Tuesday, April 29, 2025
Navatelangana
Homeతాజా వార్తలుఉగ్రదాడి..కేంద్రం వైఫల్యమే..

ఉగ్రదాడి..కేంద్రం వైఫల్యమే..

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌లో క్యాండిల్‌ ప్రదర్శన
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి జరిగిందని, పౌరులు ప్రాణం కోల్పోయారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా, మరణించిన టూరిస్టులకు నివాళులర్పిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌ వరకు క్యాండిల్‌ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలకు, టూరిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో పెద్ద నోట్ల రద్దు సందర్భంలో, 370 ఆర్టికల్‌ రద్దు సందర్భంలో దేశంలో తీవ్రవాదం లేకుండా పోతుందని, కాశ్మీర్‌ శాంతిభద్రతలతో విలసిల్లుతుందని ప్రధాని మోడీ చెప్పారని గుర్తు చేశారు. కానీ అవి అబద్ధపు మాటలని తేలిందన్నారు. ఉగ్రవాద దాడికి కేంద్రం బాధ్యత వహించాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఒకపక్క ఉగ్రవాద దాడి జరిగి అమాయక ప్రజలు మరణించి దేశ ప్రజలందరూ నివాళులర్పిస్తుంటే.. మరోపక్క గోడీ మీడియా, ఆర్‌ఎస్‌ఎస్‌ సోషల్‌ మీడియా, వాట్సప్‌ యూనివర్సిటీ గ్రూపులు హిందూ ముస్లిం తగాదాలను రెచ్చగొట్టే పద్ధతిలో పోస్టింగులు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. తప్పుడు ప్రచారాలను ఖండించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు కె.ఈశ్వర్‌ రావు, కె.రమేష్‌, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, సీనియర్‌ నాయకులు పి.రాజారావు, రాష్ట్ర నాయకులు పి.సుధాకర్‌, ఏ.సునీత, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు జె.కుమారస్వామి, నగర కోశాధికారి కె.అజరు బాబు, నగర నాయకులు టి.మహేందర్‌, ఎం.అజరుబాబు, సి.మల్లేష్‌, ఎం.సత్యనారాయణ, పి.శ్రీనివాస్‌, జి.నరేష్‌, కృష్ణ, రమ, పద్మ, టీవీకే ప్రసాద్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు