– 70 దేశాల దౌత్యాధికారులకు బ్రీఫింగ్
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మన సైన్యం ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై రక్షణ నిఘా సంస్థ డీజీ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ రాణా 70 దేశాల దౌత్యాధికారులకు వివరించారు. లక్ష్యాల ఎంపిక ప్రక్రియ, భారత శక్తి సామర్థ్యాల ప్రదర్శన తదితర అంశాలను తెలియజేశారు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రత్యర్థులు చేసిన తప్పుడు ప్రచారాన్ని, దానివల్ల ప్రాంతీయ స్థిరత్వంపై గల ప్రభావాన్ని విశదీకరించారు. అలాగే ఆ తప్పుడు సమాచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరును వెల్లడించారు.
ఉగ్ర ముఠాలకు అండగా ఉంటూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’తో శత్రుదేశాన్ని అన్ని విధాలా దెబ్బతీశాక.. ఇప్పుడు దాయాదిపై ద్వైపాక్షికంగా ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని రక్షణశాఖ కార్యాలయంలో కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు దేశాల అధికారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చింది.
నేడు కేంద్ర క్యాబినెట్
బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతాప రంగా అనుసరించాల్సిన వ్యూహాలు, సైనిక సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నట్టు తెలుస్తోం ది. మరోవైపు విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులతోనూ ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను కేంద్రం పంచు కోనుంది. మే 19వ తేదీన పార్లమెంటరీ కమిటీ చైర్మెన్ శశిథరూర్ నేతృత్వం లో సమావేశం జరగనుంది. ఇందులో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. ‘సిందూర్’ వివరాలను సభ్యులకు వెల్లడించనున్నారు.