క్రైం సినిమాలలో ఓ విభాగం కేపర్ ఫిల్మ్. దీన్నే హీస్ట్ ఫిల్మ్ అని కూడా అంటారు. ఈ రకం సినిమాలలో క్రైం ప్రణాళిక, దాన్ని అమలు చెసే విధానం, తత్ఫలితాలను నిశితంగా చిత్రీకరిస్తారు. ఈ విభాగంలో హాలీవుడ్‌లో మంచి చిత్రాలు వచ్చాయి. వాటిలో ఇప్పటికీ సినీ ప్రేమికులు ప్రస్తావించుకునే చిత్రం 1973లో వచ్చిన ‘ది స్టింగ్’.
హాలీవుడ్‌లో దిగ్గజ నటులు పాల్ న్యూమాన్, రాబర్ట్ రెడ్ఫోర్డ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఆ రోజుల్లో ప్రభంజనం సష్టించింది. ఇద్దరు ఫ్రొఫెషనల్ మోసగాళ్ళు ఓ ప్రణాళిక రచించి, మరో క్రిమినల్‌ను మోసం చేసి అతన్ని పూర్తిగా దోచుకోవడం ఈ సినిమా కథ. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది జార్జ్ రారుహిల్. డేవిడ్. ఎస్. వార్డ్ నిజజీవితంలో తాను విన్న్ ఫ్రెడ్, చార్లీ గాండ్రోఫ్ అనే ఇద్దరు ప్రొఫెషనల్ మోసగాళ్ల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాసుకున్నారు. డేవిడ్ ఔ. మౌరర్ రాసిన ‘ది బిగ్ కాన్’ అనే పుస్తకం మొదట 1940లో ప్రచురించబడింది. ఇదే ఈ చిత్ర కథకు మూలం.
ఈ సినిమా చిత్రీకరణ వినూత్నంగా ఉంటుంది. సినీ కథను చాప్టర్లుగా వేరు వేరు పేర్లతో ఇంటర్ కార్డులతో స్క్రీన్ పై చిత్రీకరించారు. ప్రతి చాప్టర్‌ను ఒక పేరుతో పాటు జరోస్లావ్ గెబ్ర్ అనే ఓ ఆర్టిస్ట్ పెన్సిల్ స్కెచ్‌లతో విడదీసి చూపిస్తూ కథను నడిపిస్తూ 1936 లలోకి ప్రేక్షకులను తీసుకెళ్లగలిగారు దర్శకులు.
ఈ సినిమాకు పది ఆస్కార్ నామినేషన్లు లభించాయి. ఉత్తమ చిత్రంతో పాటు ఏడు పురస్కారాలు అందుకుంది ‘ది స్ట్రింగ్’. అమెరికాలో సినీ రచయితలందరూ ఈ సినిమా స్క్రీన్‌ప్లేను ప్రపంచ సినిమాలోనే గొప్పదిగా గుర్తించారు.
జార్జ్ రారు హిల్ ఈ చిత్రం 1930ల నాటి చికాగో అనుభూతిని మాత్రమే కాకుండా ఆ కాలం నాటి పాత హాలీవుడ్ సినిమాలను కూడా కచ్చితంగా ప్రతిబింబించే విధంగా ఉండాలని కోరుకున్నాడు. హిల్, ఆర్ట్ డైరెక్టర్ హెన్రీ బమ్ స్టెడ్, సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ సర్టీస్‌తో కలిసి ఈ చిత్రం కోసం మ్యూట్ చేసిన బ్రౌన్, మెరూన్ రంగుల కలర్ స్కీమ్‌ను ఉపయోగించారు. కోరుకున్న దశ్య రూపాన్ని పొందడానికి పాత-కాలపు 1930ల-శైలి లైటింగ్ కోసం కొన్ని ఆధునిక ఉపాయాలతో కలిపి లైటింగ్ డిజైన్‌ను రూపొందించాడు.
ఒక జూద గృహం నుండి మరో చోటకు పదకొండు వేల డాలర్ల డబ్బు తీసుకుని ఓ వ్యక్తి వెళుతూ ఉంటాడు. ఇతని పని ఆ డబ్బు చేరవలసిన చోటుకు చేర్చడం. దారిలో ఓ నల్లజాతీయుడిని ఓ తెల్ల వ్యక్తి గాయపరిచి అతని డబ్బు దొంగలించడం ఇతను చూస్తాడు అక్కడే ఉన్న మరో వ్యక్తి నల్లజాతీయుడిని గాయపరిచిన వ్యక్తి నుండి పర్సు లాక్కుంటాడు. ఆ డబ్బును మరో చోటకు చేర్చాలని, లేదంటే తాను ప్రమాదంలో పడతానని గాయపడిన నల్లజాతి వ్యక్తి అన్నప్పుడు డబ్బును మరో జూద గృహానికి తీసుకెళ్తున్న ఆ కొరియర్ తాను నల్లజాతీయుని డబ్బును కూడా సురక్షితంగా అతను చెప్పిన చోటికి చేరుస్తానని అంటాడు. అయితే దారిలో డబ్బు కోసం ఇంతకు ముందు దాడి చేసిన దొంగ తిరిగి ఇతనిపై దాడి చేయకుండా ఆ డబ్బును ఎలా బట్టల్లోపల దాచి పెట్టుకోవాలో ఆ రెండో వ్యక్తి చూపిస్తాడు. ఆ కొరియర్ మాత్రం నమ్మించి ఆ డబ్బు అంతా కొట్టేయాలని అనుకుంటూ ఉంటాడు. ఇతను సరే అంటు జాగ్రత్తగా అవతలి వ్యక్తి చెప్పినట్లు డబ్బును దుస్తులలో దాచుకుని అక్కడి నుంచి వెళ్ళి టాక్సీ ఎక్కుతాడు. తనకు అనుకోకుండా ఐదు వేల డాలర్లు లభించాయని అతను కారులో ఆనందంగా పర్సు విప్పి చూసుకుంటే అందులో తెల్ల కాయితాలు కనిపిస్తాయి. అప్పుడు అర్ధం అవుతుంది. ఆ గాయపడిన నల్లవాడు, అతన్ని గాయపర్చిన వాడు, ఆ పర్సు పట్టుకున్న వారు ఒకే జట్టుకు చెందిన ప్రొఫెషనల్ మోసగాళ్లని, డబ్బు ఎర చూపి వారు అతని దగ్గర ఉన్న మొత్తం రొక్కం కొట్టేసారని.
నల్ల జాతీయుడి పేరు లూథర్, పర్సు పట్టుకున్న వ్యక్తి హూకర్. గాయం చేసినది జో ఎరీ. ముగ్గురూ తాము దోచుకున్న డబ్బు వాటాలు పంచుకుంటారు. తన వాటా డబ్బంతా జూదంలో హూకర్ ఒక్క రోజులో పోగొట్టుకుంటాడు. లూథర్ మాత్రం తాను ఇక ఈ వత్తి మానేస్తానని, లీగల్ వ్యాపారంలోకి వెళ్తానని ప్రకటిస్తాడు. హూకర్‌ని తన మిత్రుడు ప్రఖ్యాత ప్రొఫెషనల్ కాన్ మాన్ గాండ్రాఫ్ దగ్గరకు వెళ్లి కావల్సిన మెళుకువలు నేర్చుకొమ్మని పంపిస్తాడు లూథర్.
విలియం సైండర్ ఒక పోలీసు. కాని అడ్డ దారిలో డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇతనికి హూకర్ బందం దొంగలించినది ఓ పెద్ద మాఫియా డాన్ లానేగాన్ డబ్బు అని తెలుస్తుంది. లానేగాన్ ఆ డబ్బు దొంగలించిన వారిని పట్టుకోవడానికి కరడు గట్టిన కిల్లర్స్‌ని పంపిస్తాడు. హూకర్ వాటా డబ్బు తనకిమ్మని సైండర్ అతన్ని అడ్డగిస్తాడు. హూకర్ నకిలీ కరెన్సీని ఇచ్చి అప్పటికి తప్పించుకుని పారిపోతాడు. తమను మాఫియా వెంబడిస్తుదని లూథర్‌కి చెప్పాలని అతను ఇంటికి వస్తే, అప్పటికే జరిగిన దాడిలో లూధర్ హత్యకు గురవుతాడు. లూథర్‌ని హూకర్ తండ్రిగా భావిస్తాడు. అతన్ని రక్తపు మడుగులో చూసిన హూకర్ ఎలాగయినా లూథర్ హత్యకు బదులు తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు.
హూకర్ కోసం లానేగాన్ మనుషులు మరో పక్క గాలిస్తూ ఉంటారు. హూకర్, లూథర్ ఇచ్చిన అడ్రసు పట్టుకుని గాండ్రాఫ్‌ను కలుసుకుంటాడు. ఎప్.బి.ఐ నుండి తప్పించుకుని వేశ్యాగహం నిర్వహిస్తున్న తన ప్రియురాలి ఇంట గాండ్రాఫ్ దాక్కుని ఉంటాడు. లూథర్ చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని హూకర్ అనుకోవడం గాండ్రాఫ్‌కు నచ్చదు. అతను ఆలోచనతో అవతలి వారిని దెబ్బ కొట్టాలని నమ్మే వ్యక్తి. అందుకని ఓ గొప్ప స్ట్రింగ్ ఆపరేషన్‌ను ప్లాన్ చేస్తాడు. సిటీలో ప్రొఫెషనల్ మోసగాళ్ళను సేకరించి ది వైర్ అనే ఓ ప్రాజెక్టు మొదలెడతాడు. దీనిలో భాగంగా ఒక బెట్టింగ్ పార్లర్ నిర్వహిస్తున్నట్లు అందరూ కలిసి నటిస్తారు.
మహిళా నిర్మాతకు ఆస్కార్ అందించిన కామెడీ చిత్రం
- Advertisement -