Tuesday, April 29, 2025
Homeమానవిఅట్లాంటిక్‌ను జ‌యించిన తొలి మ‌హిళ‌

అట్లాంటిక్‌ను జ‌యించిన తొలి మ‌హిళ‌

అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా సోలో రోయింగ్‌ చేసిన తొలి నల్లజాతి మహిళ అనన్య ప్రసాద్‌. 34 ఏండ్ల ఆమె ఈ ప్రయాణాన్ని 52 రోజుల 5 గంటల 44 నిమిషాల్లో పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్స్‌ టఫెస్ట్‌ రో రేసులో సోలో విభాగంలో రెండవ స్థానాన్ని సంపాదించారు. ఆమె సాధించిన ఈ విజయం సాహస క్రీడల ప్రపంచంలో ఒక మైలురాయిగా నిలిచింది. పట్టుదల, ధైర్యం, దృఢ సంకల్పానికి శక్తివంతమైన నిదర్శనంగా నిలిచిన ఆమె పరిచయం…
బెంగళూరులో పుట్టిన అనన్య వైద్యులైన తన తల్లిదండ్రులతో కలిసి ఐదేండ్ల వయసులో యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు వెళ్లింది. ఆ కుటుంబం అక్కడే స్థిరపడింది. పెరిగేకొద్దీ అనేక కొత్త ప్రదేశాలు చూశారే కానీ సాహస క్రీడల్లో అనుభవం లేదు. అయినప్పటికీ ఆమె ఎల్లప్పుడూ కొత్త, సవాలుతో కూడిన కార్యకలాపాలను ప్రయత్నించాలనే బలమైన ఉత్సుకతను కలిగి ఉండేవారు. ఆమె సాహసోపేతమైన ప్రయాణం ఆమెను బైకింగ్‌, కయాకింగ్‌ను కొనసాగించేలా చేసింది. కానీ 2018లో అట్లాంటిక్‌ రోయింగ్‌ ఈవెంట్‌ను చూసే వరకు ఆమె ఎప్పుడూ ఆలోచించనిది ఓషన్‌ రోయింగ్‌. అక్కడే ఆమె జీవితం ఓ మలుపు తిరిగింది.
అడ్డంకులు బద్దలు కొట్టేందుకు
ఒంటరిగా సముద్రంలో రోయింగ్‌ చేయాలనే ఆలోచన ఆమెను ఆకర్షించింది. ప్రపంచంలోనే అత్యంత సవాళ్లలో ఒకటిగా పరిగణించబడే దాన్ని చేపట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె ప్రయాణం కేవలం తన సొంత పరిమితులను పరీక్షించుకోవడం గురించి మాత్రమే కాదు. అనన్య ఒక పెద్ద ఉద్దేశ్యంతో కొనసాగారు. సాహస క్రీడలలో మహిళలకు, ముఖ్యంగా నల్లజాతి మహిళలకు అడ్డంకులను బద్దలు కొట్టడం, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఆమె ముఖ్య ఉద్దేశ్యం. అలాగే మైసూర్‌లోని దీనబంధు ట్రస్ట్‌, పిల్లల వసతి గృహం, పాఠశాలతో పాటు యూకే ఆధారిత మానసిక ఆరోగ్య స్వచ్ఛంద సంస్థకు మద్దతు ఇచ్చేందుకు ఆమె అంకితం అయ్యారు.
పరిస్థితులను ఎదుర్కొంటూ
సాహస క్రీడను కేవలం ఆమె తన వ్యక్తిగత అభివృద్ది కోసం మాత్రమే ఎంచుకోలేదు. మహిళలు తమ పరిధికి మించిన సవాళ్లను కొనసాగించమని ప్రోత్సహించడానికి ఒక వేదికగా మలుచుకున్నారు. ‘ధైర్యం అంటే మీరు విఫలమవుతారని మీరు అనుకున్నప్పుడు కూడా ప్రయత్నించడం’ అని ఆమె అంటారు. కంఫర్ట్‌ జోన్‌ నుండి బయటపడటం అసాధ్యాన్ని సాధించడానికి మొదటి అడుగు అని నొక్కి చెబుతున్నారు. అట్లాంటిక్‌ క్యాంపెయిన్స్‌ వరల్డ్స్‌ టఫెస్ట్‌ రోలో భాగంగా అనన్య డిసెంబర్‌ 11న తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇది ఒంటరిగా సముద్రాన్ని దాటడంలో ఉన్న అపారమైన శారీరక, మానసిక పరీక్షలను భరించడానికి ఇష్టపడే వ్యక్తులను స్వాగతించే ఒక వ్యవస్థీకృత రేసు. దాదాపు రెండు నెలల పాటు ఆమె అట్లాంటిక్‌ మీదుగా వేల కిలోమీటర్లు పడవలో ప్రయాణించారు. ఆమె తనలోని బలం, ఓర్పు, స్థితిస్థాపకతను పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారు.
విశాలమైన సముద్రంలో ఒంటరిగా
ఆమె క్రిస్మస్‌తో పాటు నూతన సంవత్సర వేడుకలను ఏకాంతంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని యూకే సెలవుదినమైన మిన్స్‌ పైస్‌, మల్లేడ్‌ వైన్‌తో ఆమె గుర్తించారు. పండుగకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె దాన్ని తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అనుభవాలలో ఒకటిగా అభివర్ణించారు. ‘నేను 2024 చివరి రోజును అట్లాంటిక్‌ మధ్యలో గడిపాను అనేది మనోహరంగా ఉంది. సముద్రం మీదుగా ఒంటరిగా పడవలో ప్రయాణించడం భయంకరమైన సవాళ్లను నాకు అందించింది. శారీరక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ రోజుకు సగటున 10-15 గంటలు పడవలో ప్రయాణించాను, 3-4 గంటల విశ్రాంతి తీసుకున్నాను, ఐదు గంటలు నిద్రపోయాను’ అని ఆమె పంచుకున్నారు. 25 అడుగుల ఎత్తున్న అలలు, ఎడతెరిపిలేని ఎదురుగాలులు, విపరీతమైన అలసట ఆమె దైనందిన కష్టాల్లో భాగంగా ఉండేవి.
బాధాకరణమైన సంఘటన
ఆమె ప్రయాణంలో అత్యంత బాధాకరమైన క్షణాలలో ఒకటి.. ఒకసారి పడవ చుక్కాని విరిగిపోయి ఒక రోజంతా నియంత్రణ కోల్పోయింది. సమస్యను పరిష్కరించడానికి ఆమె సముద్రంలోకి దూకి విరిగిన భాగాన్ని వెదికి తెచ్చుకున్నారు. సముద్ర నీటితో పోరాడుతూ కొత్త చుక్కానిని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఆమెలోని సాంకేతిక నైపుణ్యానికి, అచంచలమైన మానసిక సంకల్పానికి, స్వచ్ఛమైన మనుగడకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి తీవ్రమైన సవాలుకు సిద్ధం కావడానికి ఏండ్ల పాటు కఠినమైన శిక్షణ అవసరం. తన ప్రయాణాన్ని తట్టుకోవడానికి అవసరమైన శారీరక బలం, ఓర్పు, సాంకేతిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అనన్య మూడేండ్లకు పైగా శిక్షణ తీసుకున్నారు. శారీరక శిక్షణ కష్టతరమైనప్పటికీ సముద్ర నావిగేషన్‌, పరికరాల నిర్వహణ, అత్యవసర ప్రోటోకాల్‌లకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం మరింత క్లిష్టమని ఆమె గుర్తించారు. నాటికల్‌ క్రీడలతో ముందస్తు అనుభవం లేకపోవడం వల్ల ఆమె మొదటి నుండి ప్రతిదీ నేర్చుకోవాల్సి వచ్చింది.
భయం అడ్డంకి కారాదు
లోతైన సముద్ర నీటిలో భయం ఉన్నప్పటికీ అనన్య ముందుకు సాగారు. గొప్ప విజయాన్న సాధించడానికి భయం అడ్డంకి కానవసరం లేదని నిరూపించారు. ‘నేను సాధించగలిగినప్పుడు ఎవరైనా దీన్ని చేయగలరు. ఇది 100 శాతం సాధ్యమే’ అని అంటున్న ఆమె మాటల్లో సంకల్పం, ధైర్యం ఏదైనా అడ్డంకిని అధిగమించగలననే తన నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. ఆమె విజయం కేవలం వ్యక్తిగత విజయం కంటే ఎక్కువ. ఇది సాహస క్రీడలను స్వీకరించడానికి, సామాజిక పరిమితులను దాటి వెళ్ళడానికి ఎక్కువ మంది మహిళలకు పిలుపునిచ్చింది. ఆమె రేసులోని సోలో విభాగంలో ఉన్న ఏకైక మహిళ. ఇటువంటి సాహస క్రీడలలో లింగ అసమానతను హైలైట్‌ చేసింది. అటువంటి రంగాలలో ఎక్కువ మంది మహిళల భాగస్వామ్యం కోసం ఆమెను మరింత ప్రేరేపించింది.
అట్లాంటిక్‌ను జయించిన తర్వాత
అనన్య ఇప్పటికే తన తదుపరి సాహసం కోసం ఎదురు చూస్తున్నారు. రోయింగ్‌, పర్వతారోహణ లేదా ఇతర సాహస సవాళ్ల ద్వారా అయినా, ప్రజలు తమ కలలను నిర్భయంగా కొనసాగించ డానికి ప్రేరేపించబడాలని ఆమె ఆశిస్తున్నారు. తన ప్రయాణం ద్వారా శారీరక, మానసిక సరిహ ద్దులను అధిగ మించవచ్చని మాత్రమే కాకుం డా ప్రాతి నిధ్యం ముఖ్యమని కూడా ఆమె నిరూపించారు. మహిళలు ముఖ్యంగా నల్లజాతి మహిళలు, ప్రపంచంలోని అత్యంత వెనుక బడిన జాతులతో సహా ఎవరైనా విజయాలు సాధించగలరని తేల్చి చెప్పారు. ఆమె కథ స్థితి స్థాపకత, ధైర్యం, మానవ సంకల్పం అనంత మైన సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రికార్డులను బద్దలు కొట్టడంలో ఆమె అడ్డంకులను కూడా బద్దలు కొట్టారు. భవిష్యత్‌ తరాల సాహసికులు కలలు కనే ధైర్యం చేయడానికి మార్గం సుగమం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img