– నేటి నుంచి ఖమ్మంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఐదవ మహాసభలు
– భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహణ
– తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి
– హాజరుకానున్న 450 మంది ప్రతినిధులు
– నూతన విద్యావిధానంపై పోరాటానికి పిలుపు
– ఉద్యమ కార్యాచరణకు మహాసభల్లో ప్రణాళిక
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అధ్యయనం.. పోరాటం.. నినాదంగా.. విద్యా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా.. ఉద్యమాల గడ్డ మీదుగా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) సమాయత్తం అవుతోంది. ఖమ్మం కేంద్రంగా శుక్రవారం నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభల నిర్వహణకు భక్తరామదాసు కళాక్షేత్రం ఆహ్వానం పలుకుతోంది. 450 మంది ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ నేతృత్వంలో ఆహ్వానసంఘం సిద్ధమైంది. శుక్ర, శని, ఆదివారం మూడు రోజులపాటు కొనసాగే ఈ మహాసభల ప్రాంగణానికి ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా మాజీ అధ్యక్షులు సీతారాం ఏచూరి నగర్‌గా నామకరణం చేశారు.
నేడు మహాప్రదర్శన.. బహిరంగ సభ
మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులతో పాటు విద్యార్థులతో మహాప్రదర్శన, బహిరంగ సభను నిర్వహించేందుకు నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఖమ్మం జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలై వైరా రోడ్డు మీదుగా భక్తరామదాసు కళాక్షేత్రం వరకు ఈ ప్రదర్శన సాగుతుంది. కళాక్షేత్రంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జెండా ఆవిష్కరించాక.. మహాసభ ప్రారంభమవుతుంది. ఈ మహాసభలకు అతిథులుగా ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను, ప్రముఖ సినీ నటులు మాదాల రవి, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్, ప్రముఖ వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, విద్యావేత్తలు మువ్వా శ్రీనివాసరావు, రవిమారుత్, ఐవీ రమణారావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం.పూజ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.సుధాకర్, తుడుం ప్రవీణ్ హాజరవుతున్నారు.
నగరమంతా ఎస్‌ఎఫ్‌ఐ..
ఖమ్మం నగరమంతా ఎస్‌ఎఫ్‌ఐ నినాదాలు, మహాసభ ల వాల్‌రైటింగ్స్, తోరణాలు, వాల్‌పోస్టర్లు, హౌర్డింగ్స్, ఫ్లెక్సీలతో ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతోంది. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖమ్మంలో మహాసభలు నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలకు ఖమ్మం ఆతిథ్యం ఇస్తోంది. కాబట్టి ఆ స్థాయిలో ఏర్పాట్లు ఉండేలా ఆహ్వానసంఘం అన్ని చర్యలు తీసుకుంది.
భవిష్యత్తు కర్తవ్వాలపై చర్చ
నేటి నుంచి మూడ్రోజుల పాటు నిర్వహించే ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఐదో మహాసభలకు 33 జిల్లాలు, యూనివర్శిటీల నుంచి 450 మంది వరకు ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ మహాసభల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు స్పష్టం చేశారు. నాల్గవ మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు నిర్వహించామన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా అదేబాటలో పయనిస్తోందని విమర్శించారు. ఎన్నికల వాగ్దానాల్లో ఈ ప్రభుత్వం 15శాతం విద్యారంగానికి కేటాయిస్తామని హామీ ఇచ్చి కేవలం 7.2శాతం మాత్రమే నిధులు ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు. మండలానికి ఓ సమీకృత పాఠశాల, ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామన్న హామీ హామీగానే ఉందని తెలిపారు. విద్యా భరోసా కింద విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రూ.5లక్షల గ్యారంటీ కార్డు ఇస్తామన్నారని, కానీ దాని ఊసేలేదని అన్నారు. యూనివర్సిటీలకు నిధులు ఇవ్వట్లేదని, స్కిల్డ్ యూనివర్సిటీ పేరుతో ఆనంద్ మహేంద్ర, అదానీ లాంటి కార్పొరేట్ల చేతుల్లో రూ.వేల కోట్లు పెడుతున్నారని, ఉన్న యూనివర్సిటీల్లోనే స్కిల్‌ను పెంచే కోర్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాకేంద్రీకరణకు యత్నాలను విరమించుకోవాలని ఈ మహాసభ ద్వారా డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు. విద్యాకమిషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ (టీఎఫ్‌ఎస్)ను నిర్మించారు. సుమారు 5వేల మందికిపైగా విద్యార్థులను ఈ స్కూల్‌లో చేర్పించే విద్యాకేంద్రీకరణ యత్నాలను విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తోంది. నూతన విద్యావిధానం అమల్లో భాగంగా చేసే ఇటువంటి చర్యలను వెనక్కు తీసుకోవాలని ఈ మహాసభలో తీర్మానం చేయనున్నారు.
ప్రయివేటు, కార్పొరేట్ స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని, పెండింగ్ స్టడీఫండ్స్‌ను రిలీజ్ చేయాలని, విద్యార్థిసంఘాల ఎన్నికలు నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి, నిధులు ఇవ్వాలనే పలు తీర్మానాలూ చేయనున్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు ప్రయివేటు యూనివర్శిటీలోనూ రిజర్వేషన్లు కల్పించాలనే తీర్మానాలను ఈ ఐదవ మహాసభల్లో చేస్తారు.
అధ్యయనం..పోరాటం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES