నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు పొందుతుండడంపై ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన శుక్రవారం స్పందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. ‘పదేండ్ల చీకట్లను పారదోలి ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయి. పేద బిడ్డల చదువుల గుడులు అక్షర మంత్రోశ్ఛారణలతో పవిత్రతను సంతరించుకుంటున్నాయి. సర్కారు బడికి గత పాలకులు వేసిన తాళాలు బద్ధలవుతున్నాయి. పాఠశాలల్లో కనిపిస్తున్న ఈ గుణాత్మక మార్పు తెలంగాణ భవిష్యత్తు గమనానికి సంకేతం. ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనం. ఈ అక్షర యజ్ఞంలో చేతులు కలిపిన ప్రతి ఒక్కరికి అభినందనలు’అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు కొత్తగా 3,68,054 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఇందులో 572 ప్రీప్రైమరీ పాఠశాలల్లో 6,146 మంది పిల్లలు చేరారు. ఒకటో తరగతిలో 1,38,135 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. రెండు నుంచి పదో తరగతి వరకు 2,29,919 మంది చొప్పున విద్యార్థులు చేరిన విషయం తెలిసిందే. ప్రయివేటు పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో 79,048 మంది, ప్రభుత్వ స్కూళ్ల నుంచి సర్కారు పాఠశాలల్లో 1,50,819 మంది చేరడం గమనార్హం.
పేద బిడ్డల గుడులు..సర్కారు బడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES