Wednesday, May 21, 2025
Homeతాజా వార్తలుసామాన్యులకు అర్థమయ్యేలా భూ భారతి

సామాన్యులకు అర్థమయ్యేలా భూ భారతి

- Advertisement -

– క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించండి
– మండల సదస్సులకు కలెక్టర్లు హాజరుకావాలి
– ఇన్‌చార్జి మంత్రుల ఆమోదం తర్వాతే ఇందిరమ్మ ఇండ్ల జాబితా
– తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయండి : కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ‘భూ భారతి’ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. దీనికోసం జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ప్రతి మండలంలోనూ సదస్సులు ఏర్పాటు చేసి, కలెక్టర్లు తప్పనిసరిగా వాటిలో పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో అధ్యయనంతో భూ భారతి చట్టాన్ని తెచ్చామని తెలిపారు. మండల సదస్సుల్లో రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్ధమయ్యే భాషలో వివరించి పరిష్కారం చూపాలన్నారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (ఎమ్‌సీహెచ్చార్డీ) సోమవారం భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, వేసవి తాగు నీటి ప్రణాళికలపై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాల యంత్రాంగానికి సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. భూ భారతి, ఇందిరమ్మ ఇండ్ల ప్రధాన్యతను వారికి వివరించారు. ఈ రెంటినీ క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి, విజయవంతం చేయడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. భూ భారతి చట్టాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పారు. గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులను న్యాయస్థానాలకు పంపారని గుర్తుచేశారు. భూభారతి చట్టంలో రెవెన్యూ యంత్రాంగమే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందనీ, అప్పటికీ సంతృప్తి చెందకుంటే అప్పీల్‌ వ్యవస్థ ఉన్నదనే విషయాన్ని రైతులు, ప్రజలకు వివరించాలని తెలిపారు. భూ భారతి పైలెట్‌ ప్రాజెక్టు సదస్సులను నారాయణపేట జిల్లా మద్దూర్‌, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలాల్లో నిర్వహిస్తారనీ, వాటిలో కలెక్టర్లు కచ్చితంగా పాల్గొనాలని చెప్పారు. ఆయా మండలాల్లోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సదస్సులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు కూడా హాజరువుతారని చెప్పారు.
నియోజకవర్గానికో ప్రత్యేకాధికారి
ఇందిరమ్మ ఇండ్ల్ల కమిటీలు ఆమోదం పొందిన జాబితా ను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సీఎం సూచిం చారు. ఆ కమిటీల పరిశీలన అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రికి పంపాలనీ ఆయన ఆమోదించాకే ఇండ్ల జాబితా ఖరారవుతుందని స్పష్టంచేశారు. ఈ ప్రక్రియ సక్రమంగా పూర్తి చేసేందుకు ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఆ ప్రత్యేకాధికారి ఇందిరమ్మ కమిటీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్‌ఛార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ఉంటారని చెప్పారు.
తాగు నీటి సమస్య రావద్దు
వేసవి కాలంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. దీనికోసం నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. కలెక్టర్లు డ్యాష్‌ బోర్డు ద్వారా ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు, సరఫరాపై పర్యవేక్షణ చేయాలనీ, నీటి ఎద్దడి ఏర్పడితే దాని పరిష్కారానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పలు గ్రామాలకు తాగు నీటి సరఫరా పైపులైన్ల వ్యవస్థ లేదనీ, అనేక ఇండ్లకు నల్లాలు కూడా లేవన్న విషయాలని అధికారులు గమనంలో ఉంచుకోవాలని చెప్పారు.కోయ గూడేలు, చెంచు పెంటలు, ఇతర గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. పైపులైన్లు, మోటార్ల మరమ్మతులు, బోర్ల రిపేర్లకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్లకు నిధులు కేటాయించామని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మోటార్లు కాలిపోయినా, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా జిల్లా కలెక్టర్లు వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, షబ్బీర్‌ అలీతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, పాల్గొన్నారు.
చర్యలు తప్పవు…
ఇండ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దనీ, ఎక్కడైనా అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే మండల స్థాయి కమిటీ, ప్రత్యేకాధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించినందున, జనాభా ప్రాతిపదికన, ఆయా గ్రామాలకు ఇండ్ల కేటాయింపు ఉండాలనీ, ఈ విషయంలో హేతుబద్ధత పాటించాలని సీఎం స్పష్టం చేశారు. నిర్దేశిత సమయం ఆధారంగా ఇండ్ల నిర్మాణాలు సాగించాలనీ, దీనికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -