Tuesday, April 29, 2025
Homeజాతీయంఅది 'ఓటమి కూటమి'

అది ‘ఓటమి కూటమి’

– ఏఐఏడీఎంకే- బీజేపీది నమ్మకద్రోహ అలయన్స్‌
– రాష్ట్ర ప్రజలు దీన్ని సహించరు :  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌
చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఇందులో భాగంగా అక్కడి ప్రధాన ప్రతిపక్షం ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)తో బీజేపీకి మళ్లీ పొత్తు చిగురించింది. ఏఐఏడీఎంకే- బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ కూటమిని ‘ఓటమి కూటమి’గా ఆయన అభివర్ణించారు. తమిళనాడుకు ద్రోహం చేసే ‘నమ్మక ద్రోహ కూటమి’ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ సహించరని అన్నారు. ఏఐఏడీఎంకేతో పొత్తు నేపథ్యంలోనే కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా శుక్రవారంనాడు తమిళనాడుకు వెళ్లిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి స్పందనగానే స్టాలిన్‌ తాజా వ్యాఖ్యలు చేశారు. ”ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమి ఓటమి కూటమి. ఈ ఓటమిని తమిళనాడు ప్రజలు పదేపదే భరించారు. అయినప్పటికీ అమిత్‌షా ఈ విఫలమైన కూటమిని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. ఏఐఏడీఎంకే-బీజేపీలను ఒక కూటమిగా ఏర్పాటు చేయాలనేది ఆయన ఎంపిక అయినప్పటికీ.. ఈ కూటమి ఎందుకు ఏర్పడిందో.. ఏ సైద్ధాంతిక పునాదిపై ఏర్పడిందో ఆయన స్పష్టం చేయలేదు” అని స్టాలిన్‌ అన్నారు.
నీట్‌ పరీక్ష, త్రిభాషా విధానంతో హిందీని బలవంతంగా రుద్దడం, వక్ఫ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఏఐఏడీఎంకే గతంలో ప్రకటించింది. కానీ నిన్న అమిత్‌షాతో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ వీటి గురించి మాట్లాడ లేదు. రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే మీడియా సమావేశాన్ని ఉపయోగించుకున్నట్టు అర్థమవుతున్నదని స్టాలిన్‌ అన్నారు. అధికార దాహంతో ఉన్న ఈ కూటమి రాష్ట్ర హక్కుల్ని కాపాడడంలోనూ, తమిళ సంస్కృతిని పరిరక్షించడం వంటి ఆదర్శాలకు వ్యతిరేకమని ఆరోపించారు. ”మీడియా సమావేశంలో నీట్‌ అంశంపై జర్నలిస్టులు అమిత్‌షాని పదేపదే ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇవ్వలేకపోయాడు. నీట్‌ కారణంగా తమిళనాడులో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అమిత్‌ షా ఏం సమాధానం చెబుతారు? ఐదు రాష్ట్రాల్లో నీట్‌ సంబంధిత కుంభ కోణాలపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోందనీ, ఈ కేసుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులను అరెస్టు చేశారని ఆయనకు తెలుసా?” అని స్టాలిన్‌ ప్రశ్నించారు. తమిళనాడులో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని డీఎంకే ప్రభుత్వంపై అమిత్‌ షా చేసిన విమర్శల పైనా స్టాలిన్‌ కౌంటర్‌ ఇచ్చారు. తమిళనాడు.. మణిపూర్‌ కాదని స్టాలిన్‌ గుర్తుచేశారు. ఏఐఏడీఎంకే నేతలు.. వారి బంధువులపై రెండుసార్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహించడంతోనే ఈ పొత్తుకు అంగీకరించినట్టు తమిళనాడు ప్రజలకు బాగా తెలుసని సీఎం అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img