నన్‌లను కలుసుకునేందుకు వామపక్ష ప్రతినిధి బృందానికి అనుమతి నిరాకరణపై సీపీఐ(ఎం) ఖండన
న్యూఢిల్లీ : కల్పిత ఆరోపణలపై చత్తీస్‌ఘడ్ జిఆర్‌పి బలగాలు అరెస్టు చేసిన నన్‌లను కలుసుకోవడానికి సీపీఐ(ఎం), సీపీఐ, కేసీ(ఎం)ల నేతలతో కూడిన ప్రతినిధి బృందానికి దుర్గ్ జైలు పాలనాయంత్రాంగం అనుమతి నిరాకరించడాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. పారదర్శకతను, జవాబుదారీతనాన్ని, వ్యక్తుల హక్కులను అణచివేసే ప్రయత్నమిదని, ఇది ఎంత మాత్రమూ సమర్ధనీయం కాదని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతినిధి బృందంలో సీపీఐ(ఎం) నేత బృందాకరత్, ఎంపీలు కె.రాధాకృష్ణన్, ఎ.ఎ.రహీమ్, సీపీఐ నేత అనీ రాజా, ఎంపి పి.పి.సునీర్, కేరళ కాంగ్రెస్ (ఎం) నేత, ఎంపి జోస్ కె.మణి వున్నారు.
అరెస్టయిన నన్‌లను కలుసుకోవడానికి ముందుగానే రాతపూర్వకంగా అనుమతి కోరినప్పటికీ పేలవమైన కారణాలతో మంగళవారం ప్రతినిధి బృందానికి అనుమతి నిరాకరించారు. తీవ్రంగా దీనిపై నిరసన తెలియచేయడంతో బుధవారం వారిని కలుసుకోవడానికి అనుమతి మంజూరు చేశారని పొలిట్‌బ్యూరో ప్రకటన పేర్కొంది. రాజకీయ నేతలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు నన్‌లను సందర్శించడానికి, నిర్బంధంలో వున్న వారి పరిస్థితిని అంచనా వేయడానికి తొలుత అనుమతిని నిరాకరించడమనేది, అనుసరిం చాల్సిన ప్రక్రియ పట్ల, మానవ హక్కుల పట్ల ప్రభుత్వం యొక్క ఆందోళనకరమైన నిర్లక్ష్యాన్ని మరింత నొక్కిచెబు తోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య సూత్రాలపై ప్రత్యక్షంగా దాడి జరపడమే కాగలదు, అలాగే విచారణను అణచివేయడానికి, అసమ్మతి వాణిని వినిపించే వారి గొంతు నొక్కివేయడానికి ఉద్దేశించినవేనని ఆ ప్రకటన విమర్శించింది. కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి నేతృత్వంలో గల ప్రభుత్వాల నిరంకుశ స్వభావాన్ని ఈ చర్యలు నొక్కి చెబుతున్నాయని పేర్కొంది. నన్‌లపై మోపిన అభి యోగాలు నిరాధారమైనవని, వారి ప్రాధమిక హక్కులను దారుణంగా ఉల్లంఘిస్తున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. నన్‌లను అరెస్టు చేయడమనేది ఇక్కడ ఒక్క చోట జరిగిన సంఘటనగానే చూడలేమని, మత స్వేచ్ఛను దెబ్బతీసే, మైనారిటీ కమ్యూనిటీలను వేధించే విస్తృత ధోరణిలో భాగంగా చూడాల్సి వుందని పేర్కొంది. ఈ అరెస్టులో కూడా ఒక ధోరణి కనిపిస్తోందని, భజరంగ్ దళ్ ఆదేశాల మేరకే ఇది జరిగిందని పేర్కొంది. మన రాజ్యాం గంలో పొందుపరిచినట్లుగా స్వేచ్ఛగా, శాంతియుతంగా ప్రతి ఒక్కరూ తమ విశ్వాసాన్ని ఆచరించే హక్కును ఎంతటి వ్యయ ప్రయాసలకోర్చి అయినా పరిరక్షించాలని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది.
ఇదేనా ప్రజాస్వామ్యం ?
- Advertisement -
- Advertisement -