Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలు'అంగన్‌వాడీ'లకు ఎండదెబ్బ

‘అంగన్‌వాడీ’లకు ఎండదెబ్బ

– చిన్నపిల్లలు వచ్చే కేంద్రాలకు వేసవి సెలవుల్లేవు
– మండుటెండలో వెళ్లేందుకు గర్భిణులు, బాలింతల విముఖత
– పౌష్టికాహారానికి అవస్థలు
– అద్దె భవనాలే ఎక్కువ.. అందులోనూ అరకొర వసతులే..
– కొన్నిచోట్ల కరెంటు కనెక్షనూ.. ఫ్యాన్లూ లేని వైనం
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటలకే సూరీడు సుర్రుమంటూ తన ప్రతాపం చూపుతున్నాడు. ఏప్రిల్‌ చివరి వారంలోనే రాష్ట్రమంతటా సరాసరి 45డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదువుతుండగా.. ఇప్పటికే సగానికిపైగా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలన్నింటికీ వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు వచ్చే అంగన్‌వాడీలకు మాత్రం సెలవులివ్వలేదు. మండుటెండ లో ఆయా కేంద్రాలకు వచ్చేందుకు వారు జంకు తుండగా.. వచ్చిన వారంతా కనీస సౌకర్యాలు లేక ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులిచ్చి.. పౌష్టికాహారం ఇండ్లకే సరఫరా చేసే అవకాశం కల్పించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో మొత్తం 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా.. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 99, పట్టణ ప్రాంతాల్లో 25, గిరిజన ప్రాంతాల్లో 25 ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 31,711 ప్రధాన, 3,989 మినీ కేంద్రాలు కలుపుకుని మొత్తం 35,700 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. ఈ కేంద్రాలకు ప్రతిరోజూ గర్భిణులు, తల్లులు 4,57,643 మంది వస్తుండగా.. ఏడు నెలల నుంచి మూడేండ్లలోపు పిల్లలు 10,34,562 మంది వస్తున్నారు. మూడేండ్ల నుంచి ఆరేండ్లలోపు పిల్లలు 6,67,783 మంది వస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా వరకు పరిశీలిస్తే.. మొత్తం 777 కేంద్రాల్లో 9650 మంది చిన్నారులు, గర్భిణులు 3620, బాలింతలు 4వేల మంది వస్తున్నారు. జిల్లాలో 307 కేంద్రాలకే సొంత భవనాలు ఉండగా.. 221 కేంద్రాలు అద్దె భవనాల్లో, 119 కేంద్రాలు ఇతర భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో విద్యుత్‌ సరఫరా లేని కేంద్రాలు 125 వరకు ఉండగా, విద్యుత్తు ఉన్నా ఫ్యాన్లు లేని కేంద్రాలు 100 వరకు ఉన్నట్టు అంగన్‌వాడీల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకుగాను 23,385 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 12,315 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
కనీస సౌకర్యాల్లేక అవస్థలు
సొంత భవనాలు ఉన్న చాలా కేంద్రాల్లో విద్యుత్‌ కనెక్షన్‌ లేదు. విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్న చోట కనీసం ఫ్యాన్లు కూడా లేవు. దీంతో చిన్నారులు, టీచర్లు, ఆయాలతోపాటు ‘ఆరోగ్య లక్ష్మి’ కింద భోజనం చేయడానికి వచ్చే గర్భిణులు, తల్లులు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు ఎండ భయానికి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కేంద్రాలకు పంపడానికి ఇష్టపడటం లేదు. గర్భిణులు ఎండలో కేంద్రానికి వెళ్లి భోజనం చేయాలంటే జంకుతున్నారు. ఒకవేళ టీచర్‌ సెలవులో ఉంటే ‘ఆయా’ పిల్లల ఆలనా, పాలనా చూడటంతోపాటు వంట చేసి భోజనం పెట్టాలి. ఆయా సెలవులో ఉంటే టీచరే వంట చేయాలి. పిల్లల్ని చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో పని భారం కూడా ఎక్కువై సిబ్బంది అల్లాడిపోతున్నారు.
ఇంటికి అందిస్తే మేలు
ఎండలు తగ్గేవరకూ పిల్లలు, తల్లులు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని ఇంటికే సరఫరా చేయడం సబబుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎండలు తగ్గే వరకు కనీసం నెల  రోజులపాటు పౌష్టిహారాన్ని ముందుగానే అందించాల్సిన అవసరం ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉక్కపోతతో, తరువాత ఇంటికి ఎండలోనే వెళ్లాల్సి ఉన్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

అవసరమైన చర్యలకు ప్రతిపాదనలు పంపాం..
తల్లులకు, గర్భిణులకు, పిల్లలకు 365 రోజులు పౌష్టికాహారం ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న క్రమంలో, కేంద్రాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి మే 1 నుంచి 15 రోజులు టీచర్‌కి, మరో 15రోజులు ఆయా విధులు నిర్వహించేలా ఉత్తర్వులు వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కేంద్రాలను నడిపిస్తున్నాం. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఉదయం పూట ఆటపాటలతో చదువు చెప్పి భోజనం పెట్టిన అనంతరం ఇంటికి పంపించేలా చూస్తున్నాం.
– సరస్వతి, జిల్లా సంక్షేమాధికారి, కరీంనగర్‌


ఇంటికే పౌష్టికాహారం ఇచ్చే వెసులుబాటు ఇవ్వాలి
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రాలకు పిల్లలను పంపేందుకు తల్లిదం డ్రులు నిరాకరి స్తున్నారు. గర్భిణులు, బాలింతలు కూడా వచ్చేందుకు జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో నెలకు సరిపడా పౌష్టికాహార సరుకులు వారి ఇండ్లకే వెళ్లి ఇచ్చేలా వెసులుబాటు కల్పించాలి.
-పద్మశ్రీ, అంగన్‌వాడీ టీచర్‌, దుర్శేడ్‌

వేసవి సెలవులు ఇవ్వాలి
స్కూల్‌, కాలేజీలకు వెళ్లే పెద్ద పిల్లలకు సెలవులు ఇస్తున్నారు. చిన్నపిల్లలు వచ్చే అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవ్వరా? ఎండ తీవ్రతకు కేంద్రాలకు పిల్లల్ని పంపడం లేదు. వేసవి కాలంలో వారి ఇండ్లకే పౌష్టికాహారం ఇచ్చేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలి.
– ఆడపెల్లి మంగ, అంగన్‌వాడీ టీచర్‌, మారుతినగర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img