Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలురాజ్యాంగ హక్కులు కాపాడాలి

రాజ్యాంగ హక్కులు కాపాడాలి

– మనువాదాన్ని తిప్పికొట్టాలి
– బీజేపీ విధానాలను ఎండగట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఘన నివాళి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో మనువాదాన్ని తిప్పికొట్టి, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనువాదాన్ని తిప్పికొట్టి, బీజేపీని ఒంటరి చేసే సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సామాజిక న్యాయం, లౌకిక భావాలను, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం కోసం ఈ నెల 11 నుంచి 14వరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన సభలు, కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్నే ముందుకు తెస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు కుల వివక్షకు, దాడులకు, హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల వారికి ఇప్పటికీ దేవాలయాల్లోకి ప్రవేశం లేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకుల పేదలకు కూడా రిజర్వేషన్లు అమలవుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మోడీ సర్కార్‌ ప్రయివేటుపరం చేసి, రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నదని విమర్శించారు. పేద, ధనిక వ్యత్యాసాలు కొనసాగుతున్నాయనీ, కొద్దిమంది కార్పొరేట్‌, పెట్టుబడిదారులే దేశ సంపదనం తా కొల్లగొట్టుకుపోయే విధానాలను బీజేపీ అనుసరిస్తున్నదని తప్పుపట్టారు. మహిళల మీద దాడులు, హత్యలు, లైంగికదాడులు పెరిగిపోయాయని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకోవాలనీ, ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా బీసీల జనాభా, ఆర్థిక, విద్యా వివరాలు తెలుసుకునేందుకు కులగణన జరపాలని ప్రతిపక్ష పార్టీలన్ని కోరుతున్నా బీజేపీ వ్యతిరేకిస్తున్నదని వెస్లీ ఈ సందర్భంగా విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వాగ్దానాల అమల్లో లోపాలున్నాయనీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని విమర్శించారు. గ్యారెంటీలకు కావాల్సిన నిధులను బడ్జెట్‌లో కేటాయించలేదనీ, అసైన్డ్‌ భూములను, పేదల భూములను అన్యాయంగా లాక్కుని, కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్తున్నదని ఎండగట్టారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రజలు పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇక్కడ అనుకూలం.. అక్కడ వ్యతిరేకం : కేంద్ర మంత్రులపై జాన్‌వెస్లీ ఆగ్రహం
రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజరులు … రాష్ట్రంలో కులగణనకు అనుకూలంగా మాట్లాడి, కేంద్రంలో మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి మైనార్టీల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని విమర్శించారు. వారికి నష్టం కలిగించే వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు తెచ్చారని గుర్తుచేశారు.
ఇది ముస్లింల ఆస్తులతోనే ఆగిపోదనీ, తర్వాత క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, ఇతర మతస్తుల ఆస్తులను, చివరకు హిందూ మతస్తుల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుని కార్పొరేట్లకు, దోపిడీదారులకు కట్టబెడతారని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో లౌకిక భావాలను కాపాడడానికీ, మనువాదాన్ని తిప్పికొట్టడానికీ, రాజ్యాంగ హక్కులను నిలబెట్టుకోవడం కోసం లౌకిక శక్తులన్నీ ఏకం కావాలనీ, బీజేపీని ఒంటరి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నేత చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మహ్మద్‌ అబ్బాస్‌, ప్రజాసంఘాల నాయకులు ఎం.వి.రమణ, ఉడత రవీందర్‌, మూడ్‌ శోభన్‌, కోట రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img