Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుపైగా ల్యాండ్స్‌పై బోగస్‌ కోర్టు ఆర్డర్‌

పైగా ల్యాండ్స్‌పై బోగస్‌ కోర్టు ఆర్డర్‌

– సిట్‌ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ – హైదరాబాద్‌
శంషాబాద్‌లోని పైగా భూములపై యథాస్థితిని కొనసాగించాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు శుక్రవారం మరోసారి పొడిగించింది. ఈ భూముల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వకపోయినప్పటికీ ఇచ్చినట్టుగా కొందరు తప్పుడు ఆర్డర్‌ కాపీలను తయారు చేశారనే విషయాన్ని హైకోర్టు గుర్తించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వ్యవహారంపై త్వరగా విచారణ జరిగేలా సిట్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ టి వినోద్‌ కుమార్‌, జస్టిస్‌ పి శ్రీసుధలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ శుక్రవారం ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సర్వే నెం 611 నుంచి 664, 720, 721, 724 నుంచి 732, 775లో సుమారు 100 ఎకరాల వరకు ఉన్న పైగా భూములపై హక్కులపై మహమ్మద్‌ తాహెర్‌ ఖాన్‌కు అనుకూలంగా సివిల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హెచ్‌ఎండీఏ అప్పీల్‌ చేసింది. దీనిని బెంచ్‌ విచారించింది. ఈ వివాదంపై అప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుకు సంబంధించి తప్పుడు కోర్డు ఆర్డర్‌ సష్టించారనే విషయాన్ని హైకోర్టు గుర్తించింది. జస్టిస్‌ ఎస్‌.డి పట్నాయక్‌ 1988లో డిసెంబర్‌లో హైకోర్టు న్యాయమూర్తి అయితే, అంతకు ముందే అదే ఏడాది ఏప్రిల్‌లో పైగా భూములపై ఆర్డర్‌ ఇచ్చినట్టుగా తప్పుడు ఉత్తర్వులను సష్టించిన బాగోతంపై పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది
విద్యాహక్కు చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారు?
రాష్ట్రంలోని ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25 శాతం సీట్లను కేటాయించాలనే విద్యా హక్కు చట్టాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చట్టం అమలుకు తీసుకున్న చర్యల వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ఏడాది అక్టోబర్‌ 19న ప్రభుత్వం జారీ చేసిన మెమో మేరకు ఉచిత సీట్లు ఇచ్చేందుకు తీసుకునే చర్యలపై నివేదిక ఇవ్వాలంది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈలోగా అఫిడవిట్‌ వేయాలని పేర్కొంది. దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టంలోని సెక్షన్‌ 12(1)సీ ప్రకారం ప్రీ ప్రైమరీలో పాటు ప్రయివేట్‌ పాఠశాలల్లో 25శాతం పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలని, ఈ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ తాండవ యోగేష్‌ అనే లాయర్‌ 2020లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోరుపాల్‌, జస్టిస్‌ రేణుక యారా బెంచ్‌ శుక్ర వారం విచారించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆర్‌టీఈ చట్టంలోని సెక్షన్‌ 12(1)(సీ)ని అమలు చేస్తారో లేదో చెప్పాలని రాష్ట్రాన్ని కోరింది.
బీఆర్‌ఎస్‌ సభకు అనుమతివ్వని పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలి : హైకోర్టు
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ ఆ పార్టీ వేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల17లోగా నిర్ణయాన్ని వెలువరించాలని వరంగల్‌ సీపీ, కాజీపేట్‌ ఏసీపీకి నోటీసులు జారీ చేసింది. అదే తేదీకి విచారణను వాయిదా వేస్తూ జస్టిస్‌ వినోద్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోరుతూ మార్చి 28న, ఏప్రిల్‌ 4న వినతిపత్రాలు అందజేసింది. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినరు భాస్కర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 27న ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు సభ, విజయోత్సవాలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలన్న తమ వినతిపత్రాలపై పోలీసులు చర్యలు తీసుకోలేదని పిటిషనర్‌ హైకోర్టుకు నివేదించారు.
గ్రూప్‌-1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి నోటీసులు
రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేపట్టిన గ్రూప్‌-1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంపుదలపై సవాల్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ముందున్న వ్యాజ్యాలపై తుది ఉత్తర్వులు వెలువడేలోగా ప్రభుత్వం గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుదల జరిపితే అవి తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని షరతు విధించింది. ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2022లో జారీ చేసిన జీవో 33 ద్వారా పెంచిన ఎస్టీ రిజర్వేషన్లను విద్యా, ఉపాధి రంగాలకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జీవోను సవాల్‌ చేస్తూ పి. శ్యాంసుందర్‌రెడ్డి ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజరు పాల్‌, జస్టిస్‌ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పాత నిబంధనల ప్రకారం ఎస్టీలకు ఆరు శాతమే రిజర్వేషన్లు ఉండాలని, పెంపుదల చేయడం చెల్లదని, పెంచిన రిజర్వేషన్ల వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా, పెంచిన రిజర్వేషన్లను కొనసాగించాలంటూ ఎస్టీ సంఘాలు ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌లో తమ వాదనలు కూడా వినాలని కోరాయి. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిందని చెప్పాయి. వాదనల తర్వాత ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జూన్‌ 12కి వాయిదా వేసింది. ప్రభుత్వం నియామకాలు జరిపితే అవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని షరతు విధించింది.
వివాహిత కారుణ్య నియామకానికి అనర్హురాలనడం సరికాదు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలించమన్న హైకోర్టు
కుమార్తె వైవాహిక స్థితిని పరిగణనలోకి తీసుకుని కారుణ్య నియామకానికి అర్హురాలు కాదని చెప్పడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహమైనా ఆమె అర్హురాలేనని, అయితే దీనికి వారి ఆర్థిక పరిస్థితి సహా పలు అంశాలను పరిశీంచాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ అంశాల మేరకు పిటిషనర్‌ దరఖాస్తును పున్ణ పరిశీలించాలని చెప్పింది. నిబంధనల మేరకు సంబంధిత డాక్యుమెంట్లతో మళ్లీ వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తూ యూసఫ్‌ మృతిచెందారు. కారుణ్య నియామకం కింద తన కుమార్తె ఫాతిమాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని సీపీ నిరాకరించారంటూ యూసఫ్‌ భార్య షాహీన్‌ సుల్తానా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు విచారణ చేపట్టారు. ‘షాహీన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. కుమారుడు కెనాడా వెళ్లి తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేదు. కూతురు ఫాతిమానే తల్లిని చూసుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లికి సరైన వైద్యం కూడా అందించలేక పోతోంది. వివాహమైనా కారుణ్య నియామకానికి అర్హురాలేనని గతంలో జార్ఖండ్‌ హైకోర్టు తీర్పునిచ్చింది’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు. ‘పిటిషనర్‌కు కుమారుడు ఉన్నారు. అతను ఉద్యోగం చేస్తున్నారు. అందుకే కారుణ్య నియామక విజ్ఞప్తిని సీపీ తిరస్కరించారు. ఫాతిమా, ఆమె భర్త ఆర్థిక పరిస్థితిని షాహీన్‌ వెల్లడించలేదు’ అని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆమె డాక్యుమెంట్లను పున్ణ పరిశీలన చేసి నిబంధన మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
రఘునందన్‌రావుపై కేసులో పోలీసులకు నోటీసులు
సిద్దిపేట్‌ జిల్లా దుబ్బాక పోలీస్‌స్టేషన్‌లో మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావుపై నమోదైన కేసు వివరాలతో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ కేసును కొట్టేయాలంటూ రఘునందన్‌రావు దాఖలైన కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తూ జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో దుబ్బాక స్టేషన్‌లోకి వచ్చి గొడవ చేశారని ఏఎస్‌ఐ ఎండీ గులామ్‌ సమ్దాని చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని పిటిషనర్‌ వాదన. దీనితోపాటే ఎన్‌. జీవన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు 2024లో దుబ్బాక పీఎస్‌లో నమోదైన కేసులో, నల్లగొండ జిల్లా పెదవూర స్టేషన్‌లో ఎంపీడీవో దుబ్బ శ్యామ్‌ ఫిర్యాదు మేరకు నమోదైన మరో కేసులోనూ కౌంటర్లు దాఖలు చేయాలని సంబంధిత పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ రూల్స్‌ మార్చడానికి వీల్లేదు
నోటిఫికేషన్‌లోని రూల్స్‌ ప్రకారమే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్మెంట్‌ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్ట్‌ నియామకం ఉండాలని అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్‌ ఇచ్చాక అందులోని నిబంధనలను మార్పు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌ ప్రకారం అర్హతలు సాధించిన తనను కాకుండా అదనపు అర్హతలు చేర్చడం ద్వారా మరొకరిని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నియమించారంటూ ఎన్‌. లావణ్య దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో విచారించిన సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుకు ఆమె అప్పీల్‌ దాఖలు చేశారు. ఆమె దరఖాస్తును తిరిగి పరిశీలన చేయాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలనే అప్పీల్‌ను యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజరు పాల్‌, జస్టిస్‌ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారించింది. సీనియర్‌ లాయర్‌ కె. లక్ష్మీనరసింహ వాదిస్తూ, నోటిఫికేషన్‌లో నిబంధనల్లో రాత పరీక్ష, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌, ఇంటర్వ్యూ అని ఉందని, అయితే ఎంపిక కమిటీ విద్యార్హతలు, పరిశోధన ప్రచురణలు, శిక్షణ వంటి అదనపు అర్హతలని చెప్పారన్నారు. దీని ప్రకారం డాక్టర్‌ శ్రీలతను ఏడీగా నియమించడం నోటిఫికేషన్‌ రూల్స్‌కు వ్యతిరేకమన్నారు. వాదనల తర్వాత ధర్మాసనం, నోటిఫికేషన్‌ రూల్స్‌ ప్రకారమే ఎంపిక ప్రక్రియ ఉండాలని తేల్చి చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన శ్రీలత ఏవిధమైన హక్కులను కోరేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img