారత్, పాకిస్తాన్ దేశాలకు ఎంతో కీలకమైనవి.
గత సంవత్సరమే నోటీసు
సింధు నదికి మన దేశం ఎగువన ఉండడంతో అనేక ప్రయోజనాలు, అవకాశాలు ఉన్నాయని ఆరు సంవత్సరాలకు పైగా భారత్‌లో జల కమిషనర్‌గా పనిచేసిన ప్రదీప్ కుమార్ సక్సేనా చెప్పారు. ‘ప్రభుత్వం నిర్ణయిస్తే ఒప్పందాన్ని రద్దు చేయడానికి ఇది తొలి అడుగు అవుతుంది’ అని ఆయన తెలిపారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం…ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి నిర్దిష్టమైన నిబంధనలేవీ లేవు. ఒప్పందం ముగింపు సమయంలో నెలకొన్న పరిస్థితులలో మౌలిక మార్పులను దృష్టిలో పెట్టుకొని వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 62 కింద దానిని తిరస్కరించవచ్చునని వివరించారు. భారత్ గత సంవత్సరమే పాకిస్తాన్‌కు లాంఛనంగా నోటీసు పంపింది. ఒప్పందాన్ని సమీక్షించాలని, అందులో మార్పులు చేయాలని సూచించింది.
రిజర్వాయర్ ఖాళీ అయితే…
ఒప్పందం విషయంలో భారత్ తీసుకోదగిన చర్యలను సక్సేనా వివరించారు. ఒప్పందం అమలులో లేనప్పుడు కిషన్‌గంగ జలాశయంలో, జమ్మూకాశ్మీర్‌లోని పశ్చిమ నదులపై ఉన్న ఇతర ప్రాజెక్టుల విషయంలో పరిమితులను పాటించాల్సిన బాధ్యత మనపై ఉండదు. సింధు జల ఒప్పందం అమలులో ఉన్నప్పుడు ఈ పరిమితులు ఉంటాయి. ఇప్పుడు మన దేశం రిజర్వాయర్‌ను ఖాళీ చేయవచ్చు. దీనిని నింపడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది.
ఒప్పందం ప్రకారం ఖాళీ చేసిన తర్వాత రిజర్వాయర్‌ను ఆగస్టులో నింపాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వర్షాలు కురుస్తుంటాయి. నీటికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఒప్పందం రద్దవడంతో రిజర్వాయర్‌ను భారత్ ఎప్పుడైనా ఖాళీ చేయవచ్చు. పాకిస్తాన్‌లో విత్తనాలు వేసుకునే కాలంలో రిజర్వాయర్‌ను ఖాళీ చేస్తే అక్కడ వ్యవసాయ పనులు దెబ్బతింటాయి. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఎక్కువ భాగం నీటి పారుదల కోసం సింధు, దాని ఉపనదులపై ఆధారపడుతోంది.
ఇక ఈ పరిమితులు ఉండవు
ఒప్పందం ప్రకారం సింధు, దాని ఉప నదులపై ఆనకట్టలు వంటి నిర్మాణాలకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. ఆనకట్టల డిజైన్లపై గతంలో పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కానీ ఒప్పందం రద్దు కావడంతో భవిష్యత్తులో ఆ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో దాదాపు అన్ని ప్రాజెక్టుల పైన పాకిస్తాన్ అభ్యంతరం తెలిపింది. వీటిలో సలాల్, బగ్లీహార్, యురి, చుటక్, నిమూ బజ్గో, కిషన్‌గంగ, పాకల్ దుల్, మియార్, లోయర్ కల్‌నారు, రట్లే ప్రాజెక్టులు ముఖ్యమైనవి. 2019లో పుల్వామాలో ఉగ్ర దాడి జరిగిన తర్వాత లడఖ్‌లోని మరో ఎనిమిది జలవిద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతించింది.
కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు పాక్ తెలిపే అభ్యంతరాలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. జలాశయాలను ఎలా నింపాలి, వాటి నిర్వహణ ఎలా అనే విషయాలపై కూడా గతంలో పరిమితులు ఉండేవి. ఒప్పందం రద్దవడంతో ఇక అవి కూడా ఉండవు. నదుల నుండి వచ్చే వరదలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్‌తో పంచుకోవాల్సిన అవసరం కూడా లేదని సక్సేనా తెలిపారు. దీనివల్ల పాక్‌కు ప్రమాదం పొంచి ఉంటుంది. వర్షాకాలంలో నదులు ఉప్పొంగినప్పుడు ఆ సమాచారాన్ని పొరుగు దేశానికి అందజేయకపోతే అక్కడ వరదలు సంభవించి నష్టం జరుగుతుంది. పశ్చిమ నదులలో…ముఖ్యంగా జీలం నదిలో నీటి నిల్వలపై భారత్‌పై ఇక ముందు ఎలాంటి ఆంక్షలు ఉండబోవు. కాశ్మీర్ లోయలో వరద ప్రవాహాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
దేశ విభజన తర్వాత…
దేశానికి స్వాతంత్య్రం లభించిన సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించారు. ఇది సింధు పరీవాహక ప్రాంతం మీదుగానే ఉంది. దీనివల్ల సింధు నది దిగువన పాకిస్తాన్, ఎగువన భారత్ ఉన్నాయి. రావి నదిపై మాధోపూర్ వద్ద, సట్లెజ్ నదిపై ఫిరోజ్‌పూర్ వద్ద రెండు ముఖ్యమైన నీటిపారుదల పనులు చేపట్టారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌కు నీటి సరఫరా జరగాలంటే అది భారత భూభాగం పైనే పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే నీటిని సరఫరా చేసే కాలువ మన భూభాగంలోనే ఉంది. నీటి వినియోగంపై రెండు దేశాల మధ్య వివాదం తలెత్తడంతో 1960లో అంతర్జాతీయ పునర్నిర్మాణ-అభివృద్ధి బ్యాంక్ (ఇప్పటి ప్రపంచబ్యాంక్) ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఫలితంగా సింధు జల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పున ఉన్న సట్లెజ్, రావి, బియాస్ నదుల జలాలను భారత్ అపరిమితంగా వినియోగించుకోవచ్చు. పశ్చిమాన ఉన్న సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిలో అధిక భాగాన్ని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు. పశ్చిమాన ఉన్న నదుల నీటిని దేశీయ అవసరాలకు, వినియోగేతర అవసరాలకు, వ్యవసాయానికి, జల విద్యుత్ ఉత్పత్తికి భారత్ వినియోగించుకోవాల్సి ఉంటుంది.
పాకిస్తాన్‌కే నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES