Tuesday, April 29, 2025
Navatelangana
Homeఎడిట్ పేజిఉక్రెయిన్‌ విభజన? యుద్ధానికి ఆ ముగ్గురే కారణమన్న ట్రంప్‌!

ఉక్రెయిన్‌ విభజన? యుద్ధానికి ఆ ముగ్గురే కారణమన్న ట్రంప్‌!

- Advertisement -

ఉక్రెయిన్‌ పోరులో మిలియన్ల మంది మరణించారంటే దానికి ఆ ముగ్గురే కారణం, తనకేం సంబంధం లేదంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌! సోమవారం నాడు ఓవల్‌ ఆఫీసులో విలేకర్లతో మాట్లాడుతూ ‘జో బైడెన్‌, జెలెన్‌స్కీ సమర్ధులై ఉంటే యుద్ధానికి అవకాశం ఉండేది కాదు, పుతిన్‌ ప్రారంభించి ఉండేవాడే కాదు’ అన్నాడు. జెలెన్‌స్కీ గురించి అడగ్గా ”యుద్ధాన్ని ప్రారంభిస్తున్నావంటే నువ్వు గెలవగలవా లేదా అనేది తెలుసుకోవాలి, నీకంటే ఇరవై రెట్లు పెద్దవారి మీద యుద్ధం ప్రారంభించకూడదు, ఆ తర్వాత కొన్ని క్షిపణులు ఇస్తారని జనాల మీద ఆశ పెట్టుకోకూడదు, ఎంతసేపూ ఎప్పుడు అమెరికా క్షిపణులు అమ్ముతుందా అని ఎదురుచూస్తున్నారు, అక్కడికీ ముందు నేనే జావెలిన్‌ క్షిపణులు ఇచ్చాను. యుద్ధ కారకుల్లో పుతిన్‌ మొదటివాడు, రెండోవాడైన జో బైడెన్‌ గురించి చెప్పాలంటే ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు, జెలెన్‌స్కీ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు, నా వరకైతే యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తా, ఆపగలను, అదే నేను కోరుకుంటున్నా, చావులను ఆపాలని కోరుకుంటున్నా, త్వరలో మీరు మంచి ప్రతిపాదనల గురించి తెలుసుకుంటారు ” అన్నాడు. అసలు 2020లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగి ఉండకపోతే తాను గెలిచి ఉంటే ఉక్రెయిన్‌ యుద్ధమే వచ్చి ఉండేది కాదని తన స్వంత ట్రూత్‌ సోషల్‌ వేదికలో రాసుకున్నాడు.
ఉక్రెయిన్‌ సంక్షోభం మంగళవారం నాడు 1,147వ రోజులో ప్రవేశించింది.ఏవైనా అనూహ్య నాటకీయ పరిణామాలు జరిగితే తప్ప ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎప్పుడు ముగిసేది కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఆదివారంనాడు సమీ అనే పట్టణంపై రష్యన్‌ క్షిపణులు, నియంత్రిత బాంబులతో జరిపినదాడిలో 35 మంది మరణించగా, నలభై మంది ఆసుపత్రిపాలయ్యారు. ఇంకా పదకొండు మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దాడి ఒక చర్చ్‌ మీద జరిగిందని ఉక్రెయిన్‌, కాదు మిలిటరీ అధికారుల సమావేశం మీద అని రష్యా ప్రకటించింది. రష్యా తరఫున కిరాయి సైనికులుగా పని చేస్తున్న ఇద్దరు చైనా జాతీయులను పట్టుకున్నామని ఉక్రెయిన్‌ ప్రదర్శించగా అలాంటిదేమీ లేదని మాస్కో, బాధ్యతా రహితంగా ఆరోపణలు చేయవద్దని బీజింగ్‌ హెచ్చరించింది. చైనీయులను కిరాయి సైనికులుగా తీసుకుంటున్నట్లు జెలెన్‌స్కీ ఆరోపించాడు. గతంలో ఉత్తరకొరియా నుంచి సైనికులను పంపినట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు చైనాను కూడా వివాదంలోకి లాగే ఎత్తుగడతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ట్రంప్‌ ప్రకటించిన పన్నుల దాడికి తీవ్ర ప్రతిఘటన, దేశీయంగా వ్యతిరేకత వ్యక్తం కావటంతో మూడు నెలల పాటు సుంకాల విధింపు అమలును వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. దాన్నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు లేదా మరొక ఎత్తుగడతో గానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ విభజన మాదిరి ఉక్రెయిన్‌ విభజన గురించి అమెరికా చర్చకు తెరలేపింది. త్వరలో మంచి ప్రతిపాదనలను మీరు చూస్తారని విలేకర్లతో ట్రంప్‌ చెప్పింది దీని గురించే అన్నది స్పష్టం.
ట్రంప్‌ ప్రతినిధి కెయిత్‌ కెలోగ్‌ ఉక్రెయిన్‌ విభజన ప్రతిపాదనను వెల్లడించాడు. దాని మీద తీవ్ర విమర్శలు రావటంతో తన మాటలకు తప్పుడు అర్ధం చెప్పారని ఆరోపించాడు. శాంతి ఒప్పందం కుదరాలంటే కోల్పోయిన ప్రాంతా ల గురించి మరిచి పోవాలని గతంలోనే ట్రంప్‌, అతగాడి యంత్రాంగం ఉక్రెయిన్‌కు చెప్పింది.ఇప్పుడు కెలోగ్‌ దాన్నే మరింత స్పష్టంగా వెల్లడించాడు. అమెరికా పధకం ప్రకారం ఉక్రెయిన్‌ను నాలుగు ముక్కలుగా చేస్తారు. మొదటి జోన్‌లో బ్రిటన్‌, ఫ్రెంచి దళాలతో పాటు ఇతర దేశాల మిలిటరీ కూడా చేరి పర్యవేక్షణ జరుపుతుంది. రెండవ జోన్‌ పూర్తిగా ఉక్రెయిన్‌ మిలిటరీ ఆధీనంలో ఉంటుంది. మూడవది ఉక్రెయిన్‌, రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాల మధ్య 29 కిలోమీటర్ల వెడల్పున ఎవరూ ప్రవేశించకూడని ప్రాంతం, నాలుగవది క్రిమియాతో సహా, స్వాతంత్య్రం ప్రకటించుకుని రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలు. నాటో లేదా నాటో కూటమిలోని దేశాలకు చెందిన మిలిటరీ ఉనికిని ఉక్రెయిన్‌లో అంగీకరించేది లేదని గతంలోనే రష్యా స్పష్టం చేసింది. మొదటి జోన్‌ పేరుతో నాటో దేశాల దళాలను ఉంచాలన్న అమెరికా ఎత్తుగడ ఆరని రావణకాష్టం వంటిదే. రెండవ ప్రపంచ యుద్ధంలో విడదీసి వియత్నాం దక్షిణ ప్రాంతంలో శాశ్వతంగా తిష్టవేసేందుకు అమెరికా వేసిన ఎత్తుగడను అక్కడి జాతీయ వాదులు, కమ్యూనిస్టులు ప్రతిఘటించి అమెరికా సేనలను తరిమివేశారు. కొరియాను కూడా అలాగే విభజించి ఉభయ కొరియాలు విలీనం కాకుండా అడ్డుపడుతున్నారు. తైవాన్‌ దీవి చైనా అంతర్భాగమే అని అధికారికంగా గుర్తిస్తూనే చైనా ప్రధాన భూభాగంతో విలీనానికి తగిన తరుణం అసన్నం కాలేదంటూ రెచ్చగొడుతున్నారు. తమ దేశాన్ని విభజించటానికి వీల్లేదని, అన్ని ప్రాంతాలు తమకు రావాల్సిందేనని ఉక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీ గతంలోనే చెప్పాడు. దీనికి ఐరోపాలోని ఇతర దేశాలు కూడా అంగీకరించే అవకాశాల్లేవు. జర్మనీ విభజనకు ఉక్రెయిన్‌ సమస్యకు అసలు పోలికే లేదు. యుద్ధం కొనసాగితే రష్యన్లు జెలెన్‌స్కీని బందీగా పట్టుకుంటారని లేదా ఉక్రెయిన్‌ మిలిటరీలోని జాతీయవాదులు, గూఢచార ఏజెన్సీ జెలెన్‌స్కీని పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు.నాలుగు ముక్కలుగా విభజన చేస్తే అక్కడ తమకు పనేమీ ఉండదని, ఇతర చోట్ల వ్యవహారాలను చక్కపెట్టు కోవచ్చని, పరువు దక్కించుకోవచ్చని అమెరికా భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. రష్యా మీద ఆంక్షలు విధించిన ఐరోపా దేశాలు అక్కడి నుంచి ముడిచమురు తప్ప చౌకగా సరఫరా అవుతున్న గ్యాస్‌ను ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నాయి. దాన్ని కూడా నిలిపివేస్తే అనేక దేశాల్లో పాలక పార్టీలకు నూకలు చెల్లుతాయని భయపడుతున్నారు. అందువలన సంక్షోభం ఎక్కువకాలం కొనసాగటం అనేక దేశాలకు ఇష్టం లేదని, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకు పోవటమా, అస్తవ్యస్త పరిస్థితులను ఎదుర్కోవటమా అనే గుంజాటనలో ఉన్నాయి. తన చమురు, గ్యాస్‌ లావాదేవీల వివరాలను బహిర్గతం పరచటం నిలిపివేసిన రష్యా వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు అదే కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
సిబిఎస్‌ టీవీ ”60నిమిషాలు” కార్యక్రమంలో ఆదివారం నాడు జెలెన్‌స్కీతో జరిపిన ముఖాముఖిని ప్రసారం చేసింది.దాని మీద ట్రంప్‌ మండిపడ్డాడు. ఉక్రెయిన్‌ పోరు గురించి తారుమారు చేసిన వాస్తవాల మీద ఆధారపడి ట్రంప్‌ యంత్రాంగం పని చేస్తున్నదని జెలెన్‌స్కీ ఆరోపించాడు. తాముగా యుద్ధాన్ని ప్రారంభించలేదని, చూస్తుంటే పుతిన్‌ ప్రారం భించిన యుద్ధాన్ని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ సమర్ధిస్తున్నట్లు కనిపిస్తున్నదన్నాడు. రష్యా దురాక్రమణదారు, తాము బాధి తులమని, పోరు మధ్యలో మరొకదాని కోసం అటూ ఇటూ చూడలేమన్నాడు. అమెరికా మాట మాత్రమే మార్చలేదని, వాస్తవాన్ని కూడా తారుమారు చేసిందని అరోపించాడు. ట్రంప్‌ ఒక నిర్ణయం తీసుకొనే ముందు స్వయంగా వచ్చి పరిశీలించాలన్నాడు. ఎక్కడికైనా వెళ్లి చూడవచ్చు, దాడులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. అమెరికా మా వ్యూహాత్మక, బలమైన భాగస్వామి అయితే సందేహాలున్నాయి. అమెరికా పౌరులను నేను సందేహించను, వారు మాతోనే ఉన్నారు, కానీ దీర్ఘకాలిక యుద్ధంలో ఐరోపా నుంచి అమెరికా దూరంగా జరగవచ్చు అని ఐరోపాలో ప్రతిఒక్కరూ భయపడుతున్నారు. అమెరికా లేకపోతే మేము భారీగా నష్టపోతాం,మానవ, భూభాగాలను కోల్పోతాము. ఏదో విధంగా ఈ యుద్ధాన్ని ముగించాలి అని జెలెన్‌స్కీ చెప్పాడు. ఆయన వ్యాఖ్యలు ప్రతికూల ఫలితాలనిస్తాయని జెడివాన్స్‌ కార్యాలయం హెచ్చరించింది. తమ ఉపాధ్యక్షుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం కంటే వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవటంపై కేంద్రీకరించాలని పత్రికా కార్యదర్శి టేలర్‌ వాన్‌ కిర్క్‌ ప్రకటించాడు. ఈ కార్యక్రమం వక్రీకరణలతో కూడుకుని ఉన్నందున నియంత్రణ సంస్థ ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌(ఎఫ్‌సిసి) తీసుకొనే చర్యల్లో సిబిఎస్‌ టీవీ ప్రసార అనుమతులను రద్దుతో పాటు భారీ మొత్తంలో జరిమానా విధించాలని ట్రంప్‌ చెప్పాడు. ఇది బెదిరించటం తప్ప మరొకటి కాదు. ప్రతివారం 60 నిమిషాల కార్యక్రమంలో అసభ్యకరమైన, అవమానకరంగా ట్రంప్‌ పేరు ప్రస్తావించు తున్నారు.వాటన్నింటిలో ఇది పరాకాష్ట అని ట్రంప్‌ తన ట్రూత్‌ సామాజిక వేదికలో పోస్టు పెట్టాడు. ఎన్నికలకు ముందు గతేడాది తనకు వ్యతిరేకంగా కమలా హారిస్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ మోసపూరితంగా ఎడిట్‌ చేసి కార్యక్రమాన్ని ప్రసారం చేశారంటూ ట్రంప్‌ సిబిఎస్‌ ఛానల్‌ యజమాని పారామౌంట్‌ కంపెనీ మీద కేసు దాఖలు చేశాడు.తమను దెబ్బతీసేందుకు ప్రయత్ని స్తున్నాడని ఆ కంపెనీ ఆరోపించింది. ట్రంప్‌ దాఖలు చేసిన 20 బిలియన్‌ డాలర్ల పరువు నష్టం కేసులో ఒక అంగీకారానికి వచ్చేందుకు ఇరు పక్షాలూ మధ్యవర్తిత్వానికి తెరతీసినట్లు గత నెలలో న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది.
ఉక్రెయిన్‌లో శాంతికోసం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవటం అంత తేలిక కాదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ వ్యాఖ్యానించాడు. మూల కారణాల సంగతి చూడకుండా అమెరికా ప్రతిపాదనలను అంగీకరించ లేమన్నాడు.అమెరికా కనీసం సమస్య లోతులోకి వెళుతున్నది, ఐరోపా వైపు నుంచి వెర్రి ఆవేశం తప్ప మరొకటి కనిపించటం లేదన్నాడు. అంతకుముందు ట్రంప్‌ ప్రతినిధి స్టీవ్‌ విట్‌కోఫ్‌ సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో పుతిన్‌తో చర్చలు జరిపాడు.పుతిన్‌ శాశ్వత శాంతిని కోరుతున్నాడని, దాని గురించి చర్చించాల్సి ఉందన్నాడు. సంక్లిష్టమైన పరిస్థితి ఉందన్నాడు. మరోవైపున సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు చూస్తున్నారు. అమెరికా పార్లమెంటు దిగువ సభలో ఉక్రెయిన్‌కు మరింతగా మిలిటరీ సాయం అందించాలని, రష్యాపై ఆంక్షలను పెంచాలని తదితర అంశాలతో డెమాక్రాట్లు ఒక బిల్లును ప్రదిపాదించగా దాన్ని బహిర్గతం చేయలేదు. దీర్ఘశ్రేణి తారుస్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలనే జర్మనీ నిర్ణయాన్ని మాస్కో తప్పు పట్టింది. పరిస్థితిని మరింత దిగజార్చేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని హెచ్చరించింది. ఆయుధాల కొనుగోలుకు వందకోట్ల డాలర్లు ఇవ్వాలని బ్రిటన్‌ నిర్ణయించింది. ఉక్రెయిన్‌లో పోరు విషయానికి వస్తే రష్యన్లు ఎత్తుగడలను మార్చి మెల్లమెల్లగా దాడులను విస్తరిస్తున్నారు. ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతిఘటించే స్థితిలో లేదు.ఐరోపా దేశాలు పరువు కోసం పాకులాడు తున్నాయి. ఉక్రెయిన్‌ పోరులో రష్యా గెలిస్తే రానున్న రోజుల్లో తమ భవిష్యత్‌ మరింతగా ఇబ్బందుల్లో పడుతుందని అవి అంతర్గతంగా భయపడుతున్నాయి.
ఎం కోటేశ్వరరావు
8331013288

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు